Rajasthan: అక్కడ మతం మారారా.. జైలు శిక్షతోపాటు భారీ జరిమానా
ABN , Publish Date - Feb 03 , 2025 | 03:37 PM
Rajasthan: బలవంతపు మత మార్పిడులను నిరోధించేందుకు రాజస్థాన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకోసం.. కీలక బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.

జైపూర్, ఫిబ్రవరి 03: బలవంతపు మత మార్పిడులను నిరోధించేందుకు రాజస్థాన్‌లోని భజన్ లాల్ శర్మ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకోసం బడ్జెట్ సమావేశాల వేదికగా రాజస్థాన్ చట్టవిరుద్ద మత మార్పిడి నిషేధ బిల్లు 2024 (రాజస్థాన్ ప్రోహిబిషన్ ఆఫ్ అన్ లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలిజియన్ బిల్లు 2025)ను మంగళవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. ఈ బిల్లుపై అసెంబ్లీలో చర్చించి ఆమోద ముద్ర వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే గతేడాది అంటే 2024, నవంబర్‌లో ఈ బిల్లు ముసాయిదాను భజన్ లాల్ శర్మ నేతృత్వంలోని కేబినెట్ ఆమోదించిన సంగతి తెలిసిందే.
మత మార్పిడి చేసుకోవాలని నిర్ణయించుకోన్న వారు.. దాదాపు రెండు నెలల ముందు జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ క్రమంలో తాము మత మార్పిడి చేసుకోవాలని తమ సొంతంగా నిర్ణయం తీసుకున్నామని జిల్లా ఉన్నతాధికారి ముందు ఒప్పుకోవాల్సి ఉంది. ఇందులో ఎవరి బలవంతం కానీ.. ఎవరి ప్రోద్బలం కానీ లేదని తెలిపాలి. అనంతరం మత మార్పిడికి అనుమతి లభిస్తోంది. అయితే రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడులు చోటు చేసుకొంటున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో వాటిని నిరోధించేందుకు రాజస్థాన్‌లోని బీజేపీ ప్రభుత్వం ఈ తరహా చర్యలకు చేపట్టనుంది. ఓ వేళ షెడ్యూల్ కులాలు, తెగలకు చెందిన వారితోపాటు మహిళలు, మైనర్లను బలవంతంగా మత మార్పిడులకు పాల్పడితే.. రెండు నుంచి 10 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ. 25 వేల వరకు జరిమానా సైతం విధించే విధంగా ఈ బిల్లును రూపొందించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే.. బలవంతపు మతమార్పిడులకు అడ్డుపడే అవకాశాలు మెండుగా ఉన్నాయనే ఓ చర్చ అయితే రాష్ట్రంలో జోరందుకుంది. ఇక ఈ మత మార్పిడి నిరోధక బిల్లుపై రాజస్థాన మంత్రి కె.కె.బిష్ణోయ్ మాట్లాడుతూ.. లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా ఈ బిల్లును ప్రవేశపెడుతున్నామన్నారు. తద్వారా అమాయక బాలికలను ప్రలోభపెట్టడాన్ని ఆపవచ్చని ఆయన పేర్కొన్నారు.
గతేడాది రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ.. తన ఎక్స్ ఖాతా వేదికగా కీలక ప్రకటన చేశారు. రాజస్థాన్ ప్రభుత్వం అక్రమ మతమార్పిడికి అడ్డుకట్ట వేసేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సీఎంవోలో జరిగిన కేబినెట్ భేటీలో ప్రేరేపరించండం లేదా మోసం చేసి మత మార్పిడులు జరిగే ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు అసెంబ్లీలో రాజస్థాన్ చట్టవిరుద్ద మత మార్పిడి నిషేధ బిల్లు 2024ను ప్రవేశ పెట్టాలని నిర్ణయించామన్నారు. ఒక వ్యక్తి చట్టవిరుద్ద మత మార్పిడి కోసం వివాహం చేసుకోంటే.. అది చెల్లదని ప్రకటించే హక్కు కుటుంబ కోర్టుకు ఉంటుందని సీఎం వివరించారు.
For National News And Telugu News