Vallabhaneni Vamshi: అడ్డంగా బుక్కైన వంశీ.. ఇదిగో సాక్ష్యం..
ABN , First Publish Date - 2025-02-18T17:56:38+05:30 IST
వల్లభనేని వంశీ అడ్డంగా బుక్కయ్యారు. తనపై అక్రమ కేసులు పెట్టారంటూ బుకాయిస్తున్న వంశీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు టీడీపీ నేతలు. ఇదిగో సాక్ష్యం అంటూ సంచలన వీడియోను బయటపెట్టారు.
అమరావతి, ఫిబ్రవరి 18: వల్లభనేని వంశీ అడ్డంగా బుక్కయ్యారు. తనపై అక్రమ కేసులు పెట్టారంటూ బుకాయిస్తున్న వంశీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు టీడీపీ నేతలు. ఇదిగో సాక్ష్యం అంటూ సంచలన వీడియోను బయటపెట్టారు. అవును, సత్యవర్ధన్‌ను వంశీ కిడ్నాప్ చేసిన తాలూక వీడియోను టీడీపీ నేతలు విడుదల చేశారు. ఇప్పుడిది మరింత సంచలనంగా మారింది. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర.. సత్యవర్ధన్‌ను వంశీ కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకెళ్తున్న సీసీటీవీ ఫుటేజీని బయటపెట్టారు. ఈ వీడియోలో వంశీ తన అనుచరులతో వచ్చి సత్యవర్ధన్‌ను తీసుకెళ్తున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. కేసు నుంచి బయటపడేందుకు దుర్మార్గపు పనులు చేసి.. ఇప్పుడు తమకేమీ తెలియదన్నట్లు నటిస్తే చట్టం ఊరుకుంటుందా అని మంత్రి అన్నారు.
పులివెందుల ఫ్యాక్షనిజాన్ని రాష్ట్రమంతటా వ్యాప్తి చేయాలనుకుంటే ఊరుకునేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. వంశీతో పాటు అందరి చిట్టాలు బయటకు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రశాంతమైన కృష్ణా జిల్లాలో అల్లర్లకు ప్రయత్నిస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు మంత్రి. సత్యవర్ధన్‌ను ఎంత దుర్మార్గంగా కిడ్నాప్ చేశారో సీసీటీవీ ఫుటేజీని చూస్తే అర్థమవుతుందన్నారు. వంశీ, అతని అనుచరుల మధ్య లిఫ్ట్‌లో చేతులు కట్టుకుని, భయపడుతూ నిల్చున్న వీడియోను తాము బయటపెట్టామని మంత్రి రవీంద్ర చెప్పారు. గన్నవరం పార్టీ కార్యాలయం విధ్వంసం వీడియోపై జగన్ ఏం మాట్లాడుతారని మంత్రి ప్రశ్నించారు.
అసలేం జరిగిందంటే..
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బీఎన్‌ఎస్ సెక్షన్లు 140(1), 308, 351(3), రెడ్‌విత్ 3(5) కింద వంశీపై కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేశారంటూ వైసీపీ నేతలపై సత్యవర్ధన్ ఫిర్యాదు చేశాడు. అయితే, సత్యవర్ధన్‌ను వల్లభనేని వంశీ కిడ్నాప్ చేసి బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ క్రమంలోనే.. విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానానికి హాజరై తనకు ఈ కేసుతో సంబంధం లేదంటూ సత్యవర్థన్ అఫిడవిట్ సమర్పించాడు. కానీ, ఆ తర్వాత ధైర్యం తెచ్చుకున్న సత్యవర్ధన్.. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తనను బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న విజయవాడ పోలీసులు.. హైదరాబాద్‌లో ఉన్న వంశీని అరెస్ట్ చేశారు.