Komatireddy On Fake News: అదంతా ఫేక్.. ఆ వార్తలను ఖండిస్తున్నా
ABN , Publish Date - Sep 18 , 2025 | 03:35 PM
తనపై వచ్చే తప్పుడు వార్తలు, అబద్దాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఒకసారి ఎంపీ, ఎమ్మెల్సీ, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు కాంగ్రెస్ పార్టీ అన్నా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అన్నా ఎంతో అభిమానమని తెలిపారు.
నల్లగొండ, సెప్టెంబర్ 18: తన ఇమేజ్ దెబ్బతీసేలా ఆంధ్రజ్యోతి పేరుతో ఫేక్ ప్రచారం చేశారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Komatireddy Rajgopal Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆంధ్రజ్యోతి పేపర్‌ను తలపించేలా అందజ్యోతి అనే పేరుతో పేపర్ ప్రింట్ చేసి.. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి లేదన్న రాజగోపాల్ రెడ్డి అనే శీర్షికను నేను అనని మాటలు అన్నట్లు ప్రచురించారు’ అంటూ ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి గురించి అసెంబ్లీలో ప్రస్తావించిందే తానన్నారు. తనకు మంత్రి పదవి రానందుకే సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వంపై తాను అనని మాటలను అన్నట్టు తప్పుడు కథనాలను సృష్టించి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారన్నారు.
‘నా పైన వచ్చే తప్పుడు వార్తలు, అబద్ధాలను తీవ్రంగా ఖండిస్తున్నా. కాంగ్రెస్ పార్టీలో ఒకసారి ఎంపీ, ఎమ్మెల్సీ, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాకు కాంగ్రెస్ పార్టీ అన్నా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అన్నా ఎంతో అభిమానం. మా కుటుంబమే కాంగ్రెస్ పార్టీ నేపథ్యం. నేను రాజీనామా చేస్తున్నానని, పార్టీ మారుతున్నానని, పార్టీ పెడుతున్నానని తప్పుడు వార్తలు రాస్తున్నారు. కొందరు గిట్టని వ్యక్తులు నా ప్రతిష్ట దెబ్బతీయడానికి సోషల్ మీడియా ద్వారా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు’ అంటూ మండిపడ్డారు.
ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ విషయంలో కొంతమంది అనుకూలంగా మార్చుకున్నారని అనుమానాలు ఉన్నాయన్నారు. భూ నిర్వాసితుల విషయంలో తగిన పరిహారం ఇచ్చి న్యాయం చేస్తే బాగుంటుందని తన అభిప్రాయం చెప్పినట్లు తెలిపారు. ఈరోజు తాను గుంటూరులో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్తుంటే మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్తున్నానని పుకార్లు సృష్టిస్తున్నారని.. గుంటూరుకు వెళ్లిన తర్వాత అటు నుంచి విజయవాడ వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకొని వద్దామని వెళ్తున్నట్లు స్పష్టం చేశారు.
‘నా రాజకీయ భవిష్యత్తు గురించి నేనే మీడియా సమావేశంలో వెల్లడిస్తాను. అప్పటివరకు ఈ దుష్ప్రచారాలను నమ్మొద్దు’ అంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఓ వైపు ఐటీ.. మరోవైపు ఈడీ.. హైదరాబాద్‌లో వరుస సోదాలు
రంగుమారిన పొలాలు.. ఆందోళనలో రైతులు
Read Latest Telangana News And Telugu News