Kadapa News: పులివెందులకు నాడు సాగునీరు.. నేడు తాగునీరు.. ఆ ఘనత బాబుదే..
ABN , Publish Date - Dec 05 , 2025 | 11:40 AM
పులివెందుల పట్టణానికి.. నాడు సాగునీరు.. నేడు తాగునీరు.. ఆ ఘనత చంద్రబాబునాయుడిదేనని పలువురు పేర్కొంటున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోనే పులివెందుల బీడు భూముల్లో క్రిష్ణమ్మ జలాలు సవ్వడి చేస్త్తుంటే.. ఇప్పుడు ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందనుంది.
- పల్లెపల్లెకు తాగునీరందించే వాటర్‌గ్రిడ్ పనులు వేగవంతం
- ఈ నెల 20 నాటికి పనులు పూర్తి చేసేలా టార్గెట్
- జనవరిలో సీఎం చంద్రబాబుతో ప్రారంభం
ఉమ్మడి రాష్ట్రానికి, విభజిత రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు అందించిన ఖిల్లా పులివెందుల. దివంగత రాజశేఖరరెడ్డి, జగన్ ఇక్కడ నుంచే ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. అయితే ఆ ఇద్దరి హయాంలో పులివెందుల బీడు భూములకు సాగునీరు, ప్రజలు గొంతు తడుపుకునేందుకు తాగునీరు అందించకపోవడం గమనార్హం. టీడీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోనే పులివెందుల బీడు భూముల్లో క్రిష్ణమ్మ జలాలు సవ్వడి చేస్త్తుంటే.. ఇప్పుడు ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందనుంది. వచ్చే జనవరిలో సీఎం చంద్రబాబు చేతులమీదుగా ప్రారంభించేందుకు పులివెందుల నియోజకవర్గంలో వాటర్‌గ్రిడ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
(కడప-ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు పులివెందుల(Pulivendula)లో వేసవి వచ్చిందంటే చాలు.. చీనీ చెట్లను కాపాడుకునేందుకు రైతులు భగీరథ ప్రయత్నం చేసేవారు. ట్యాంకర్ల ద్వారా నీళ్లు తోలి చెట్లను కాపాడుకునేవారు. అయితే పులివెందుల రైతుల కష్టాలను 2014-19 టీడీపీ హయాంలో సీఎం చంద్రబాబు పరిష్కరించారు. గండికోట నుంచి క్రిష్ణాజలాలను అందించి పులివెందులను మరో కోనసీమలా మార్చారు. పులివెందులకు నీళ్లిచ్చిన తరువాతనే కుప్పానికి నీళ్లు తీసుకుపోతామని అప్పట్లో చంద్రబాబు(Chandrababu) చెప్పారు. చెప్పినట్లుగానే ప్రాజక్టులు పూర్తిచేసి పులివెందులకు చంద్రబాబు నీళ్లు ఇచ్చారు. అప్పట్లోనేపల్లెపల్లెకూ ప్రాజెక్టుల నుంచి 24గంటలు తాగునీరు అందించేందుకు వాటర్‌గ్రిడ్‌కు అంకురార్పణ చేశారు. 2019కి మునుపే జిల్లాలో రూ.1000 కోట్లతో డీపీఆర్ సిద్ధం చేశారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ వాటర్‌గ్రిడ్‌ను అటకెక్కించింది.

జగన్ హయాంలో 30 శాతం దాటని పనులు
జగన్ అధికారంలోకి వచ్చాక పులివెందుల నియోజకవర్గంలో రూ.480 కోట్లతో కేంద్ర, రాష్ట్ర నిధులతో జలజీవన్ నిధులతో వాటర్‌గ్రిడ్‌కు శ్రీకారం చుట్టారు. హైదరాబాదుకు చెందిన మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ పనులు దక్కించుకుంది. ఆ నియోజకవర్గంలోని లింగాల, తొండూరు, సింహాద్రిపురం, పులివెందుల, వేముల, వేంపల్లె, చక్రాయపేట మండలాల్లోని ప్రజలకు, విద్యాసం్థలకు నీళ్లిచ్చేలా పనులు చేపట్టారు. మొత్తం 5,36,821 మందికి తాగునీరు అందించాలనేది లక్ష్యం. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 3,85,816 జనాభా, మున్సిపాలిటీలో 1,16,005, విద్యాసంస్థల్లో 35వేల మందికి నీరందించేలా పనులు మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరికీ రోజుకు వంద లీటర్ల నీరు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం వాటర్‌ట్యాంకులు, సంప్‌లు ఏర్పాటు చేశారు. అయితే జగన్ హయాంలో ఈ పనులన్నీ కేవలం 30శాతంలోపే జరిగాయి.
పులివెందులకు నీళ్లంటే.. చంద్రబాబే
జగన్ సీఎం అయ్యాక సరికొత్త ట్రెండ్ తీసుకువచ్చారు. గత ప్రభుత్వంలో చేపట్టిన పనులు పూర్తిచేస్తే ఆ పేరు తనకు రాదనుకుని.. 2014-19లో చంద్రబాబు చేపట్టిన పనులన్ని రద్దు చేసి తన మార్కు పాలన చూపించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం జగన్‌లా కక్ష సాధింపు చేపట్టకుండా పులివెందులలో వాటర్‌గ్రిడ్ పనులను పూర్తి చేయాలని నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పులివెందుల వాటర్‌గ్రిడ్ విషయాన్ని మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి చంద్రబాబు దృష్టికి తెచ్చారు. అభివృద్ధి పనులు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబు జగన్‌లా కక్ష సాధించకుండా ‘‘పులివెందులకు నేనే సాగునీళ్లిచ్చా.. ఇప్పుడు తాగునీరు ఇస్తా.. వాటర్‌గ్రిడ్ పనులను పూర్తిచేద్దాం’’ అని చెప్పారు. అదే సమయంలో కలెక్టర్‌గా చెరుకూరి శ్రీధర్ వచ్చారు. సీఎం విజన్‌కు అనుగుణంగా జిల్లాను అభివృద్ధిపథంలో తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగానే సీఎం ఆదేశాల మేరకు పులివెందుల వాటర్‌గ్రిడ్‌పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. త్వరితగతిన పూర్తయ్యేందుకు కాంట్రాక్టర్లతో మీటింగ్ పెట్టారు. నియోజకవర్గ వ్యాప్తంగా 1110 కి.మీ పైపులైనుకు గాను సుమారు 950 కి.మీ పూర్తి చేశారు. పులివెందులకు సీఎం చంద్రబాబే సాగునీరు అందించారు. ఇప్పుడు వాటర్‌గ్రిడ్ కూడా చంద్ర బాబు చేతులతో ప్రారంభించాలని నిర్ణయించారు. వచ్చే నెలలో వాటర్‌గ్రిడ్‌ను ప్రారంభించేందుకు పనులు ముమ్మరంగా చేస్తున్నారు.
20 లోపు వాటర్‌గ్రిడ్ పనులు పూర్తి
పులివెందుల నియోజకవర్గంలో వాటర్‌గ్రిడ్ పనులను ఈ నెల 20లోపు పూర్తిచేయాలని డెడ్‌లైన్ పెట్టుకున్నాం. ఆ దిశగా పనులు జరుగుతున్నాయి. అయితే చక్రాయపేట నుంచి జాతీయ రహదారి పనుల కారణంగా కొంచెం ఆలస్యమవుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తాం. వాటర్‌గ్రిడ్ పనులు నేను వచ్చేసరికి 30శాతం మాత్రమే అయ్యాయి. ఆ పనులు ప్రస్తుతం చివరి దశకు వచ్చాయి. సీఎం చంద్రబాబుతో వాటర్‌గ్రిడ్ ప్రారంభిస్తాం.
- శ్రీధర్ చెరుకూరి, కలెక్టర్
ఈ వార్తలు కూడా చదవండి..
కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు.. 15లోగా డిజైన్ కన్సల్టెంట్లతో ఒప్పందం
Read Latest Telangana News and National News