Share News

Delhi Assembly Elections: ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం

ABN , Publish Date - Feb 03 , 2025 | 05:20 PM

Delhi Assembly Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం ఫుల్ స్టాప్ పడింది. ఈ ఎన్నికల్లో ఢిల్లీ పీఠం కైవసం చేసుకొనేందుకు బీజేపీ, ఆప్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.

Delhi Assembly Elections: ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 03: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ఈ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం అంటే.. ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం 5.00 గంటలకు ఈ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. దీంతో వివిధ రాజకీయ పార్టీల నేతలు.. పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోనేందుకు ఓటర్లను సమాయత్తం చేసేందుకు సిద్దమవుతోన్నారు. ఇక ఈ ఎన్నికల్లో ప్రధాన పోరు.. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉండనుంది.

అయితే వరుసగా మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని అందుకోవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మరోవైపు ఢిల్లీలో ఆప్ పాలనకు చరమ గీతం పాడాలని బీజేపీ భావిస్తోంది. అదీకాక ఈ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు కొద్ది రోజుల ముందు ఆప్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు.. బీజేపీలో చేరారు. కానీ ఈ ఎన్నికల్లో వారికి టికెట్లు కేటాయించ లేదు. దీంతో వారంతా బీజేపీలో చేరారు.


ఇక ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. అలాగే ఇదే కూటమిలోని పక్షాలైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, సమాజ వాదీ పార్టీలు నేతలు.. ఈ ఎన్నికల వేళ ఆప్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అలాగే బీజేపీకి మద్దతుగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాల్లో ఒకటైన టీడీపీ ప్రచారం నిర్వహించింది.

Also Read: అక్కడ మతం మారారా.. జైలు శిక్షతోపాటు భారీ జరిమానా


దేశ రాజధాని న్యూఢిల్లీలో తెలుగు వారు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో బరిలో నిలిచిన అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తోపాటు పలువురు ఎంపీలు ఈ ప్రచారంలో పాల్గొన్నారు.

Also Read: హెల్మెట్‌కి సెల్యూట్.. ప్రాణాలు కాపాడడం అదుర్స్


అదీకాక కేంద్రంలోని బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ మధ్య వ్యవహారం ఉప్పు నిప్పులా ఉంది. 2024లో మద్యం కుంభకోణం.. మనీ లాండరింగ్ వ్యవహారంలో తొలుత డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, అనంతరం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌లను ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం వారిని తీహాడ్ జైలుకు తరలించింది. అయితే అరెస్ట్ అయిన వెంటనే డిప్యూటీ సీఎం పదవి మనీష్ సిసోడియా రాజీనామా చేశారు.


అరవింద్ కేజ్రీవాల్ సైతం సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది. కానీ అరవింద్ కేజ్రీవాల్‌కు షరతులతో కూడిన బెయిల్ రావడంతో.. ఆయన జైలు నుంచి విడుదలైన అనంతరం సీఎం పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల ఆశీర్వాదంతో మళ్లీ నెగ్గి.. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తానంటూ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.


దీంతో ఢిల్లీ సీఎంగా అతిషి బాధ్యతలు చేపట్టారు. అలాంటి వేళ జరుగుతోన్న ఈ ఎన్నికల్లో ఓటరు ఎవరికి పట్టం కడతాడనేది తెలియాలంటే మాత్రం ఫిబ్రవరి 8వ తేదీ వరకు ఆగాల్సిందే. ఎందుకంటే.. ఆ రోజు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5వ తేదీ పోలింగ్ జరుగుతుండగా.. ఫిబ్రవరి 8వ తేదీ ఫలితాలు వెలువడనున్నాయి.

For National News And Telugu News

Updated Date - Feb 03 , 2025 | 05:47 PM