Share News

CM Chandrababu Naidu: అన్ని మున్సిపాల్టీల్లో స్మార్ట్ స్ట్రీట్ బజార్లు

ABN , Publish Date - Oct 11 , 2025 | 07:57 PM

గత ప్రభుత్వంలో అరాచకాలు చేశారంటూ వైసీపీ నేతలను సీఎం చంద్రబాబు విమర్శించారు. మద్యాన్ని అడ్డుపెట్టుకుని తప్పులు మీద తప్పులు చేశారని మండిపడ్డారు.

CM Chandrababu Naidu: అన్ని మున్సిపాల్టీల్లో స్మార్ట్ స్ట్రీట్ బజార్లు
AP CM Chandrababu

అమరావతి, అక్టోబర్ 11: మోడరన్ కంటైనర్స్‌తో స్మార్ట్ స్ట్రీట్ బజార్‌ను ఏర్పాటు చేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వినూత్న ఆలోచనతో తొలిసారిగా నెల్లూరులో వీటిని ఏర్పాటు చేశామని వివరించారు. ఇది చూస్తుంటే.. మనం నెల్లూరులో ఉన్నామా? లేకుంటే విదేశాల్లో ఉన్నామా? అనే ఆలోచన వస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. శనివారం నాడు నెల్లూరు మైపాడు గేటు వద్ద స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్‌ను అమరావతి నుంచి వర్చువల్ విధానంలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలో అన్ని మున్సిపాల్టీల్లో ఈ స్మార్ట్ స్ట్రీట్ బజార్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.


ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో అరాచకాలు చేశారంటూ వైసీపీని విమర్శించారు. మద్యం అడ్డు పెట్టుకుని తప్పులు మీద తప్పులు చేశారని మండిపడ్డారు. ఇటీవల నకిలీ మద్యం పట్టుకున్నామని.. ఈ కేసులో తమ పార్టీ వారు ఉన్నా.. వారిని సైతం సస్పెండ్ చేశామని గుర్తు చేశారు. కానీ దీనిని సైతం రాజకీయం చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇకపై మద్యం సీసాలపై హాలోగ్రామ్ ఉంటుందని.. దీనిని ఫోన్‌లో స్కాన్ చేస్తే మొత్తం వివరాలు వస్తాయని ప్రజలకు తెలిపారు. రాష్ట్రంలో శవ రాజకీయాలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. తప్పుడు ప్రచారాలు చేస్తే తాట తీస్తానంటూ వారిని హెచ్చరించారు. ఆడబిడ్డల జోలికి వస్తే సహించబోమని క్లియర్ కట్‌గా వార్నింగ్ ఇచ్చారు. తాము మంచిగా ఉంటామని.. మీ జీవన ప్రమాణాల కోసం పని చేస్తామంటూ ప్రజలకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.


అలాగే మెడికల్ కాలేజీలపై సైతం అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కాలేజీలు వస్తే.. 180 సీట్లు అదనంగా వస్తాయని.. తద్వారా పేద వారికి మంచి వైద్యం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారం చేపట్టిన ఈ 16 నెలల్లో చేసింది ప్రారంభం మాత్రమేనని.. చేయాల్సింది చాలా ఉందన్నారు. అయితే విధ్వంసాన్ని అధిగమించడం అంతా ఈజీ కాదని చెప్పారు. పిల్లల భవిష్యత్తుకి ఏఐ అవసరమని స్పష్టం చేశారు. విశాఖకి రూ.90వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని ఆయన ప్రకటించారు. అలాగే రూ.లక్ష కోట్లతో స్టీల్ ఫ్యాక్టరీ విశాఖకు రానుందని ప్రకటించారు.


రాష్ట్రంలో నదుల అనుసంధానం చేస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రస్తుతం నదుల్లో నీరు పుష్కలంగా ఉందని.. ఈ నీటిని రెండు పంటలకి సాగునీరుగా అందిస్తున్నామన్నారు. మెప్మా, డ్వాక్రా ద్వారా లక్ష మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని ప్రణాళిక రచిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


అయితే కూటమి పార్టీలని ఆశీర్వదించాలని ఎన్నికలకి ముందు తాను కోరానని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తానెప్పుడూ చూడని విధంగా నెల్లూరులో జరిగిన ఎన్నికల సభకి ప్రజలు భారీగా తరలివచ్చారన్నారు. అదే చిత్తశుద్ధి, అంకితభావంతో తానూ పని చేస్తున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు.


ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఒకప్పుడు ఇంటికి ఒక ఐటీ ఉద్యోగి ఉండాలని భావించామని.. కానీ ప్రస్తుతం ఏ దేశంలో చూసినా మన ఐటీ ఉద్యోగులే ఉన్నారని సంతోషం వ్యక్తం చేశారు. నెల్లూరులో ముందుగానే దీపావళి వచ్చిందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు చమత్కరించారు.


ఈ సందర్భంగా మహిళా వ్యాపారులతో సీఎం చంద్రబాబు నేరుగా మాట్లాడారు. దుకాణాలు పొందడంతోపాటు నూతన వ్యాపారాలు చేపట్టిన మహిళలు.. తమ ఆనందాన్ని సీఎం చంద్రబాబుతో పంచుకున్నారు.


ఎంపీ వేమిరెడ్డి కామెంట్స్...

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ.. ఈ స్మార్ట్ స్ట్రీట్ బజార్‌కి రావడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. మంత్రి నారాయణ ఎంతో చొరవతో ఈ స్మార్ట్ స్ట్రీట్ బజార్‌ని తీర్చిదిద్దారని తెలిపారు. మహిళలు దుకాణాలకి యజమానులు కావడం తమకు సంతోషం కలిగించిందని ఆయన పేర్కొన్నారు.

ఈ స్మార్ట్ స్ట్రీట్ బజార్ లో వినియోగదారులకి ఏ వస్తువు కావాలన్నా లభ్యమయ్యే అవకాశాన్ని కల్పించారు. సోలార్ పవర్‌తో పని చేసే దీపాలు, సీసీ కెమెరాలు, రూఫ్ సిట్టింగ్‌తోపాటు వైఫై‌ను ఏర్పాటు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అలా ఉంటే జగన్ తట్టుకోలేడు... పల్లా షాకింగ్ కామెంట్స్

కల్తీ మద్యానికి మూల విరాట్ జగన్..

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 11 , 2025 | 08:23 PM