Union Minister Kumaraswamy : ‘ఉక్కు’కు ఆర్థిక ప్యాకేజీ.. మోదీ బహుమతి ఇది!
ABN , Publish Date - Jan 31 , 2025 | 04:18 AM
స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం మంజూరు చేసిన రూ.11,440 కోట్లను ఏ విధంగా సద్వినియోగం చేయాలనే అంశంపై మార్గదర్శనం చేయడానికి...

చంద్రబాబు, లోకేశ్ ‘ఉక్కు సంకల్పం’
పలుమార్లు ఢిల్లీకి వచ్చి సాయం కోరారు
హామీ నిలుపుకోవాలని పవన్ పట్టుదల
సమష్టి కృషి వల్లే 11,440 కోట్ల నిధులు
ఇది రాష్ట్ర నేతల చిత్తశుద్ధి ఫలితం
ప్లాంట్‌ను నంబర్1 స్థానంలో నిలపాలి
3 నెలలు ఆగితే క్రమం తప్పకుండా జీతాలు
ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి భరోసా
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించకూడదని ఏపీ ప్రభుత్వం తీర్మానం చేసి పంపింది. చంద్రబాబు, లోకేశ్ అనేకసార్లు ఢిల్లీకి వచ్చి ప్లాంట్‌కు ఆర్థిక సాయం చేయాలని కోరారు. ఓసారి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అర్ధరాత్రి 1.30కి అపాయింట్‌మెంట్ ఇస్తే... చంద్రబాబు ఓపికగా వేచి ఉండి ఆమెను కలిసి మాట్లాడారు. అంతటి చిత్తశుద్ధి చూపించబట్టే విశాఖ ఉక్కుకు ఆర్థికప్యాకేజీ దక్కింది.
- కుమార స్వామి, కేంద్ర మంత్రి
విశాఖపట్నం, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ఆర్థిక ప్యాకేజీని ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి బహుమతిగా ప్రకటించారని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి అన్నారు. స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం మంజూరు చేసిన రూ.11,440 కోట్లను ఏ విధంగా సద్వినియోగం చేయాలనే అంశంపై మార్గదర్శనం చేయడానికి గురువారం విశాఖపట్నం వచ్చిన ఆయన కర్మాగారంలో విలేకరులు, ఉద్యోగులు, కార్మికులతో వేర్వేరుగా మాట్లాడారు. ఉక్కు పరిశ్రమ నష్టాల్లో ఉన్నందున పెట్టుబడులు ఉపసంహరించాలని కేంద్ర కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. అటువంటి సంస్థకు ఆర్థికసాయం చేయాలని తాను బాధ్యతలు చేపట్టిన వెంటనే పలు బ్యాంకులను, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరితే నిర్మొహమాటంగా తిరస్కరించారని తెలిపారు.
అయితే స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయకూడదని ఏపీ ప్రభుత్వం తీర్మానం చేసి పంపిందని, అదేవిధంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ అనేకసార్లు ఢిల్లీకి వచ్చి ప్లాంట్‌కు ఆర్థిక సాయం చేయాలని కోరారని వివరించారు. ఈ విషయాన్ని ప్రధాని వద్ద ప్రస్తావించినప్పుడు ఆయన కొంత సానుకూలంగా మాట్లాడారని, దాంతో తాను మరోసారి ఆర్థికమంత్రిని కలిసి సంప్రదింపులు జరిపానని చెప్పారు. ఓసారి ఢిల్లీ వచ్చిన చంద్రబాబు తెల్లవారు జామున 1.30 గంటలకు ఆర్థికమంత్రి అపాయింట్‌మెంట్ ఇస్తే... ఓపికగా వేచి ఉండి ఆమెను కలిసి మాట్లాడారని గుర్తు చేసుకున్నారు. అంతటి చిత్తశుద్ధి చూపించబట్టే ఆర్థికప్యాకేజీ దక్కిందని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ను నిలబెడతామని హామీఇచ్చామని, దాన్ని నిలుపుకోవడానికి సహకరించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా కోరారని తెలిపారు. ఎంపీ శ్రీభరత్, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు... ఇలా అందరూ కలిసి ఒత్తిడి తేవడం వల్లే ఇదంతా సాధ్యమైందని కుమారస్వామి పేర్కొన్నారు.
అంతా కలిసి పనిచేస్తే సాధ్యమే
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను దేశంలో నంబర్‌వన్‌గా నిలపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, దీనికి ఉద్యోగులు, కార్మికులు సహకరించాలని కేంద్ర మంత్రి కోరారు. వికసిత్ భారత్‌లో భాగంగా 2030 నాటికి 300 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయాలని ప్రధాని మోదీ లక్ష్యం విధించారని, దానిని సాధించడానికి కార్మికులు, ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. ప్రస్తుతం రెండు బ్లాస్ట్ ఫర్నేసుల ద్వారా 14వేల టన్నుల ఉత్పత్తి అవుతోందని, మూడో బ్లాస్ట్ ఫర్నే్‌సను కూడా ప్రారంభించి ఉత్పత్తిని 20వేల నుంచి 24వేల టన్నులకు పెంచాలని సూచించారు. ఆ లక్ష్యం సాధించగలిగితే ఏడాదిలోనే స్టీల్‌ప్లాంట్ లైన్‌లోకి వస్తుందని స్పష్టం చేశారు. రెండు, మూడు నెలలు ఆగితే ప్రతినెలా జీతం ఇచ్చేందుకు యత్నిస్తామని కార్మికులకు భరోసా ఇచ్చారు.
ఉక్కు మంత్రికి ఘనస్వాగతం
కేంద్ర మంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి శ్రీనివాసవర్మకు విశాఖలో ఘనస్వాగతం లభించింది. విమానాశ్రయంలో ఎంపీలు సీఎం రమేశ్, శ్రీభరత్, అప్పలనాయుడు, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్‌రాజు, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ స్వాగతం పలికారు. కాన్వాయ్‌లో వారంతా స్టీల్‌ప్లాంట్‌కు బయలుదేరగా దారి పొడవునా కూటమి నాయకులు, ఉద్యోగులు స్వాగతం పలికి, గజమాలతో సత్కరించారు.
మంత్రుల కాన్వాయ్‌లో స్వల్ప ప్రమాదం..
కేంద్రమంత్రులు కుమారస్వామి, భూపతిరాజు శ్రీనివాసవర్మ విమానాశ్రయం నుంచి కర్మాగారానికి వెళుతుండగా షీలానగర్ వద్ద కాన్వాయ్‌లోని మూడు కార్లు ఒక దానికొకటి ఢీకొన్నాయి. విషయం తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. కాన్వాయ్‌లో మొత్తం 8 వాహనాలు ఉండగా చివరి మూడు కార్లు ప్రమాదానికి గురయ్యాయని, కేంద్ర మంత్రులు క్షేమంగా ఉన్నారని, ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు సీఎంకు వివరించారు.
ప్రైవేటీకరణ అంశం చరిత్రలోకి!
కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ ఇంకా ఆందోళనలు చేస్తున్నారని, అపోహలు సృష్టిస్తున్నారని, దయచేసి వాటికి స్వస్తి పలకాలని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కోరారు. ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం చరిత్రలో కలిసిపోయినట్టేనని స్పష్టం చేశారు. కేంద్రం ఇంకా అదే ఆలోచనలో ఉంటే ప్లాంట్ పునర్మిర్మాణానికి ఆర్థిక ప్యాకేజీ ఎందుకు మంజూరు చేస్తుందో ఉద్యోగులు, కార్మికులు ఆలోచించాలని కోరారు. కొందరు పబ్బం గడుపుకోవడానికి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర నిధులు సద్వినియోగం చేసుకొని ప్లాంట్‌ను మళ్లీ లాభాల బాటలోకి తేవాలని శ్రీనివాసవర్మ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Investments in AP: ఏపీలో భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్.. అత్యధికం ఎక్కడంటే
Maha Kumbh Mela: మీ ఊరి నుంచే కుంభమేళాకు బస్సు.. భక్తుల కోసం బంపర్ ఆఫర్
Tribute.. జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం చంద్రబాబు నివాళులు
AP News: ఏపీలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ
Read Latest AP News And Telugu News