Minister: మంత్రి పయ్యావుల ఆసక్తికర కామెంట్స్.. సూపర్ సిక్స్.. సూపర్ హిట్
ABN , Publish Date - Sep 02 , 2025 | 11:53 AM
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 15 నెలల్లోనే సూపర్ సిక్స్ పథకాలను సూపట్ హిట్ అయ్యేలా చేసిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. ఈనెల 10న సూపర్ సిక్స్-సూపర్ హిట్ పేరుతో అనంతలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
అనంతపురం: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 15 నెలల్లోనే సూపర్ సిక్స్ పథకాలను సూపట్ హిట్ అయ్యేలా చేసిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్(Minister Payyavula Keshav) పేర్కొన్నారు. ఈనెల 10న సూపర్ సిక్స్-సూపర్ హిట్ పేరుతో అనంతలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. 3.50 లక్షల మంది ప్రజలు కలుస్తారని, ఇందులో ఏకంగా లక్ష మంది మహిళలే ఉంటారని ఆయన స్పష్టం చేశారు.
అనంతపురం(Anantapur)లోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఇన్‌చార్జి మంత్రి టీజీ భరత్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత, ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు, ఉమ్మడి జిల్లా పార్టీ పరిశీలకుడు కోవెలమూడి రవీంద్ర, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జనసేన, బీజేపీ నాయకులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారి సీఎం పదవి చేపట్టి 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నాయకులు,

ప్రజల తరఫున సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత ఈనెల 10వ తేదీ ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ బహిరంగ సభ నిర్వహణ స్థలం ఎంపిక, ఏర్పాట్లు తదితర అంశాలపై గంటన్నరపాటు చర్చించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్‌గా అమలు చేశామన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సాగిందన్నారు. ఇప్పుడిప్పుడే ఏపీ కోలుకుంటోందన్నారు. రాష్ట్రంలో గణనీయమైన మార్పు మొదలైందన్నారు. లా అండ్ ఆర్డర్ అద్భుతంగా అమలవుతోందన్నారు.
అన్నివర్గాల ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారన్నారు. తమకు నచ్చిన పని చేసుకుని బతుకుతున్నారన్నారు. తమ ప్రభుత్వంలో కక్ష సాధింపు ఉండబోదని స్పష్టం చేశారు. ఈనెల 10వ తేదీ అనంతపురంలో సూపర్ సిక్స్-సూపర్‌హిట్ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. నగర పరిధి జీఎంఆర్ ఇంద్రప్రస్త స్థలంలో సభ నిర్వహించేలా ఎమ్మెల్యేలు ఏకాభిప్రాయానికి వచ్చామన్నారు. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య సభ ఉంటుందన్నారు. పార్టీ నిర్ణయమే ఫైనల్ అన్నారు. అందరూ సహకరించి విజయవంతం చేయాలని ఆయన కోరారు.
పవన్ కల్యాణ్, బీజేపీ పెద్దలు కూడా..
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్ పథకాలు అద్భుతంగా అమలవుతున్నాయన్నారు. వైసీపీ అనవసరంగా దుష్ప్రచారం చేస్తోందన్నారు. ప్రజలు, రైతులు, విద్యార్థులు అందరికీ పథకాలు అమలవుతున్నాయన్నారు. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జనసేన నాయకుడు, అహుడా చైర్మన్ టీసీ వరుణ్ మాట్లాడుతూ... ఏపీలో సూపర్ సిక్స్ పథకాలు చక్కగా అమలు చేస్తున్నారన్నారు. సభకు తమ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం హాజరవుతారని తెలిపారు. తర్వాత కొత్తగా అనంతపురం జిల్లాకు మంజూరైన అంబులెన్స్‌ను మంత్రులు టీజీ భరత్, పయ్యావుల కేశవ్, సవిత, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News and National News