AP Govt : పోలవరం @ జూలై 2027
ABN , Publish Date - Jan 19 , 2025 | 04:06 AM
రాష్ట్ర జల-జీవనాడి పోలవరం ప్రాజెక్టును 2027 జూలై నాటికి పూర్తి చేయాలన్న లక్ష్య సాధన దిశగా కీలక అడుగు పడింది.
డయాఫ్రమ్ వాల్ పనులకు శ్రీకారం
నిరాడంబరంగా ప్రారంభించిన జల వనరుల శాఖ అధికారులు
ఈ ఏడాది ఆఖరుకు పనులు పూర్తి
జూలై నుంచి ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ పనులు కూడా ప్రారంభం
26న ప్రాజెక్టు వద్దకు చంద్రబాబు
అమరావతి/ఏలూరు, జనవరి 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర జల-జీవనాడి పోలవరం ప్రాజెక్టును 2027 జూలై నాటికి పూర్తి చేయాలన్న లక్ష్య సాధన దిశగా కీలక అడుగు పడింది. ప్రధాన ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్‌వాల్ పనులు శనివారం మొదలయ్యాయి. 2018 నాటికే పూర్తయిన డయాఫ్రమ్‌వాల్ నాటి జగన్ సర్కారు ‘రివర్స్ టెండరింగ్’ నిర్వాకంతో దెబ్బతింది. దీంతో పాత డయాఫ్రమ్‌వాల్‌కు సమాంతరంగా కొత్తగా మళ్లీ నిర్మించాల్సి వస్తోంది. శనివారం ఉదయం 10.19 గంటలకు పూజలు చేసిన ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్. రామచంద్రరావు, బావర్ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ హాసన్ పర్హాత్, మేఘా ఇంజనీరింగ్ జీఎం గంగాధర్ తదితరులు పనులకు శ్రీకారం చుట్టారు. కొత్త డయాఫ్రమ్‌వాల్‌కు టీ-5 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమాన్ని వినియోగించాలని కేంద్ర జల సంఘం బావర్ సంస్థను ఆదేశించింది. వాస్తవానికి అంతర్జాతీయ నిపుణుల సంఘం ‘టీ-16’ ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమాన్ని వాడాలని సూచించింది. అయితే, ఈ టీ-16 మిశ్రమం పెళుసుగా ఉంటుందని, వంపుల వద్ద బీటలు వస్తాయని జాతీయ పరిశోధన సంస్థలు సహా నిపుణులు హెచ్చరించారు. దీంతో, కేంద్ర సాయిల్ అండ్ మినరల్ రీసెర్చ్ స్టేషనర్(సీఎ్‌సఎంఆర్‌ఎస్) సిఫారసు చేసిన టీ-5 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమాన్ని వినియోగించాలని నిర్ణయించారు. ఇదిలావుంటే, ఈ నెల 2వ తేదీ నుంచే పనులు ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ.. కెనడా, అమెరికాకు చెందిన అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్ అభిప్రాయాలను కూడా తెలుసుకోవాలని కేంద్ర జల సంఘం భావించింది. దీంతో పనులు 16 రోజులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి.

పనులు సమీక్షించనున్న సీఎం
సీఎం చంద్రబాబు ఈ నెల 26న పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటిస్తారని జల వనరుల శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా డయాఫ్రమ్‌వాల్ నిర్మాణ పనులను ఆయన సమీక్షిస్తారు. డయాఫ్రమ్‌వాల్ నిర్మాణం 650 మీటర్ల మేర నిర్మాణం పూర్తయ్యాక.. వాల్ పనులు ప్రారంభించిన చోట నుంచి ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు కాంట్రాక్టు సంస్థ మేఘా ఇంజనీరింగ్‌ను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్‌కు అవసరమైన పెద్దపెద్ద బండరాళ్లను మేఘా సంస్థ సేకరిస్తోంది. ఇలా ఒకవైపు డయాఫ్రమ్‌వాల్ నిర్మాణ పనులు చేపడుతూనే.. మరోవైపు ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ పనులను కూడా చేపడతుండడం వల్ల.. సమయం కలిసి వస్తుందని కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, రాష్ట్ర జల వనురుల శాఖ, సీఎ్‌సఎంఆర్‌ఎస్ పేర్కొంటున్నాయి. ఫలితంగా.. ఈ ఏడాది చివరినాటికి డయాఫ్రమ్‌వాల్‌ను పూర్తి చేస్తే.. 2027 జూలై నాటికి ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ పనులు కూడా పూర్యయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇలా మొదలయ్యాయి!
పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రంవాల్ పనులను ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్(సీఈ) నరసింహమూర్తి శనివారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. తొలుత లక్ష్మీగణపతి యాగం, నరఘోష, శత్రుదోష నివారణ, నవగ్రహ శాంతి, వాస్తు పూజలు నిర్వహించారు. పూజల అనంతరం సీఈ నరసింహమూర్తి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం ఈ నెల 2నే పనులు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని, కానీ.. అనుమతుల జాప్యం కారణంగా ఆలస్యమైందన్నారు.
ఎలా నిర్మిస్తారంటే!
గతంలో నిర్మించిన డయాఫ్రమ్‌వాల్‌కి ఎగువన 1.5 కిలోమీటర్ల పొడవున ఇరువైపుల అంచులు నదీ తీరం రెండు పక్కలా ఉన్న కొండల్లోకి వెళ్లేలా మట్టి పనులు చేశారు. ఈసీఆర్‌ఎఫ్ ప్రాంతంలో కొంతమేర 1.5 మీటర్ల వెడల్పున ఇరువైపులా గైడ్ వాల్ కాంక్రీట్ నిర్మాణం చేశారు. ప్రస్తుతం మిగిలిన ప్రాంతాల్లో సైతం అదేవిధంగా కాంక్రీట్ నిర్మాణం చేసి, ఆ ప్రాంతంలో ట్రెంచ్ కట్టర్ ద్వారా నదీ గర్భంలో రాతి పొరలు తగిలే వరకు తవ్వి.. ప్లాస్టిక్ కాంక్రీట్‌తో డయాఫ్రమ్‌వాల్ నిర్మిస్తారు.

ట్రెమీ పైపులు
ట్రెమీపైపుల ద్వారా డయాఫ్రమ్‌వాల్ అంతర్భాగంలో ప్లాస్టిక్ కాంక్రీట్ నింపుతారు. నదీ గర్భంలో మూడు వందల మీటర్ల మేర దిగువకు కాంక్రీట్ పంపడానికి సరిపడే రెండు సెట్లు సిద్ధం చేశారు. ఏకకాలంలో 600 మీటర్ల పనులకు సరిపడే పైపులు సిద్ధం చేశారు. ఒకేసారి ఆరు ప్యానళ్లకు సరిపడే మెటీరియల్ ప్రాజెక్టు ప్రాంతంలో సిద్ధంగా ఉంది.

ప్లాస్టిక్ కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్లు
దిగువ కాఫర్ డ్యాంకి సమీపంలో రామయ్యపేట ప్రాంతంలో రెండు చోట్ల రెండేసి చొప్పున నాలుగు ప్లాంట్లు సిద్ధం చేశారు. ఈ ప్లాస్టిక్ కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంటులో డయాఫ్రమ్‌వాల్ నిర్మాణానికి ఉపయోగించే ప్లాస్టిక్ కాంక్రీట్ మిక్సింగ్ జరుగుతుంది. ఒక్కో ప్లాంటు ద్వారా 240 క్యూబిక్ మీటర్ల ప్లాస్టిక్ కాంక్రీట్ సరఫరా అవుతుంది. 4 ప్లాంట్ల ద్వారా 960 క్యూబిక్ మీటర్ల ప్లాస్టిక్ కాంక్రీట్ మిక్సింగ్ సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఈ ప్లాంట్లలో ట్రెంచ్ కటింగ్ కోసం అవసరమయ్యే బెంటోనైట్ ద్రవాన్ని తయారు చేస్తున్నారు.
ట్రెంచ్ కట్టర్ పనులు ఇలా
జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న భారీ యంత్రం ట్రెంచ్ కట్టర్. దీని ద్వారా నదీ గర్భంలో రాతిపొరలు తగిలే వరకు డయాఫ్రంవాల్ నిర్మాణ ప్రాంతంలో చేపట్టిన కాంక్రీట్ గైడ్‌వాల్ మధ్య తవ్వకాలు చేస్తారు. ఈ యంత్రానికి అడుగు భాగాన ఉన్న భారీ కట్టర్‌లు భూమి అంతర్భాగంలోకి వేగవంతంగా చొచ్చుకుపోతాయి. ట్రెంచ్ కట్టర్‌లకు అమర్చిన భారీ పైపుల ద్వారా బెంజోనేట్ పౌడరు కలిపిన జలాలను నదీ గర్భంలో ఉన్న మట్టి, ఇసుక తవ్వకాల ప్రాంతంలో నిరంతర పంపించడం ద్వారా భూమి పొరల్లో తవ్వకాలలోకి ఇసుక జారకుండా బెంటోనైట్ గట్టిపరుస్తుంది. తద్వారా తవ్వకం పనులు సులభతరమవుతాయి. రాతి శకలాలు వచ్చిన ప్రాంతాలను గుర్తించి అక్కడ పైపులు దింపి ప్లాస్టిక్ కాంక్రీట్ నింపుతారు. డయాఫ్రమ్‌వాల్ నిర్మాణంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా తవ్వకాలు జరుగుతాయి. గరిష్ఠంగా 90 మీటర్ల నుంచి కనిష్ఠంగా 40 మీటర్ల వరకు ట్రెంచ్ కట్టర్ ద్వారా తవ్వకాలు జరుగుతాయి.