Share News

Hyderabad Nights Plagued by Intoxicated Youths: మహానగరంలో మత్తు మూకలు!

ABN , Publish Date - Dec 26 , 2025 | 06:08 AM

మహానగరంలో మత్తు మూకలు చెలరేగిపోతున్నాయి. గంజాయి రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా, స్మగ్లర్లను కటకటాల్లోకి నెడుతున్నా..

Hyderabad Nights Plagued by Intoxicated Youths:  మహానగరంలో మత్తు మూకలు!

  • రాత్రిళ్లు గంజాయి, మద్యం మత్తులో గుంపులుగా తిరుగుతూ అరాచకాలు

  • ఎదురుచెప్పిన స్థానికులపై దాడులు

  • వాహనదారులతోనూ కొట్లాటలు

  • పోలీసులను లెక్కచేయకుండా వీరంగం

  • ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా ఆగని గంజాయి రవాణా, వాడకం

  • విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న యువత

  • రాత్రిళ్లు గస్తీని పెంచిన పోలీసులు

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): మహానగరంలో ‘మత్తు’ మూకలు చెలరేగిపోతున్నాయి. గంజాయి రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా, స్మగ్లర్లను కటకటాల్లోకి నెడుతున్నా.. గంజాయి రవాణా, వినియోగం ఆగడం లేదు. 20 ఏళ్లుకూడా లేని యువకులు గంజాయు, ఇతర చెడు వ్యసనాలకు బానిసై, పోకిరీ చేష్టలకు దిగుతున్నారు. కత్తులు, బ్లేడ్‌లు, నకిలీ తుపాకులతో తిరుగుతూ హల్‌చల్‌ చేస్తున్నారు. గంజాయి, మద్యం మత్తులో రాత్రిళ్లు రోడ్లపై తిరుగుతూ.. చిన్న చిన్న విషయాలకే స్థానికులపై, వాహనదారులపై గొడవలకు దిగి, దాడులకు పాల్పడుతున్నారు. పోలీసులను సైతం లెక్క చేయకుండా వీరంగం సృష్టిస్తున్నారు. పలు ప్రాంతాల్లో రాత్రిళ్లు కొట్లాటలు, గొడవలు, హత్యాయత్నాలు, హత్యలు తరచూ జరుగుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు పెరిగిపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో పోలీసులు పలు ప్రాంతాల్లో రాత్రిపూట పెట్రోలింగ్‌ను ఉధృతం చేశారు. ఎలాంటి కారణం లేకుండా బయట తిరుగుతున్న వారిని గుర్తించి, తీవ్రంగా హెచ్చరించి వదిలేస్తున్నారు.

  • ఇటీవల అంబర్‌పేటలో అర్ధరాత్రి ఓ యువకుడిపై పోకిరీలు అకారణంగా రాడ్లు, కర్రలతో దాడి చేసి కొట్టారు. తీవ్ర గాయాలపాలైన యువకుడిని వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

  • ఓ బాలింతను ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్తున్న అంబులెన్సుకు వనస్థలిపురంలో రోడ్డుమీద గంజాయి మత్తులో తిరుగుతున్న పోకిరీ గ్యాంగ్‌ అడ్డుగా వచ్చింది. పక్కకు తప్పుకొని దారి ఇవ్వాలని అంబులెన్స్‌ డ్రైవర్‌ అన్నందుకు వాళ్లు అంబులెన్స్‌ను రోడ్డుపైనే ఆపేసి డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డారు. వారిని వారించేందుకు ప్రయత్నించిన ఓ సెక్యూరిటీ గార్డుపై విచక్షణారహితంగా దాడి చేశారు.

  • కేపీహెచ్‌బీ హైదర్‌నగర్‌ పరిధిలో ఒక వ్యక్తిపై ఓ పార్టీకి చెందిన స్థానిక నేతలు మద్యం మత్తులో దాడికి పాల్పడి తీవ్రంగా గాయపర్చారు.

  • కేపీహెచ్‌బీ కాలనీ పరిధిలో ఇంటి ముందు బైకులు పార్క్‌ చేయవద్దన్నందుకు దంపతులపై పోకిరీల గుంపు తీవ్రంగా దాడికి పాల్పడటం కలకలం సృష్టించింది.


  • కొన్నిరోజుల క్రితం జీడిమెట్లలో అర్ధరాత్రి గంజాయి బ్యాచ్‌ రెచ్చిపోయింది. గంజాయి విక్రేతలు తమను పట్టుకునేందుకు వచ్చిన ఎక్సైజ్‌ అధికారుల ముందే.. ఓ యువకుడిని బ్లేడ్లతో విచక్షణారహితంగా గాయపరిచి పారిపోయారు.

  • ఇటీవల ముసాపేటలో ఓ యువకుడు గంజాయి మత్తులోనడిరోడ్డుపై హల్‌చల్‌ చేశాడు. ఓ కారును అడ్డగించి, దానిపై ఎక్కి కూర్చున్నాడు. కారులోని వారిని బలవంతంగా కిందకు దింపి దాడికి ప్రయత్నించాడు. సమీపంలోని పోలీసులు అక్కడికి చేరుకుని, పోకిరీని అదుపులోకి తీసుకున్నారు.

  • రామంతపూర్‌లో ఓ యువకుడు అర్ధరాత్రి గంజాయి మత్తులో కత్తితో తిరుగుతూ.. రోడ్డుపై వెళ్తున్నవారిని తిడుతూ, దాడులకు ప్రయత్నించాడు.

  • ఇటీవల అల్లాపూర్‌లో ఒక చికెన్‌ షాపు యజమానిపై అల్లరిమూక దాడికి పాల్పడింది. దుకాణం ముందు సిగరెట్టు తాగొద్దన్నందుకు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు.

  • కంచన్‌బాగ్‌ పరిధిలో కిరాణా దుకాణం యజమానిపై పక్కనే ఉన్న పాన్‌షాపు నిర్వాహకుడు, అత డి గ్యాంగ్‌ దాడికి పాల్పడింది. తీవ్ర గాయాలపాలైన బాధితుడు చికిత్స పొందుతూ మరణించారు.

  • సైబరాబాద్‌ పరిధిలోని షాబాద్‌లో వైన్‌షాపులో చోరీకి ప్రయత్నిస్తున్న దొంగను వాచ్‌మన్‌ అడ్డుకున్నాడు. మత్తులో ఉన్న ఆ దొంగ వాచ్‌మన్‌ తలపై పారతో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

Updated Date - Dec 26 , 2025 | 06:08 AM