Monsoon: సీమలో వర్షాలు.. కోస్తాలో ఎండలు
ABN , Publish Date - Aug 07 , 2025 | 04:28 AM
రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం నెలకొంది. రాయలసీమలో ఎక్కువచోట్ల వర్షాలు కురుస్తుండగా, కోస్తాలో
నెల్లూరు, కావలి, ఒంగోలు, తునిల్లో 37 డిగ్రీల ఉష్ణోగ్రత
విశాఖపట్నం, అనంతపురం అర్బన్, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం నెలకొంది. రాయలసీమలో ఎక్కువచోట్ల వర్షాలు కురుస్తుండగా, కోస్తాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. రుతుపవనాల ప్రభావంతో కాకుండా ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు, ఎండ తీవ్రతతో ఏర్పడిన క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతోనే వర్షాలు కురుస్తున్నాయి. వర్షం తగ్గిన తర్వాత మళ్లీ ఉక్కపోత, వేడి వాతావరణం కొనసాగుతున్నాయి. నెల్లూరు, కావలి, ఒంగోలు, తునిల్లో బుధవారం 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా రాయలసీమ, ఉత్తర తమిళనాడుకు ఆనుకుని బంగాళాఖాతంలో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు, బంగాళాఖాతం నుంచి రాయలసీమ, కర్ణాటక మీదుగా అరేబియా సముద్రం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నాయి. వాటి ప్రభావంతో రాయలసీమలో ఎక్కువచోట్ల, కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో ఎక్కువచోట్ల, ఉత్తరకోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శుక్రవారం దక్షిణ బంగ్లాదేశ్ పరిసరాల్లో ఆవరించనున్న ఉపరితల ఆవర్తనం బలపడి ఉత్తర బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉన్న రుతుపవనద్రోణి తూర్పుభాగం దక్షిణ దిశగా వచ్చే అవకాశం ఉందని, దీంతో ఈనెల 9వ తేదీ తర్వాత ఉత్తర కోస్తాకు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు రోజులుగా కురిసిన వర్షాలు రైతులకు ఊరటనిచ్చాయి. ఖరీఫ్ ఆరంభంలో పదును వర్షం లేక ప్రధాన పంట వేరుశనగ అనుకున్న స్థాయిలో సాగు కాలేదు. తాజాగా కురిసిన వర్షాలకు ప్రత్యామ్నాయ పంటలుగా కంది, ఆముదం విత్తేందుకు రైతులు సిద్ధమయ్యారు. అనంతపురం జిల్లాలోని 30 మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. గుత్తిలో 71.4 మి.మీ, పెద్దవడుగూరులో 70.4, గుంతకల్లులో 68.2, రాయదుర్గంలో 64.2, శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రిలో 54.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. వేదవతి హగరి నదితోపాటు వాగులు, వంకలు జలకళను సంతరించుకున్నాయి. పంట పొలాల్లోకి నీరు చేరింది. అనంతపురం రూరల్ మండలం చియ్యేడులో బుధవారం తెల్లవారుజామున వర్షానికి ఒక ఇంటి మిద్దె కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఒక పార్టీని టార్గెట్ చేస్తారా.. ఎంపీపై సుప్రీం అసహనం, రూ.10 లక్షల జరిమానా
ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు
For AndhraPradesh News And Telugu News