Share News

Worlds Largest FOS Plant: ఆరోగ్యానికి తీపి కబురు

ABN , Publish Date - Sep 02 , 2025 | 04:52 AM

భారత బయో టెక్నాలజీ, ఆహార ప్రాసెసింగ్‌ రంగానికి ఊతమిచ్చేలా రివిలేషన్స్‌ బయోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తెలంగాణలోని..

Worlds Largest FOS Plant: ఆరోగ్యానికి తీపి కబురు

  • తెలంగాణలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎఫ్‌వోఎస్‌ ప్లాంట్‌

హైదరాబాద్‌/నిజామాబాద్‌, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): భారత బయో టెక్నాలజీ, ఆహార ప్రాసెసింగ్‌ రంగానికి ఊతమిచ్చేలా రివిలేషన్స్‌ బయోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తెలంగాణలోని నిజామాబాద్‌ సమీపంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రక్టో ఒలిగో శాకరాయిడ్స్‌(ఎ్‌ఫవోఎస్‌) తయారీ యూనిట్‌ ఏర్పాటవుతోంది. సంవత్సరానికి 20 వేల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంట్‌ను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక శాఖలోని బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్‌ అసిస్టెన్స్‌ కౌన్సిల్‌ (బీఐఆర్‌ఏసీ) ఆర్థిక సహాయం అందిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టు విజయవంతం కావడానికి విశేష సహకారం అందిస్తోంది. రివిలేషన్స్‌ బయోటెక్‌, బీఐఆర్‌ఏసీ ఇప్పటికే దీనికి సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్నాయి. నిజామాబాద్‌ మెగా ఫుడ్‌ పార్క్‌లో నిర్మాణంలో ఉన్న ఈ యూనిట్‌ ఆగస్టు 2027 నాటికి పూర్తికానుంది. దీని ద్వారా 200 మందికి పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు, 500 మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ ప్రాజెక్టు భారత ప్రభుత్వ ‘మేక్‌ ఇన్‌ఇండియా’లో భాగంగా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం మాత్రమే కాకుండా, భారత్‌ను ప్రపంచ స్థాయి ఎఫ్‌వోఎస్‌ ఎగుమతిదారుగా నిలపడం లక్ష్యంగా పెట్టుకుంది.


నిజామాబాదే ఎందుకు?

‘‘భారతదేశం ప్రస్తుతం మధుమేహ వ్యాధి విజృంభణతో ఇబ్బంది పడుతోంది. చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయమైన ఎఫ్‌వోఎ్‌సను ఉపయోగించడం వల్ల ఈ సమస్యకు కొంతమేర పరిష్కారం లభిస్తుంది. ఎఫ్‌వోఎస్‌ తయారీకి చక్కెర ఏకైక ప్రధాన ముడిపదార్థం. తెలంగాణలోని నిజామాబాద్‌ ఒక ప్రధాన చక్కెర ఉత్పత్తి కేంద్రం కావడంతో, ఇక్కడ ఎఫ్‌వోఎస్‌ ప్లాంట్‌ ఏర్పాటు కావడం ద్వారా రాష్ట్రంలోని చెరుకు సాగు దీర్ఘకాలిక స్థిరత్వానికి తోడ్పడుతుంది’’ అని రివిలేషన్స్‌ బయోటెక్‌ ప్రతినిధి పేర్కొన్నారు. ఎఫ్‌వోఎస్‌ ఒక సహజ ప్రీబయాటిక్‌. ఇది న్యూట్రాసూటికల్స్‌ ఫంక్షనల్‌ బేవరేజెస్‌ వంటి వాటిలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇది జీర్ణాశయ ఆరోగ్యానికి మేలు చేస్తుందని శాస్త్రీయంగా రుజువైంది. రివిలేషన్స్‌ బయోటెక్‌ ఎన్నో సంవత్సరాల పాటు పరిశోధనలు చేసి వినూత్న పర్యావరణహితమైన తయారీ పద్ధతిని అభివృద్ధి చేసింది. దీని ద్వారా ఎఫ్‌వోఎ్‌సను అత్యంత వేగంగా, పర్యావరణానికి అనుకూలంగా ఉత్పత్తి చేయడం సాధ్యమైంది. ఇప్పటికే సంస్థ స్వీట్‌ స్పాట్‌ అనే బ్రాండ్‌ పేరుతో చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా రిటైల్‌ వినియోగదారులకు ఎఫ్‌వోఎ్‌సను విడుదల చేసింది. ఈ ఉత్పత్తి ఆరోగ్యంపై దృష్టి పెట్టే వినియోగదారుల్లో మంచి ఆదరణ పొందింది. ‘‘ఈ యూనిట్‌ భారత బయోటెక్నాలజీ ప్రయాణంలో ఒక చారిత్రక మైలురాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఎఫ్‌వోఎస్‌ ప్లాంట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయడం ద్వారా దేశీయ ఉత్పత్తిని బలోపేతం చేయడమే కాకుండా, భారతదేశాన్ని ప్రపంచ న్యూట్రాస్యూటికల్‌ రంగంలో ప్రముఖ స్థానంలో నిలుపుతుంది.’’ అని రివిలేషన్స్‌ బయోటెక్‌ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - Sep 02 , 2025 | 04:52 AM