Veeraiah Chowdary: వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. పలువురి అరెస్ట్
ABN , Publish Date - May 14 , 2025 | 08:42 PM
Veeraiah Chowdary: ఒంగోలులో దారుణ హత్యకు గురైన వీరయ్య చౌదరి కేసును ప్రకాశం జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఒంగోలు, మే 14: టీడీపీ నేత వీరయ్య చౌదరి దారుణ హత్య కేసును ప్రకాశం జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసులో 11 మంది నిందితులను గుర్తించామని జిల్లా ఎస్పీ దామోదర్ వెల్లడించారు. బుధవారం విలేకర్ల సమావేశంలో ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ.. 9 మంది నిందితులను అరెస్టు చేశామన్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు. మృతుడు వీరయ్య స్వగ్రామం అమ్మనబ్రోలుకి చెందిన ఆళ్ళ సాంబయ్య ఈ హత్య కేసులో ప్రధాన కుట్రదారుడిగా తమ దర్యాప్తులో గుర్తించామన్నారు.
ఈ నిందితుల్లో ముప్పా సురేష్, దేవేంద్రనాథ్ చౌదరిలు వీరయ్య స్వగ్రామానికి చెందిన వారని తెలిపారు. ఇసుక వ్యాపారి వినోద్ అనే వ్యక్తితో పాటు నెల్లూరుకి చెందిన నలుగురు కిరాయి ముఠాతో వీరయ్య హత్యకు పథక రచన చేసి అమలు చేశారన్నారు. రాజకీయ, వ్యాపారాల్లో విభేదాలు నేపథ్యంలో వీరయ్య చౌదరిని కిరాయి హంతకులతో హత్య చేయించారని పేర్కొన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీ సాయంత్రం ఒంగోలులోని వీరయ్య చౌదరిని ఆయన కార్యాలయంలో దుండగులు విచక్షణా రహితంగా కత్తులతో పొడిచి హత్య చేసిన సంగతి తెలిసిందే.
ఏప్రిల్ 22వ తేదీ సాయంత్రం.. నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలుకు చెందిన వీరయ్య చౌదరి.. ఒంగోలులోని ఆయన కార్యాలయంలో దారుణ హత్యకు గురయ్యారు. నలుగురు నిందితుల్లో ఇద్దరు కత్తులతో ఆయన్ను 53 సార్లు విచక్షణారహితంగా పొడిచి హతమార్చారు. ఆపై స్కూటీ, ద్విచక్ర వాహనంపై వారు పరారయ్యారు. అధికార పార్టీ నేత దారుణ హత్యకు గురి కావడంతో.. జిల్లా పోలీసులు ఈ కేసు దర్యాప్తును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.
అందులోభాగంగా 55 మంది అనుమానితులను పోలీసులు విచారించారు. అలాగే మొత్తం 50 బృందాలతో పోలీసులు ఈ దర్యాప్తు చేపట్టారు. ఆ క్రమంలో తొలుత అమ్మనబ్రోలు, నాగులుప్పలపాడుకు చెందిన ఇద్దరు ప్రధాన అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఏప్రిల్ 25వ తేదీ చీమకుర్తిలో నిందితులు వదిలి వెళ్లిన రక్తపు మరకలున్న స్కూటీని, ఆ మరుసటి రోజు ఒంగోలులోని మంగమూరు రోడ్డులో మరో ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మొత్తం 55 మంది అనుమానితులను విచారించి అనంతరం నిందితుల విషయంలో పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. వీటి ఆధారంగా వీరయ్య చౌదరి హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
AP Governor Justice Abdul Nazeer: ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు అవమానం
Cinema Tickets Rates: సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్
Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్
Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్
For AndhraPradesh News And Telugu News