Share News

AP Police On Cracker Monitoring: దీపావళి.. అక్రమ బాణసంచా విక్రయాలపై డ్రోన్‌ నిఘా .. పోలీసుల కఠిన చర్యలు

ABN , Publish Date - Oct 19 , 2025 | 09:50 AM

దీపావళి పండుగ అంటే బాణసంచా కాల్చడం పరిపాటి. బాణసంచా తయారీకి తమిళనాడు రాష్ట్రంలో శివకాశి పెట్టిందిపేరు. దీంతో రెండుతెలుగు రాష్ట్రాలు కూడా శివకాశి నుంచి బాణసంచా తీసుకొచ్చి విక్రయాలు చేస్తుంటారు.

AP Police On Cracker Monitoring:  దీపావళి.. అక్రమ బాణసంచా విక్రయాలపై డ్రోన్‌ నిఘా .. పోలీసుల కఠిన చర్యలు
AP Police On Cracker Monitoring

శివకాశి టూ ఒంగోలు

బాణసంచా అక్రమాలపై కొరవడిన నిఘా

అంతా జీరో వ్యాపారమే అధికారుల తనిఖీలు

నామమాత్రం రూ. 20 కోట్లకుపైగా విక్రయాలు

ఒంగోలు క్రైం,అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): దీపావళి (Diwali) పండుగ అంటే బాణసంచా (Banasancha) కాల్చడం పరిపాటి. బాణసంచా తయారీకి తమిళనాడు రాష్ట్రంలో శివకాశి పెట్టిందిపేరు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా శివకాశి నుంచి బాణసంచా తీసుకొచ్చి విక్రయాలు చేస్తుంటారు. అందుకు సంబంధించి హోల్‌సేల్‌ వ్యాపారులు అటు ప్రజల జేబులకు చిల్లు పెటడంతోపాటుగా, ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. జిల్లాలో 14 మంది హోల్‌సేల్‌ వ్యాపారులు ఉండగా ఒంగోలు(Ongole)లో ఉన్న ఓ వ్యాపారి ఇతర రాష్ట్రాలకు కూడా బాణసంచా సరఫరా చేసి సొమ్ము చేసుకుంటారు. అయితే దీపావళి పండుగ ఒక్కరోజు అయినా జిల్లాలో సుమారుగా రూ. 20 కోట్లకు పైగా బాణసంచా విక్రయాలు జరిగే అవకాశం ఉంది.


ఇలాంటి వ్యాపారం అక్రమాలకు అవధులు లేకుండా పోవడానికి కారణం అధికారులు పట్టించుకోకపోవడమే. బాణసంచా వ్యాపారం మొత్తం జీరోలోనే జరుగుతుంది. బాణసంచా వ్యాపారంలో 18 శాతం జీ ఎస్టీ చెల్లించాలి. జీఎస్టీ చెల్లించి శివాకాశి నుంచి వచ్చే బాణసంచా తక్కువగా ఉంటుంది.అదే క్రమంలో శివకాశి నుంచి తెచ్చిన బాణసంచా మొత్తం బిల్లులు లేకుండా వ్యాపారం చేస్తారు. అంటే అక్కడ ఎంతకు కొనుగోలు చేసింది, ఎంత మొత్తం బిల్లులపై తెచ్చారు అనేది ప్రశ్నార్థకం. ఇలాంటి వ్యాపారంపై అధికారుల నిఘా కొరవడడంతో ఇష్టారాజ్యంగా విక్రయాలు చేస్తూ,హోల్‌సేల్‌ వ్యాపారులే అధికధరలకు విక్రయిస్తున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోకుండా కేవలం బాణసంచా మత్తులో ఉండటంతో వ్యాపారులు చెలరేగుతున్నారు.


పేలుతున్న ధరలు

బాణసంచా ధరలు గత ఏడాది కంటే ఈ ఏడాది మండిపోతున్నాయి. సామాన్యులు టపాసుల ధరలు చూసిముక్కున వేలు వేసుకుంటున్నారు. ఐదు నుంచి ఆరువేల రూపాయలకు కొనుగోలు చేసినా చేతి సంచిలోకి రావడంలేదని పలువురు వాఖ్యానిస్తున్నారు. చిచ్చుబుడ్డి పట్టుకుంటే కాల్చకుండానే మంటలు వస్తున్నాయి. లక్ష్మీబాంబులు మోతమోగుతున్నాయి.. ఇలా ధరలు ఎగిసిపడుతున్నాయి. దీంతో టపాసులు కొనుగోలు చేయడం అంతంతమాత్రంగా ఉంది.


అనుమతులు లేకుండా విక్రయిస్తే కఠిన చర్యలు - ఎస్పీ వి.హర్షవర్ధనరాజు

బాణసంచా విక్రయదారులు నిబంధనలకు లోబడి విక్రయాలు చేయాలి. అనుమతులు లేకుండా టపాసులు తయారు చేయడం, అక్రమ రవాణా చేయడంపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశాం. డ్రోన్‌ కెమోరాలతో నిఘా ఏర్పాటు చేశాం. జిల్లా వ్యాప్తంగా అనుమతిలేకుండా విక్రయాలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి రూ1,38,944 విలువ గల బాణసంచాను సీజ్‌ చేశాం. దీపావళి సందర్భంగా ఏవైనా అగ్నిప్రమాదాలు జరిగితే వెంటనే 101, పోలీసు డైల్‌ 100 లేక 112కు సమాచారం అందిచాలి.


నగరంలో 42 బాణసంచా దుకాణాలకు అనుమతి

ఒంగోలు కార్పొరేషన్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): దీపావళి సందర్భంగా నగరంలో 42 బాణ సంచా దుకాణాలకు కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో అనుమతులిచ్చారు. ఈ మేరకు ఒంగోలులోని పీవీఆర్‌ బాలుర హైస్కూలు క్రీడా మైదానంలో ప్రత్యేకంగా టపాసుల అమ్మకాలు చేయనున్నారు. కాగా గతంలో షాపులకు విపరీతమైన పోటీ ఉండగా, ఈ ఏడాది 42 దరఖాస్తులు మాత్రమే రాగా, అన్నింటికీ అనుమతిలిచ్చారు. దీంతో పీవీఆర్‌ మైదానంలోనే షాపులు పెట్టుకోవాలని ఆదేశించారు. అయితే నివాసాల మధ్య టపాసులు అమ్మకూడదని, అలాగే వ్యాపార సముదాయాలు, బహిరంగ ప్రదేశాలలో షాపులు ఏర్పాటు చేయకూడదని హెచ్చరించారు. పీవీఆర్‌ మైదానంలో ఏర్పాటు చేసిన దుకాణాల ముందు తప్పనిసరిగా నీళ్ల డ్రమ్ములు, ఇసుక డ్రమ్ములు ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని కార్పొరేషన్‌ అధికారులు వెల్లడించారు.

Updated Date - Oct 19 , 2025 | 09:51 AM