Urea Shortage: పడిగాపులు.. తోపులాటలు
ABN , Publish Date - Sep 02 , 2025 | 04:30 AM
రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పంపిణీ కేంద్రాలు, దుకాణాల ముందు రేయింబవళ్లు బారులు తీరి పడిగాపులు...
రంగారెడ్డి, భద్రాద్రి జిల్లాల్లో తోపులాట
పలువురు రైతులకు గాయాలు
వనపర్తిలో కౌలు రైతు ఆత్మహత్యాయత్నం
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పంపిణీ కేంద్రాలు, దుకాణాల ముందు రేయింబవళ్లు బారులు తీరి పడిగాపులు కాస్తున్నారు. అనేక ప్రాంతాల్లో గంటలకొద్దీ లైన్లలో నిల్చోలేక అనేక చోట్ల పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు, చెప్పులు, రాళ్లు వరసగా పెట్టి నిరీక్షిస్తున్నారు. చాలా చోట్ల తోపులాటలు, గలాటాలు చోటుచేసుకుంటున్నాయి. అయినా దొరక్కపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. రోజుల తరబడి తిరుగుతున్నా ఒక్క బస్తా కూడా దొరకడం లేదంటూ సోమవారం నల్లగొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలో కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై, మాడ్గులపల్లిలో అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై రైతులు బైఠాయించారు. పోలీసులు, వ్యవసాయ అధికారుల హామీతో అరగంట తర్వాత ఆందోళన విరమించారు. మహబూబాద్ జిల్లా కేంద్రంలోని తొర్రూరు-మహబూబాబాద్ ప్రధాన రహదారిపై రైతులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. అనంతరం దాదాపు 3 గంటల పాటు అక్కడే బైఠాయించారు. ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారిపైనా 4 గంటల పాటు ఆందోళన చేపట్టడంతో కిలోమీటర్ల కొద్దీ వాహనాల నిల్చిపోయాయి. ఇదే జిల్లాలోని కేసముద్రంలో టోకెన్ల కోసం తోపులాట జరగ్గా .. పలువురు రైతులు గాయపడ్డారు. అలాగే, రంగారెడ్డి జిల్లా పెద్దేముల్‌లోని రైతు సేవా సంఘానికి 220 బస్తాలు రాగా.. రైతులు ఒక్కసారిగా ఎగబడడంతో తోపులాట జరిగి ఓ రైతు తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించారు. భారీ సంఖ్యలో రైతులు తరలిరావడంతో కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులోని సొసైటీ కార్యాలయం వద్ద యూరియా పంపిణీలో తోపులాట జరిగింది. ఇల్లెందు మండలం కొమరారంలో రైతులు రాస్తారోకో నిర్వహించగా.. న్యూడెమోక్రసీ నాయకులు మద్దతు ప్రకటించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని అనేక చోట్ల ఆదివారం రాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు పడిగాపులు కాసిన రైతులు.. యూరియా రాకపోవడంతో తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో అన్నదాతలు ఆందోళనకు దిగారు. అంబేడ్కర్‌చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేట, మనోహరాబాద్, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో అన్నదాతలు రోడ్లపై బైఠాయించారు. కాగా, వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురంలో యూరియా దొరకడం లేదన్న ఆవేదనతో ఖిల్లాఘణపురానికి చెందిన కౌలు రైతు బిక్కీ చెన్నకేశవులు భవనంపైకి ఎక్కి దూకేసేందుకు ఆత్మహత్యాయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్, హరీష్ రావు మధ్యంతర పిటిషన్లపై కొన్ని ఘడియల్లో విచారణ
తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు
For More TG News And Telugu News