Share News

AP Revenue Department: ప్రతి దరఖాస్తుకూ జవాబుదారీ

ABN , Publish Date - Dec 26 , 2025 | 05:03 AM

ప్రజా ఫిర్యాదులకు జవాబుదారీ ఉండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలపై రెవెన్యూశాఖ కదిలింది.

AP Revenue Department: ప్రతి దరఖాస్తుకూ జవాబుదారీ

  • అన్ని కలెక్టరేట్లలోనూ రెవెన్యూ డెస్క్‌

  • డిప్యూటీ కలెక్టర్లకు బాధ్యత

  • విన్నపాలకు ఆధార్‌ అనుసంధానం

  • దరఖాస్తుదారుడికి సర్టిఫైడ్‌ కాపీ

  • స్వీకరణ, పరిష్కారానికి ఓ సాఫ్ట్‌వేర్‌

  • రెవెన్యూ శాఖ నిర్ణయం

అమరావతి, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదులకు జవాబుదారీ ఉండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలపై రెవెన్యూశాఖ కదిలింది. రెవెన్యూశాఖ సేవలు కోరుతూ ప్రజలు ఇచ్చే దరఖాస్తుల స్వీకరణ, పరిష్కారానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. ప్రతి జిల్లా కలెక్టరేట్‌ పరిధిలో రెవెన్యూ డెస్క్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీన్ని స్పెషల్‌ రెవెన్యూ డెస్క్‌గా పరిగణిస్తారు. మన్యం జిల్లాలో కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి రెవెన్యూ క్లినిక్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి కలెక్టరేట్‌ పరిధిలోనూ పూర్తిస్థాయిలో పనిచేసేలా స్పెషల్‌ రెవెన్యూ డెస్క్‌ను ఏర్పాటు చేయాలని రెవెన్యూశాఖ నిర్ణయించింది. బుధవారం రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అఽధ్యక్షతన జరిగిన కీలక భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రజలు రెవె న్యూ సేవలు కోరుతూ ఇచ్చే ప్రతి విన్నపానికీ జవాబుదారీతనం తీసుకువచ్చేందుకు ఈ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ డెస్క్‌కు డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారిని నియమిస్తారు. ప్రతి సోమవారం వచ్చే అర్జీలతోపాటు, సాధారణంగా కలెక్టరేట్‌కు వచ్చే విన్నపాలను కూడా ఈ డెస్క్‌ పర్యవేక్షిస్తుంది. ప్రతి అర్జీకీఓ ఆన్‌లైన్‌ నంబర్‌ కేటాయిస్తారు. ఆ అర్జీపై దరఖాస్తుదారు ఆధార్‌, ఫోన్‌ నంబర్‌ ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు. పౌరుల నుంచి వచ్చే అర్జీలు డెస్క్‌ తీసుకున్నాక దాని పరిష్కారం ఎలా ఉంటుందో తెలిపే కార్యాచరణ కు సంబంధించిన సర్టిఫైడ్‌ కాపీని దరఖాస్తు దారుకు అందించనున్నారు. దీని వల్ల తన సమస్య తీవ్రత ఏమిటి....ఎప్పటిలోగా పరిష్కారం అవుతుంది... అది ఏ స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటే పరిష్కారం అవుతుంది....ఇందుకు పట్టే సమయం ఎంతన్నది ఆ కాపీలో ఉంటుంది. దానిపై డిప్యూటీ కలెక్టరు సంతకం చేస్తారు. దీంతో పౌరులు ఇచ్చే పిటిషన్లకు జవాబుదారీ ఉంటుందని, దాని పరిష్కారం కూడా పారదర్శకంగా, జవాబుదారీ విధానంలో ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. డెస్క్‌లో కీలకంగా చెక్‌లిస్టు విధానం ప్రతిపాదించారు. అంటే, ఒక పిటిషన్‌ ఎప్పుడు వచ్చింది? దానిపై ఇచ్చిన కార్యాచరణ ఏమిటి? అది ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది? అంతిమంగా దాని పరిష్కారం ఏ స్థాయిలో ఉంటుంది? ఇంకా పిటిషన్‌ ఇచ్చిన పౌరుడికి సర్టిఫైడ్‌ కాపీ ఇచ్చారా.. వంటి అంశాలు అందులో ఉంటాయి. పిటిషన్‌ స్వీకరించినప్పటి నుంచి పరిష్కారం వరకు దశలవారీగా చెక్‌లిస్టులోని అంశాలను ఎంపిక చేస్తారు. దీని వల్ల ఒక పిటిషన్‌ ఎప్పుడు వచ్చింది...అది ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చని చెబుతున్నారు.


ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌.. రెవెన్యూ డెస్క్‌కు పౌరులు ఇచ్చే పిటిషన్లు తీసుకోవడం, వాటి పరిష్కారం, ఇంకా అవి తిరిగే మార్గాలను ప్రభుత్వ స్థాయిలో తెలుసుకునేలా ప్రత్యేకంగా ఓ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని రెవెన్యూశాఖ భావిస్తోంది. దీనివల్ల పౌరుల పిటిషన్లకు పారదర్శకత, జవాబుదారీతనం ఉంటాయని చెబుతోంది. ఒకే అంశంపై పౌరులు పిటిషన్‌లు ఇస్తున్నారా? గతంలో ఇచ్చిన దానిపై తీసుకున్న నిర్ణయాలు ఏమిటి? వాటి కార్యాచరణ ఎలా ఉందనేది కూడా ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా తెలుసుకునే ఏర్పాట్లు చేయాలనుకుంటున్నారు. ప్రజల నుంచి తీసుకునే పిటిషన్లపై మండల, జిల్లా స్థాయిలో కేవలం ఈ-ఆఫీస్‌ ఫైల్స్‌నే నడిపించనున్నారు. ఈ దిశగా సాఫ్ట్‌వేర్‌ను డెవలప్‌ చేయలనుకుంటున్నారు.

Updated Date - Dec 26 , 2025 | 05:03 AM