Vivekananda Reddy Case: వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తునకు సిద్ధం!
ABN , Publish Date - Sep 17 , 2025 | 04:49 AM
మాజీ మంత్రి, జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీబీఐ స్పష్టం చేసింది. ఈ విషయంలో కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామని తెలిపింది. ఈ కేసులో తమ దర్యాప్తు ముగిసిందని సీబీఐ పేర్కొనగా...
కోర్టు ఆదేశిస్తే ముందుకెళతాం.. సుప్రీంకు సీబీఐ స్పష్టీకరణ
సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సునీతా రెడ్డికి నిర్దేశం
దానిపై 8 వారాల్లో నిర్ణయించాలి
అప్పటిదాకా బెయిల్ రద్దు పిటిషన్లు పెండింగ్: సుప్రీం
అసలు దోషులు తేలేందుకు ఇంకా దర్యాప్తు జరగాలి: లూథ్రా
న్యూఢిల్లీ, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీబీఐ స్పష్టం చేసింది. ఈ విషయంలో కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామని తెలిపింది. ఈ కేసులో తమ దర్యాప్తు ముగిసిందని సీబీఐ పేర్కొనగా... హత్యతో ముడిపడిన ఆర్థిక, ఇతర కీలక అంశాలపై మరింత దర్యాప్తు అవసరమని వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే... ఈ కేసులో నిందితులు వైఎస్ అవినాశ్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి సహా పలువురికిచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సునీతారెడ్డి, సీబీఐ దాఖలు చేసిన అన్ని పిటిషన్లపైనా మంగళవారం జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ సతీశ్‌చంద్రశర్మతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. సునీత తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా, సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు వాదనలు వినిపించారు.
తదుపరి దర్యాప్తు అవసరం: లూథ్రా
వివేకా హత్య కేసులో అసలు దోషులెవరో తేలాలంటే తదుపరి దర్యాప్తు అవసరమని లూథ్రా విజ్ఞప్తి చేశారు. అత్యంత దారుణ హత్యను గుండెపోటుగా చిత్రీకరించారని, నెత్తుటి మరకలు చెరిపేశారని, సాక్ష్యాలను ధ్వంసం చేశారని, అసలు కుట్రకోణాన్ని సీబీఐ విస్మరించిందని తెలిపారు. ట్రయల్ కోర్టు తమ పిటిషన్‌ను సరిగా విచారించలేదని, అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. అదనపు సొలిసిటర్ జనరల్ కలుగజేసుకుని.. గతంలో న్యాయస్థానం ఆదేశాలతోనే దర్యాప్తును ముగించామని తెలిపారు. మరింత దర్యాప్తు అవసరమని న్యాయస్థానం ఆదేశిస్తే.. తాము సిద్ధమేనని తెలిపారు. దీనికి నిందితుల తరఫు సీనియర్ న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. ఇప్పటికే 13లక్షల పేజీల చార్జిషీట్లు ఉన్నాయని, ఇప్పుడు మళ్లీ దర్యాప్తు అంటే విచారణను మరింత జాప్యం చేయడమేనని అన్నారు. ఇరుపక్షాల వాదనల అనంతరం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఈ కేసులోకి మనం ఇంకెన్నిసార్లు వెళ్లగలం? ఇప్పటికే ఎన్నో చార్జిషీట్లు, ఎన్నో పిటిషన్లు.. ప్రతి చార్జిషీటును, ప్రతి పిటిషన్‌నూ పరిశీలించడం సాధ్యమేనా? ఇదే కొనసాగితే విచారణ పూర్తికావడానికి దశాబ్దకాలం పట్టేలా ఉంది’ అని జస్టిస్ సుందరేశ్ అసహనం వ్యక్తం చేశారు. అయితే సీబీఐ తదుపరి దర్యాప్తు అవసరమా లేదా అనే అంశంపై ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని సునీతకు సూచించింది. రెండువారాల్లో పిటిషన్ దాఖలు చేయాలని, 8వారాల్లో సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఇతర పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయన్న అంశంతో ప్రభావితం కాకుండా.. యోగ్యత ఆధారంగానే పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని స్పష్టంచేసింది. ఈ కేసులో కీలక నిందితుడు అవినాశ్‌రెడ్డి సహా నిందితుల బెయిల్ రద్దు పిటిషన్ల కొట్టివేతకు మాత్రం సుప్రీంకోర్టు నిరాకరించింది. వాటిపై విచారణను పెండింగ్‌లో ఉంచింది.
మద్యం కేసులో కసిరెడ్డి, చెవిరెడ్డి మళ్లీ బెయిలు పిటిషన్లు
విజయవాడ, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో నిందితులుగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఏసీబీ కోర్టులో మంగళవారం బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ నిందితులు ఇద్దరు విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి వైద్యం చేయించుకోవడానికి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. చెవిరెడ్డి మాత్రం తనకు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను కోర్టు 18వ తేదీకి వాయిదా వేసింది. ఇదే కేసులో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న ఎంపీ పీవీ మిఽథున్‌రెడ్డి దాఖలు చేసిన బెయిలుపై విచారణ 19కి వాయిదా పడింది.