AP News: దానిమ్మ ధర నేలచూపులు.. టన్ను రూ.60వేలలోపే
ABN , Publish Date - Sep 20 , 2025 | 01:05 PM
దానిమ్మ ధరలు నేలచూపులు చూస్తున్నాయి. నానాటికీ తగ్గుతున్నాయి. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నెలరోజుల క్రితం ఉన్న ధరలు అమాంతం తగ్గి సగానికి పడిపోతున్నాయి. దీంతో లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
- ఈ రేటుతో పెట్టుబడులు కూడా రావంటున్న రైతులు
- ఇతర రాష్ట్రాల్లో దిగుబడులు బాగా రావడమే కారణం
పుట్లూరు(అనంతపురం): దానిమ్మ ధరలు నేలచూపులు చూస్తున్నాయి. నానాటికీ తగ్గుతున్నాయి. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నెలరోజుల క్రితం ఉన్న ధరలు అమాంతం తగ్గి సగానికి పడిపోతున్నాయి. దీంతో లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కనీసం పెట్టుబడులైనా వస్తావా.. రావా.. అన్న ఆందోళనలో ఉన్నారు. గతేడాదితో పోలిస్తే దానిమ్మ ధరలు సగం పైగానే తగ్గిపోయాయి. పుట్లూరు, పెద్దపప్పూరు, యల్లనూరు, యాడికి, తాడిపత్రి, నార్పల తదితర మండలాల్లో దానిమ్మ ఎక్కువగా సాగు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 13,381 ఎకరాల్లో పంట పెట్టారు. గతంలో ధరలు ఎక్కువగా ఉండడంతో పంట సాగుకు రైతులు ఆసక్తి చూపారు. ఈ ఏడాది ధరలు తగ్గుముఖం పట్టడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
టన్ను 60వేలలోపే..
ఎకరాలో దానిమ్మ సాగుకు రూ.80 వేల నుంచి లక్ష వరకు పెట్టుబడి పెట్టినట్లు చెబుతున్నారు. దిగుబడి కూడా బాగానే వచ్చింది. టన్ను ధర ప్రస్తుతం 60వేలలోపే పలుకుతోంది. మూడు నెలల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. సరిగ్గా ఏడాది క్రితం దానిమ్మ టన్ను ధర రూ.1.20 లక్షలు పలికి రైతులకు సిరులు కురిపించింది. ఈసారి కూడా ధరలు బాగుంటాయనుకున్న రైతులకు నిరాశే ఎదురైంది.

ఇతర రాష్ట్రాల్లో పంట దిగుబడి ఎక్కువగా ఉండడంతో ఏపీలో ధరలు తగ్గుముఖం పట్టాయని వ్యాపారులు చెబుతున్నారు. నవంబరు నుంచైనా ధరలు పెరుగక పోతాయా అన్న ఆశతో రైతులు ఉన్నారు. అప్పుడు కూడా ధరలు పెరగకపోతే నష్టాలు తప్పవని వాపోతున్నారు. పంటను మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, చెన్నై తదితర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో పంట ఎక్కువగా వస్తుండడంతో తెలంగాణ, చెన్నైకి నామమాత్రంగా ఎగుమతి చేస్తున్నారు.
పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు
దానిమ్మ ధరలు ఇలాగే కొనసాగితే పెట్టుబడులు కూడా రావు. ఎకరాకి పెట్టుబడి రూ.80వేల నుంచి లక్ష వరకు వచ్చింది. దిగుబడి బాగున్నా.. ధరలు తగ్గడం కలవరపెడుతోంది. నాలుగెకరాల్లో దానిమ్మ సాగుచేశా. రానున్న నెలల్లో అయినా ధరలు పెరిగితే కొంత ఉపశమనం దక్కుతుంది.
- వెంకటనారాయణ, వరదాయపల్లి
ఈ ధరలతో నష్టమే..
దానిమ్మ ధరలు తగ్గడంతో పంటను అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నాం. కొన్నిచోట్ల పంట కోత దశకు రావడంతో నష్టానికే విక్రయించాల్సి వస్తోంది. ఏడెకరాల్లో పంట సాగుచేశా. పంటలో సస్యరక్షణ చర్యలు తప్పకుండా చేపట్టాల్సి ఉంటుంది. లేకపోతే దానిమ్మ కాయలు దెబ్బతిని మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వ్యాపారులు తక్కువ ధరకే అడుగుతున్నారు.
- శివశంకర్ రెడ్డి, కందికాపుల
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
అదంతా ఫేక్.. ఆ వార్తలను ఖండిస్తున్నా
Read Latest Telangana News and National News