Srisailam: రావణ వాహనంపై ఆది దంపతులు
ABN , Publish Date - Feb 24 , 2025 | 06:04 AM
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఆదివారం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి రావణ వాహనంపై విహరించారు.

పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం
శ్రీశైలం, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఆదివారం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి రావణ వాహనంపై విహరించారు. స్వామి, అమ్మవార్లను రావణవాహనంపై ఆశీనులనుజేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం క్షేత్ర పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డితో కలిసి రాత్రి స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. వీరి వెంట కలెక్టర్ రాజకుమారి, శ్రీశైలం ఈవో శ్రీనివాసరావు ఉన్నారు. అలాగే విజయవాడ దుర్గామలేశ్వరస్వామి దేవస్థానం తరపున ఈవో, దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ శ్రీశైలంలో స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు.