Ashwini Vaishnaw: ఏపీకి మరో గుడ్ న్యూస్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
ABN , Publish Date - Feb 03 , 2025 | 06:02 PM
Ashwini Vaishnaw: సాధారణ బడ్జెట్ పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టింది. తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి ఎన్నెన్ని కేటాయింపులు జరిగాయో.. ఆ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 03: తెలంగాణ నుంచి మరిన్ని వందే భారత్ రైళ్లు నడుపుతున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ రాష్ట్రంలో 5 వందే భారత్ రైళ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు రూ.5,337 కోట్లు కేటాయించామని తెలిపారు. అయితే గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇది రూ.886 కోట్లు మాత్రమేనని ఆయన గుర్తు చేశారు. సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో రైల్వే బడ్జెట్ కేటాయింపులపై ఆయన వివరించారు.
తెలంగాణలో ఇప్పటి వరకు మంజూరైన ప్రాజెక్టులు మొత్తం రూ.41,677 కోట్లు అని చెప్పారు. అందులో కాజీపేట ప్రొడక్షన్ యూనిట్‌తోపాటు కొత్త రైల్వే ప్రాజెక్ట్స్ సైతం ఉన్నాయని వివరించారు. 1,326 కిలోమీటర్ల మేర కవచ్ ప్రాజెక్ట్ రానుందని.. ఇది 6 నుంచి 7 నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఈ తరహ వ్యవస్థ జర్మనీ, ఫ్రాన్స్, రష్యా తదితర దేశాల్లో అమలు చేయడానికి దాదాపు 20 ఏళ్లు పట్టిందన్నారు. అలాగే నమో భారత్ రైళ్లు ( సమీప నగరాల మధ్య), అమృత్ భారత్ రైళ్లు ( స్వల్ప ఖర్చుతో మెరుగైన సదుపాయాలు కలిగిన రైళ్లు) అందుబాటులోకి తీసుకు వస్తున్నామని పేర్కొన్నారు.
తెలంగాణలో100 శాతం రైల్వే లైన్లు విద్యుదీకరణ పూర్తయిందని తెలిపారు. అలాగే రూ.41,677 కోట్ల పనులు జరుగుతున్నాయని వివరించారు. ఇక సికింద్రాబాద్ నుంచి కవచ్ వ్యవస్థ పని చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 1,300 కిలోమీటర్ల మేర కవచ్ వ్యవస్థను ఏర్పటు చేశామన్నారు. రానున్న ఆరేళ్లలో కవచ్ వ్యవస్థను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే 50 నమో భారత్ రైళ్లకు కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించామని ఆయన సోదాహరణగా వివరించారు.
Also Read: ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం
అదే విధంగా 1000 కిలోమీటర్లు.. కేవలం రూ.450తో ప్రయాణించేలా నాన్ ఏసీ అమృత్ భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయని వివరించారు. ఇక100 అమృత్ భారత్ రైళ్లకు బడ్జెట్‌లో నిధులు కేటాయించామని చెప్పారు. మరికొద్ది రోజుల్లో 200 వందేభారత్ రైళ్లు రాబోతున్నాయని తెలిపారు. ఈ బడ్జెట్‌లో కొత్త ప్రాజెక్టులు లేవన్నారు. కొత్త రైల్వే లైన్లను ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నామన్నారు. వందే భారత్ రైళ్లలో ఆక్యుపెన్సీ వంద శాతం ఉందన్నారు.
Also Read: అక్కడ మతం మారారా.. జైలు శిక్షతోపాటు భారీ జరిమానా
ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే అభివృద్ధి రూ. 9,417 కోట్లు కేటాయించామన్నారు. ఇది యూపీఏ హయాంలో కంటే 11 రెట్లు అధికంగా నిధులు కేటాయించామని తెలిపారు. అలాగే ఏపీలో రూ. 84,559 కోట్ల ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయన్నారు. అందులోభాగంగా 73 రైల్వేస్టేషన్లు అభివృద్ధి చేశామని.. నూటికి నూరు శాతం రైల్వే లైన్ల విద్యుదీకరణ పూర్తయిందన్నారు.
Also Read: హెల్మెట్‌కి సెల్యూట్.. ప్రాణాలు కాపాడడం అదుర్స్
ఇక 1,560 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ నిర్మించామని వెల్లడించారు. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు సహకరిస్తున్నారని... ఈ నేపథ్యంలో ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. 8 వందే భారత్ రైళ్లు16 జిల్లాలను కలుపుతూ ఏపీలో సేవలందిస్తున్నాయన్నారు. భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని వందే భారత్ రైళ్లు వస్తాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ సందర్భంగా ప్రకటించారు.
అలాగే దేశవ్యాప్తంగా 110 కిలోమీటర్ల వేగంతో వెళ్లేందుకు రైల్వే ట్రాక్స్‌ను సిద్ధం చేస్తున్నామన్నారు. అయితే కొన్ని రూట్లలో 130 కిలోమీటర్ల వేగంతో.. మరికొన్ని రూట్లలో 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించేందుకు ట్రాక్స్ సిద్దం చేస్తున్నామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు.
For AndhraPradesh News And Telugu News