Jagan Birthday: జగన్ పుట్టినరోజున వేడుకల ఎఫెక్ట్.. ఉన్మాదంపై ఉక్కుపాదం
ABN , Publish Date - Dec 24 , 2025 | 12:24 PM
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకల పేరుతో జరిగిన ఉన్మాదంపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. జగన్ ఫొటో పట్టుకుని రప్పా రప్పా అంటూ ఆ పార్టీ కార్యకర్తలు భీభత్స చేశారు. అలాగే మరికొంతమంది రక్తతర్పణం అంటూ అలజడులు రేకెత్తించారు. అయితే.. దీనిపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు.
- జగన్ పుట్టినరోజున పేట్రేగిపోయిన వైసీపీ మూకలపై పోలీసుల చర్యలు
- కేసుల నమోదు.. నిందితుల అరెస్టు
- బహిరంగంగా ఊరేగింపు
కదిరి/విడనపకల్లు(అనంతపురం): వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 21వ తేదీన జంతు బలులు, రక్తతర్పణాలు, దాడులకు దిగిన ఆ పార్టీ మూకలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వారిపై కేసులు నమోదు చేసి, గంటల వ్యవధిలో అరెస్టు చేశారు. వారిని బహిరంగంగా ఊరేగించారు. వైసీపీ ఉన్మాదులకు ఇది తగిన శాస్తేనని జనం చర్చించుకుంటున్నారు.

పేట్రేగిపోయిన శ్రేణులు..
జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల వైసీపీ మూకలు పేట్రేగిపోయాయి. నడి ఊరిలో జంతు బలి ఇచ్చారు. మూగజీవాల రక్తాన్ని జగన్ ఫ్లెక్సీకి చిందించి, రాక్షసానందం పొందారు. ఆనక ఊరేగింపులతో టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యవహరించారు. మద్యం మత్తులో గొడవలకు దిగారు. భయానక వాతావరణం సృష్టించారు. ఇవి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బహిరంగంగా జంతు బలి ఇచ్చి..
రక్తతర్పణం చేసిన, గొడవలకు దిగిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. తనకల్లు మండలంలోని ముత్యాలవారిపల్లిలో ఏడు నెలల గర్భిణిసంధ్యారాణి గొంతు నులిమి, కడుపుపై తన్నిన వైసీపీకి చెందిన అజయ్‌దేవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తనకల్లు నుంచి కదిరికి తీసుకొచ్చారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు నుంచి నిందితుడిని ఊరేగింపుగా కదిరి రూరల్ సర్కిల్ పోలీసు స్టేషన్‌కు మంగళవారం తీసుకొచ్చారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు.

ఆరునెలల నుంచే వేధింపులు
సంధ్యారాణి కుమారుడు అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్తుండేవారు. ఆరునెలల క్రితం అంగన్‌వాడీకెళ్లిన బాలుడు అక్కడున్న నీటి తొట్టెలో పడి చనిపోయాడు. అంగన్‌వాడీ సిబ్బంది నిర్లక్ష్యంతోనే తమ కుమారుడు చనిపోయాడని సంధ్యారాణి దంపతులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు అంగన్‌వాడీ ఆయా, కార్యకర్తను అరెస్టు చేసి జైలుకు పంపారు. వారిని ఉద్యోగాల నుంచి తొలగించారు. అప్పట్నుంచి సంధ్యారాణి దంపతులకు వేధింపులు మొదలయ్యాయి. సంధ్యారాణిపై దాడిచేసిన అజయ్‌దేవ్ అంగన్‌వాడీ ఆయాకు బంధువు. సంధ్యారాణి కూడా బంధువే. తమ ఉద్యోగం పోవడానికి సంధ్యారాణి కారణమని అప్పటి నుంచి కక్షగట్టారు. వరుసకు అన్నదమ్ములే అయినా.. పార్టీలు వేరు. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాల మధ్య తీవ్ర విభేదాలున్నాయి. దీనిని మనసులో పెట్టుకునే దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
విడపనకల్లులో..
జగన్ పుట్టిన రోజు సందర్భంగా వైసీపీ నాయకులు విడపనకల్లులో జంతు బలి ఇచ్చి భయానక వాతావరణం సృష్టించడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐదుగురిని అరెస్టు చేశారు. వీరిని గ్రామంలోని ప్రధాన రహదారిపై మంగళవారం ఊరేగించారు. స్థానిక బస్గాండులో పోలీస్ జీపు ఎక్కించారు. బోయ రుద్ర, ఉప్పర రాజు, మాళాపురం ఇంద్ర, గంగాధర, చాకలి సంతోష్ పై కేసు నమోదు చేసి, ఉరవకొండ కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్‌ఐ ఖాజాహుస్సేన్ తెలిపారు. ఈ కేసులో మరికొంత మందిని త్వరలోనే అరెస్ఠు చేస్తామన్నారు. నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
చోళసముద్రంలోనూ రక్తతర్పణం

కూడేరు(అనంతపురం): జగన్ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 21న చోళసముద్రంలో జంతుబలి ఇచ్చి.. ఆయన ఫ్లెక్సీకి రక్తతర్పణం చేశారు. నవీన్ అనే వైసీపీ కార్యకర్త సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేయడంతో ఆలస్యంగా గుర్తించిన పోలీసులు రంగంలోకి దిగారు. రక్త తర్పణం చేసినవారిలో 8 మందిని గుర్తించామని సీఐ రాజు తెలిపారు. మిగిలిన వారిని గుర్తించాల్సి ఉందని అన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు
Read Latest Telangana News and National News