Prakasam: ఫొటో మార్ఫింగ్ కేసు.. రామ్ గోపాల్ వర్మ సమాధానాలు ఇవే..
ABN , Publish Date - Feb 07 , 2025 | 06:30 PM
ఆంధ్రప్రదేశ్: వైసీపీ ప్రభుత్వంలో కూటమి నేతల ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై ఒంగోలు పోలీసులు విచారణ కొనసాగుతోంది. రూరల్ పోలీస్ స్టేషన్‌లో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను న్యాయవాది సమక్షంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

ప్రకాశం: ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma)ను ఒంగోలు పోలీసులు (Ongole Police) ఐదు గంటలుగా విచారణ చేస్తున్నారు. గత వైసీపీ (YSRCP) ప్రభుత్వంలో అప్పటి ప్రతిపక్షనేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ఫొటోలు మార్ఫింగ్ చేసిన కేసు (Photo Morphing Case)లో ఆర్జీవీని ఇవాళ (శుక్రవారం) మధ్యాహ్నం నుంచీ పోలీసులు విచారిస్తున్నారు.
కూటమి నేతల ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్‌లో పోస్టు చేయడంపై పోలీసులు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో న్యాయవాది సమక్షంలో విచారణ జరుగుతోంది. అయితే మార్ఫింగ్ ఫొటోలను తన ఎక్స్ ఖాతా నుంచే పోస్టు చేసినట్లు విచారణలో ఆర్జీవీ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. వ్యూహం సినిమా ప్రమోషన్‌లో భాగంగానే అలా చేశానని వర్మ అంగీకరించినట్లు సమాచారం. మార్ఫింగ్‌కు, వైసీపీ నేతలకూ ఎలాంటి సంబంధం లేదని ఒంగోలు పోలీసులకు వర్మ చెప్పినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ నుంచి రూ.2 కోట్లు ఆర్జీవీకి కేటాయించడంపైనా ఒంగోలు పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రూ.2 కోట్ల కేటాయింపుపై మాత్రం ఆయన నోరు విప్పనట్లు తెలుస్తోంది. వైసీపీ నేతలతో ఉన్న సంబంధాలపైనా ఆరా తీస్తున్నారు. అయితే వైసీపీ నేతలతో వ్యక్తిగత పరిచయాలు మాత్రమే ఉన్నాయని ఆర్జీవీ సమాధానం చెప్పినట్లు సమాచారం అందుతోంది. ఈరోజు విచారణకు వచ్చే ముందు వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని కలవడంపైనా ప్రశ్నలు సంధించారు. కాగా, మరో నాలుగైదు గంటలపాటు ఆర్జీవీని పోలీసులు విచారించనున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Andhra Pradesh: నరసాపురంలో ఉద్రిక్తత.. సామాజిక వర్గాల మధ్య కొట్లాట..
AP Govt: మద్యం కుంభకోణం వ్యవహారంలో ప్రభుత్వం కీలక నిర్ణయం