Nellore Politics: నగర వైసీపీ అధ్యక్షుడు టీడీపీలోకి జంప్.. అదే బాటలో కార్పొరేటర్లు..
ABN , Publish Date - Dec 13 , 2025 | 07:19 PM
నెల్లూరు జిల్లా రాజకీయం వేడెక్కుతోంది. వైసీపీ అక్కడ రోజురోజుకూ బలహీనపడుతున్నట్టు తెలుస్తోంది. ఆ పార్టీకి చెందిన నేతలు ఇటీవల టీడీపీలోకి క్యూ కట్టడమే దీనికి కారణంగా తెలుస్తోంది.
నెల్లూరు, డిసెంబర్ 13: జిల్లా రాజకీయాలు రోజు రోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి క్యూ కడుతున్నారు. తాజాగా.. నగర వైసీపీ అధ్యక్షుడు బొప్పల శ్రీనివాస్ యాదవ్.. సైకిల్ ఎక్కారు. రాష్ట్ర మంత్రి నారాయణ ఆయన్ను పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. 37వ డివిజన్ కార్పొరేటర్ అయిన శ్రీనివాసులు యాదవ్.. నగర వైసీపీ అధ్యక్షుడిగా, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్‌గా ఉన్నారు. ఈనెల 18 న మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి ముందు మంత్రి నారాయణ సమక్షంలో పలువురు వైసీపీ కార్పొరేటర్లూ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నగర అధ్యక్షుడే పార్టీ మారడంతో అయోమయంలో పడిపోయిన పలువురు వైసీపీ నేతలు.. శ్రీనివాస్ యాదవ్ బాటే పట్టారు. మంత్రి నారాయణ చేస్తున్న అభివృద్ధి కారణంగానే తాము తెలుగుదేశంలోకి వచ్చామని చెప్తున్నారు. ఇక.. శనివారం మంత్రి నారాయణ సమక్షంలో 42వ డివిజన్ కార్పొరేటర్ కరీముల్లా కూడా తెలుగుదేశంలోకి చేరారు.
ఈ విషయమై వైసీపీ నుంచి టీడీపీలోకి మారిన శ్రీనివాసులు యాదవ్ స్పందిస్తూ.. 'మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి చూసి టీడీపీలో చేరాను. నేను వైసీపీలో ఉన్నప్పటికీ మంత్రి నారాయణ నాకు అనేక రకాలుగా సాయం చేశారు. ఎప్పుడూ పార్టీ మారాలని నన్ను అడగలేదు. నేనే స్వచ్ఛందంగా వైసీపీని వీడి టీడీపీలో చేరాను. మిగిలిన 11 నెలల పదవీ కాలంలో నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను పార్టీ మారడం వెనుక ఎవరి ప్రోద్బలం లేదు. మేయర్‌పై అవిశ్వాస తీర్మానం గెలిచి తీరతాం' అని పేర్కొన్నారు.
పార్టీ మార్పు ఆలోచనపై అక్కడి టీడీపీ అధికార ప్రతినిధి సంపత్ కుమార్ మాట్లాడుతూ.. నెల్లూరుకు స్రవంతి మేయర్‌గా ఎప్పుడూ వ్యవహరించలేదు. రాజకీయాలు వేరు.. అభివృద్ధి వేరు. అని మంత్రి నారాయణ చెప్పారు. కార్పొరేటర్లు స్వచ్ఛందంగా పార్టీ మారి నగర అభివృద్ధి చేసుకోవాలని నిర్ణయించారు. వైసీపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. వారి భాష వల్లే జనం 11 సీట్లకు పరిమితం చేశారు. కేవలం అభివృద్ధి కోసమే కార్పొరేటర్లు పార్టీ మారుతున్నారు' అని చెప్పుకొచ్చారు.
శరవేగంగా మారుతున్న రాజకీయం..
నగరంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఇన్నాళ్లూ వైసీపీలో కీలక పాత్ర పోషించిన కార్పోరేటర్లు కరీముల్లా, శ్రీనివాస్ యాదవ్ టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఆ పార్టీ బలహీనపడినట్టు తెలుస్తోంది. దీంతో మరో ఇద్దరు కార్పొరేటర్లు కూడా టీడీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లినట్టు సమాచారం. దీంతో ఏం జరుగుతుందో అర్థంకాక వైసీపీ అధినేత జగన్, ఇతర నాయకులు అయోమయంలో పడ్డారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాక్షన్‌లోకి దిగిన గంటల వ్యవధిలోనే మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి రియాక్షన్ మొదలుపెట్టినట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మాజీ సీఎం జగన్ వద్ద వైసీపీలో చేరిన ఐదుగురు కార్పోరేటర్లు.. గంట వ్యవధిలోనే తిరిగి టీడీపీలో చేరారు. దీంతో అనిల్ కుమార్ తీరుపై సొంత పార్టీలోనే తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవీ చదవండి: