Nellore Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
ABN , Publish Date - Sep 17 , 2025 | 02:12 PM
Nellore Road Accident: నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
నెల్లూరు, సెప్టెంబర్ 17: సంగం మండలం పెరమన వద్ద ముంబై జాతీయ రహదారిపై ఘోర రోడ్డు (Raod Accident) ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఇసుక టిప్పర్ రాంగ్ రూట్‌లో వెళ్లి కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. కారును ఢీకొట్టి ఆపై కొంత దూరం వరకు టిప్పర్ లాక్కెళ్లింది. దీంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. మృతుల్లో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు, ఒక పాప ఉన్నట్లు తెలుస్తోంది.

సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారు తాళ్లూరు రాధా పేరుపై రిజిస్ట్రేషన్ అయినట్లు పోలీసులు గుర్తించారు. మృతులు నెల్లూరు జిల్లా కేంద్రంలోని ముత్తుకూరు గేటు సమీపంలో గుర్రంవారివీధికి చెందినవారిగా తెలుస్తోంది. మృతుల్లో శేషం శేరమ్మ(42), శేషం బాలవెంగయ్య(40), తాళ్లూరి రాధా(38), తాళ్లూరి శ్రీనివాసులు (42), తెల్లగుండ్ల లక్ష్మి(40), తెల్లగుండ్ల శ్రీనివాసులు ఉన్నారు. కాగా.. డ్రైవర్ పేరు తెలియాల్సి ఉంది. ఆత్మకూరులో ఒకరిని పరామర్శించేందుకు ప్రభుత్వ వైద్యశాల వద్దకు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రమాదంపై మంత్రుల సంతాపం
నెల్లూరు జిల్లా సంఘం మండలం పెరమన వద్ద ఘోర రోడ్డు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు అత్యవసర వైద్యం అందించాలంటూ మంత్రి ఆదేశాలు జారీ చేశారు. భద్రత చర్యలు చేపట్టాలని రవాణా అధికారులకు మంత్రి సూచనలు చేశారు. నిర్లక్ష్యంగా ఉంటే సహించమని హెచ్చరిస్తూ.. సహాయక చర్యలు తీసుకోవాలని ఫోన్లో అధికారులకు మంత్రి రాంప్రసాద్ ఆదేశించారు. రహదారులపై నియమాల అమలు తప్పనిసరి చేయాలని అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. జాతీయ రహదారిపై టిప్పర్ లారీ ఢీకొని పలువురు మరణించిన వార్త తీవ్రంగా కలచివేసిందని మంత్రి మండిపల్లి ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే నెల్లూరు రోడ్డు ప్రమాద ఘటనపై రాష్ట్ర రోడ్లు- భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. టిప్పర్ - కారు ఢీకొని పలువురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భరోసా ఇచ్చారు.
ఇవి కూడా చదవండి...
మీరు దీర్ఘాయుష్షుతో ఉండాలి.. ప్రధానికి పవన్ బర్త్‌డే విషెస్
Read Latest AP News And Telugu News