National Disaster Management : నాడు జగన్ పగబట్టారు బాబు పూర్తిచేయించారు
ABN , Publish Date - Jan 19 , 2025 | 04:26 AM
అమరావతి నిర్మాణంపై పగబట్టిన గత ప్రభు త్వం, అక్కడకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు సైతం రా కుండా కక్ష పూరితంగా వ్యవహరించింది.
గన్నవరంలోని కొండపావులూరులో ఎన్‌ఐడీఎం, ఎన్‌డీఆర్‌ఎ్‌ఫల ఏర్పాటు
ఢిల్లీ తర్వాత జాతీయ విపత్తు కేంద్రం ఇక్కడే.. నేడు ప్రారంభించనున్న అమిత్‌షా
నాడు టీడీపీ హయాంలో శంకుస్థాపన.. వైసీపీ సర్కారులో సహాయ నిరాకరణ
అమరావతితోపాటు కేంద్ర సంస్థలకూ మోకాలడ్డు.. కేంద్ర లేఖలూ బుట్టదాఖలు
(ఆంధ్రజ్యోతి-విజయవాడ)
అమరావతి నిర్మాణంపై పగబట్టిన గత ప్రభు త్వం, అక్కడకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు సైతం రా కుండా కక్ష పూరితంగా వ్యవహరించింది. ఇందులో ఎన్‌ఐడీఎం(జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ), ఎన్‌డీఆర్‌ఎఫ్ (జాతీయ విపత్తు సహాయక బృందాలు) నిర్మాణాలకు అప్పటి సీఎం జగన్ సహాయ నిరాకరణ చేశారు. ఈ సంస్థలు 2019కు ముందే, అప్పటి టీడీపీ హయాంలో కృష్ణాజిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో శంకుస్థాపనలు జరుపుకొన్నా యి. ఈ సంస్థల నిర్మాణ పనులు ఐదేళ్లలో ముందుకెళ్లకుండా గత వైసీపీ ప్రభుత్వం అనేక అడ్డంకులు కల్పించింది. రహదారులు వంటి కనీస వసతులు కూడా ఇవ్వకుండా ఇబ్బందులుపెట్టింది. దీనిపై కేంద్రం ఎన్ని లేఖలు రాసినా పట్టించుకోలేదు. ఇన్ని ఇబ్బందుల మధ్యే నిర్మాణ పనులు దాదాపు పూర్తిచేసుకున్న ఈ సంస్థలకు కూటమి ప్రభుత్వం రాగానే అండగా నిలిచింది. దీంతో చకచకా మిగతా లాంఛనాలు పూర్తిచేసుకుని ప్రారంభోత్సవం జరుపుకోడాని కి ఎన్‌ఐడీఎం, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిద్ధమయ్యాయి. ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వీటిని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన శనివారం రాత్రి ఎనిమిది గంటలకు విజయవాడ చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద అమిత్‌షాకు కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు బ్రహ్మాండమైన రీతిలో స్వాగతం పలికారు.
వీరిలో.. కేంద్ర సహాయ మంత్రులు బండి సంజయ్, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, అనిత, పార్ధసారథి, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాశ్, సత్యకుమార్ యాదవ్, కింజరపు అచ్చెన్నాయుడు, అనగాని సత్య ప్రసాద్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, ఎంపీలు దగ్గుబాటి పురందేశ్వరి, వల్లభనేని బాలశౌరి, కేశినేని శివనాఽథ్, సీఎం రమేశ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహనరావు, బోడే ప్రసాద్, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యర్, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎన్డీఆర్‌ఎఫ్ డీజీ పీయూశ్ ఆనంద్, ఐజీ నరేంద్ర సింగ్, డీఐజీ హరి ఓం గాంధీ, ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్‌రావు తదితరులున్నారు. అనంతరం అమిత్‌షా రోడ్డు మార్గాన తాడేపల్లి సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అమిత్ షా రాక సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగే గన్నవరంలోని విమానాశ్రయం చుట్టు పక్కల 1200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఫలించిన బాబు కష్టం..
రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రకు కేంద్ర సంస్థలను తీసుకురావాలని ఆనాడు చంద్రబాబు తపించారు. కొండపావులూరును ఆనుకుని సరిహద్దున ఉండే సూరంపల్లికు ప్లాస్టిక్ ఇంజనీరింగ్ కోర్సులను అందించే ’సీపెట్’ సంస్థను తెచ్చారు. దానికి సమీపంలోకి మరిన్ని కేంద్ర సంస్థలు వచ్చేందుకు వీలుగా ఆనాడే భూములు కేటాయించారు. ఈ భూ ముల్లోనే ఇప్పుడు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌ఐడీఎంలు నిర్మాణ పనులు పూర్తి చేసుకున్నాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్ పదో బెటాలియన్‌ను 2012లో ఉమ్మడి ఏపీకి కేంద్రం మంజూరు చేసింది. అప్పట్లో తగిన స్థలం చూపించకపోవటం వల్ల క్యాంపస్ ఏర్పాటుకాలేదు. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన టీడీపీ హయాంలో కొండపావులూరు ప్రాంతాన్ని ఎంపిక చేసి 50 ఎకరాల భూములను దీనికోసం కేటాయించింది. 2017లో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ శంకుస్థాపన చేశారు. ఇది ఏపీ, కర్ణాటక పరిధిలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇక.. ఎన్‌ఐడీఎం ఏర్పాటుకు అప్పట్లో టీడీపీ ప్రభుత్వం 10 ఎకరాలను కేటాయించింది. దీనికి 2018, మేలో అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు శంకుస్థాపన జరిపారు.
ఎన్నెన్నో ప్రత్యేకతలు
ఢిల్లీ తర్వాత జాతీయ విపత్తు నిర్వహణ సంస్థను కలిగిన ఘనత మన రాష్ట్రానికే దక్కింది. సువిశాల సముద్ర తీర ప్రాంతాన్ని కలిగిన రాష్ట్రం మనది. ఈ నేపథ్యంలో జాతీయ విపత్తులను పరిశీలించి, విశ్లేషించి, అధ్యయనం చేసి, శిక్షణ ఇచ్చే రెండు జాతీయ సంస్థలూ మన దగ్గరే ఏర్పాటు కావడం విశేషం.