Share News

Nara Lokesh : మామూలు కార్యకర్తనే!

ABN , Publish Date - Jan 28 , 2025 | 03:35 AM

సామాన్య కార్యకర్తగా ఉండడమే తనకిష్టమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి లోకేశ్‌ అన్నారు.

Nara Lokesh : మామూలు కార్యకర్తనే!

  • అలా ఉండడమే నాకిష్టం.. అలాగే చూడండి: లోకేశ్‌

  • ఒక వ్యక్తి ఒక పదవిలో 3 విడతలకు మించి ఉండకూడదనేది నా వ్యక్తిగత అభిప్రాయం

  • ఈదఫా ప్రధాన కార్యదర్శిగా ఉండకూడదనుకుంటున్నా

  • గ్రామ స్థాయి నుంచి పొలిట్‌బ్యూరో వరకు మార్పు రావాలి

  • రాజకీయ నేతలకు పాదయాత్ర ఎంబీఏ వంటిది

  • యువగళంలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తా.. వైసీపీని వీడినా అక్రమార్కులను వదలం

  • 7 నెలల్లో రూ.6.33 లక్షల కోట్ల పెట్టుబడులు.. 4.1 లక్షల ఉద్యోగాలు వస్తాయి

  • విశాఖ ఉక్కును ప్రైవేటుపరం కానివ్వం.. ఆ హామీకి కట్టుబడి ఉన్నాం: లోకేశ్‌

  1. ఒక వ్యక్తి 3సార్లకు మించి ఒక పదవిలో ఉండకూడదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను కూడా ఈసారి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండకూడదని భావిస్తున్నా. గామ స్థాయి నుంచి పొలిట్‌బ్యూరో వరకూ పార్టీలో మార్పు రావాలి. దీనిపై పెద్దలు తగిన నిర్ణయం తీసుకుంటారు.

  2. ఒక విద్యార్థికి ఎంబీఏ కోర్సు ఎటువంటిదో.. రాజకీయాల్లో ఉండే నాయకుడికి కూడా పాదయాత్ర ఎంబీఏ వంటిది. పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి మాట నిలబెట్టుకుంటా.

- మంత్రి లోకేశ్‌

విశాఖపట్నం, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్తగా ఉండడమే తనకిష్టమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి లోకేశ్‌ అన్నారు. పార్టీలో అందరూ తనను అలాగే చూడాలని కోరారు. ‘సాక్షి’ పత్రికపై దాఖలు చేసిన పరువునష్టం కేసులో సోమవారం ఉదయం ఇక్కడి కోర్టుకు హాజరైన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. పార్టీ అధినాయకుడు చంద్రబాబు ఏ బాధ్యతలు అప్పగించినా వాటిని నెరవేర్చుతానని, కష్టపడి పనిచేసి పార్టీని బలోపేతం చేస్తానన్నారు. పార్టీకి చెడ్డపేరు తీసుకురానని, ఏ బాధ్యత అప్పగించినా క్రమశిక్షణతో పూర్తిచేస్తానని చెప్పారు.


యువగళం పాదయాత్ర చేపట్టి సోమవారానికి రెండేళ్లు పూర్త్తయిందని, ఆ సమయంలో ప్రజలతో మమేకమైనప్పుడు అనేక సమస్యలు తెలుసుకునే అవకాశం వచ్చిందన్నారు. అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌లో ఎంబీఏ చేయడానికి వెళ్లినప్పుడు అక్కడ అధికారులు ఇచ్చే ప్రొఫార్మాలో ‘వై స్టాన్‌ఫోర్డ్‌ ఎంబీఏ’ అనే ప్రశ్నకు ‘ఏదో ఒక రోజు రాజకీయాల్లోకి వస్తాను.. అందుకే ఇక్కడ ఎంబీఏ చేస్తున్నానని జవాబురాశాను’ అని గుర్తుచేసుకున్నారు. తల్లి, చెల్లిపైనే జగన్మోహన్‌రెడ్డికి నమ్మకం లేదని, అటువంటప్పుడు పార్టీలో నాయకులపై ఎలా ఉంటుందని లోకేశ్‌ ప్రశ్నించారు. వైసీపీ నుంచి ఒక్కొక్కరూ రాజీనామా చేస్తున్నారని.. అయితే చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తులను వదిలిపెట్టబోమని స్పష్టంచేశారు. తుపాకీ పెట్టి కాకినాడ పోర్టును అడ్డగోలుగా లాక్కున్నారని, రూపాయి వస్తువును ఆరు పైసలకే విజయసాయిరెడ్డి కొట్టేశారని ఆరోపించారు. విశాఖలో భూకబ్జాలపై చర్యలు తీసుకుంటామని,ఎవరిపైనా కక్ష సాధింపు ఉండదన్నారు.

పరువునష్టం కేసు విచారణ వచ్చే నెల 28కి వాయిదా

తనపై తప్పుడు కథనం రాసిన ‘సాక్షి’పై లోకేశ్‌ గతంలో పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఆ కేసు నిమిత్తమే ఆయన సోమవారం 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో హాజరయ్యారు. ప్రతివాది తరఫు న్యాయవాది కోర్టుకు రాకపోవడంతో విచారణ ఫిబ్రవరి 28కి వాయిదా పడింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan: నువ్వు మరిన్ని రికార్డులు నెలకొల్పాలి.. దేవాన్ష్‌కు పవన్ అభినందనలు

Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 28 , 2025 | 03:36 AM