Share News

MLC nomination process: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం...

ABN , Publish Date - Mar 10 , 2025 | 04:44 PM

MLC nomination process: రెండు తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ పర్వం ముగిసింది. తెలంగాణలో ఐదుగురు అభ్యర్థులు, ఏపీలో ఐదుగురు అభ్యర్థులు నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు.

MLC nomination process: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం...
AP Telangana MLC Nomination

అమరావతి/హైదరాబాద్, మార్చి 10: రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్చి 20న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఆయా పార్టీలు ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించేశాయి. నేటితో నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ అవడంతో ఆయా పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. దీంతో నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయ్యింది. తెలంగాణలోని 5, ఆంధ్రప్రదేశ్‌లోని 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.


ఇక తెలంగాణలో ఎమ్మెల్సీలు మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌, శేరి సుభాష్‌ రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్‌ హసన్‌ పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఇందులో బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన ఎగ్గె మల్లేశం గత ఏడాదే కాంగ్రెస్‌లో చేరారు. మీర్జా రియాజుల్‌ హాసన్‌ మజ్లిస్‌ నేత కాగా, మిగిలిన ముగ్గురు బీఆర్‌ఎస్‌ నేతలు. అటు ఏపీలో జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, అశోక్‌బాబు, యనమల రామకృష్ణుడుల పదవీకాలం ఈ నెల 29తో ముగియనుంది. దీంతో తెలంగాణలో ఐదు, ఏపీలో ఐదు స్థానాలకు ఇప్పటికే నోటిషన్ విడుదలైంది.


ఆంధ్రప్రదేశ్‌లో

ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో జనసేన తరపున నాగబాబు, టీడీపీ తరపున బీటీ నాయుడు, బీద రవిచంద్ర యాదవ్‌, కావలి గ్రీష్మ, బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాజు పేర్లను ఖరారు చేశారు. ఇప్పటికే నాగబాబు నామినేషన్ వేయగా.. మిగిలిన నలుగురు అభ్యర్థులు ఈరోజు అసెంబ్లీ కమిటీ హాలులో నామినేషన్ వేశారు. పొత్తులో భాగంగా ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో రెండింటిలో జనసేన, బీజేపీ అభ్యర్థులు బరిలో దిగారు. ఇక మిగిలిన మూడు స్థానాల్లో ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల నడుమ సమతూకం పాటిస్తూ చంద్రబాబు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశారు. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో రెండింటిని బీసీలకు కేటాయించగా.. ఒక స్థానాన్ని ఎస్సీ మహిళకు ఇచ్చింది.


తెలుగుదేశం తరఫున ఎమ్మెల్సీలుగా కావలి గ్రీష్మ, బీదా రవిచంద్ర యాదవ్, బీటీ నాయుడు అసెంబ్లీ ఆవరణలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. అభ్యర్థులకు మద్దతుగా నారా లోకేష్, అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, విష్ణుకుమార్ రాజు, రఘురామకృష్ణంరాజు, పితాని సత్యనారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పల్లా శ్రీనివాస్, టీడీ జనార్దన్, కురుగొండ్ల రామకృష్ణ, అమర్నాథ్ రెడ్డి తదితరులు వచ్చారు. అలాగే అసెంబ్లీ కమిటీ హాల్లో బీజేపీ అభ్యర్థి సోమివీర్రాజు నామినేషన్ దాఖలు చేశారు. మంత్రులు కందుల దుర్గేష్ ,సత్య కుమార్ యాదవ్, పల్లా శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక రేపు నామినేషన్లను పరిశీలించనున్నారు. ఈ నెల 13న నామినేషన్‌ల ఉపసంహరణకు చివరి తేదీ. అయితే విపక్షం నుంచి పోటీ లేనందున ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది.


తెలంగాణలో

తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు గాను మూడు స్థానాల్లో కాంగ్రెస్ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లు ఖరారయ్యాయి. పొత్తులో భాగంగా సీపీఐకి ఒక స్థానాన్ని కేటాయించింది. సీపీఐ తరఫున నెల్లికంటి సత్యాన్ని బరిలోకి దిగారు. వీరంతా నేడు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, సీపీఐ నేతలు హాజరయ్యారు. అలాగే బీఆర్‌ఎస్ తన అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ కుమార్ పేరును ఖరారు చేయడంతో ఆయన నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు పాల్గొన్నారు.


ఐదు స్థానాలకు ఐదు మంది అభ్యర్థులు ఎమ్మెల్యేల సంతకాలతో నామినేషన్లు దాఖలు చేశారు. ముగ్గురు ఇండిపెండెంట్‌లు ఒక్క ఎమ్మెల్యే సంతకం లేకుండా నామినేషన్ దాఖలు చేశారు. రేపు (మంగళవారం) నామినేషన్ల పరిశీలించనున్న అధకారులు.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నామినేషన్లను తిరస్కరించనున్నారు. 13న ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుండగా.. ఆ తర్వాత అధికారికంగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ వెల్లడించనుంది.


ఇవి కూడా చదవండి..

Most Wanted Cheater Arrest: మోస్ట్ వాంటెడ్ నోటోరియస్ అరెస్ట్.. మోసాల చిట్టా మామూలుగా లేదుగా

Jaggareddy in Films: సినిమాల్లోకి జగ్గారెడ్డి.. టైటిల్ ఏంటో తెలుసా

Read Latest AP News And Telugu News

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 10 , 2025 | 04:44 PM