Share News

Sankranti 2025: సంక్రాంతి పండగ.. రైతులు ఏ విధంగా సెలబ్రేట్ చేస్తారంటే..

ABN , Publish Date - Jan 14 , 2025 | 05:21 AM

సంక్రాంతి పండగకు తెలుగువారి హృదయాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. సంక్రాంతి వచ్చిందంటే చాలు ఊరువాడ అంతా ఏకమవుతుంది.

Sankranti 2025: సంక్రాంతి పండగ.. రైతులు ఏ విధంగా సెలబ్రేట్ చేస్తారంటే..

అమరావతి: సంక్రాంతి పండగకు తెలుగువారి హృదయాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. సంక్రాంతి వచ్చిందంటే చాలు ఊరువాడ అంతా ఏకమవుతుంది. దేశ, విదేశాల్లో ఉన్నవారు సైతం స్వగ్రామాలకు బయలుదేరుతారు. సంవత్సరం మెుత్తం ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ఈ పండగ నాటికి కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్థులతో గడిపేందుకు సొంత ఊళ్లకు చేరుకుంటారు. పిండి వంటలు, కోడి పందేలు, ఎడ్ల పందేలు అంటూ సంబరాలు చేసుకుంటారు. మహిళలు రంగురంగుల రంగవల్లులతో ఆకట్టుకుంటారు. అయితే సంక్రాంతి అంటే ముందుకు గుర్చొచ్చేది రైతులు. ఆరుగాలం పండించిన పంట చేతికి రావడంతో వాళ్లు సంతోషంగా సంక్రాంతిని జరుపుకుంటారు.

మకర సంక్రాంతి రోజున భగీరథుడు తన తపస్సుతో గంగాదేవిని భువిపైకి తీసుకొచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. తన పూర్వీకులకు తర్పణం సమర్చేందుకు గంగమ్మను ఆయన భూమిపైకి తెచ్చినట్లు నమ్ముతారు. భగీరథుడు తపస్సు మెచ్చి గంగమ్మ మకర సంక్రాంతి రోజున పుడమిపైకి దిగినట్లు చెబుతుంటారు. అందుకే మకర సంక్రాంతి నిర్వహించుకుంటారని హిందూ విశ్వాసులు నమ్ముతారు. సూర్య భగవానుడు ప్రతినెలా ఒక్కో కార్తెలోకి ప్రవేశిస్తుంటాడు. ఈ నేపథ్యంలో ధనస్సు రాశి నుంచి ఆయన మకర రాశిలోకి సంచరించేటప్పుడు దిశను మార్చుకుని ఉత్తర దిక్కుగా సంచరిస్తాడు. అందుకే దీనిని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తారు.


సంక్రాంతి పండగ.. రైతులు ఏం చేస్తారంటే..

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ మెుదలైంది. ఈ పండగ అంటేనే భోగి మంటలు, రంగురంగుల ముగ్గులు, కోడి పందేలు, ఎడ్ల పందేలు, పిండి వంటలు గుర్తొస్తాయి. ఇక అన్నదాతలు ఆరుగాలం పండించిన పంటలు ఇంటికి రావడంతో సంబరాలు మెుదలవుతాయి. కష్టపడి పండించిన ధ్యానం ఇంటికి చేరడంతో రైతన్నలు ఆనందంతో సంక్రాంతిని ఘనంగా నిర్వహిస్తారు. భోగి రోజు ఉదయాన్నే లేచి నువ్వుల నూనెను శరీరానికి పట్టిస్తారు. మంచిగా మర్దనా చేసి అనంతరం తలంటు స్నానం చేస్తారు. ఆ తర్వాత పాత వస్తువులు, పిడకలతో ఉదయాన్నే భోగి మంటలు వేస్తారు. తమ జీవితాలు, ఇంట్లో జరిగిన చెడును ఆ మంటల్లో కాల్చివేస్తున్నట్లు భావిస్తారు. అలాగే ఆవు పిడకలు మంటల్లో వేసి కాల్చడం వల్ల హానికరమైన బ్యాక్టీరియా నశిస్తుందని నమ్ముతారు. ఇక భోగి రోజు కొత్తగా తెచ్చిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి నువ్వులతో పరమాన్నం చేసి కుటుంబసభ్యులతో కలిసి అన్నదాతలు ఆరగిస్తారు. వ్యవసాయ భూమిని సారవంతం చేసినందుకు కృతజ్ఞతగా వర్షాధిపతి ఇంద్రుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.

మకర సంక్రాంతి రోజు సూర్యభగవానుడిని, గంగానదిని అన్నదాతలు పూజిస్తారు. పంటలు పండేందుకు సూర్యుడు, నీరు ఎంతో ముఖ్యం. కాబట్టి వారికి ఆ రోజు పంటలు సమర్పించి పూజిస్తారు. పవిత్రమైన నదిలో స్నానం చేస్తారు. రైతులు తమకు చేతనైనంతా సహాయాన్ని ఇతరులకు చేస్తారు. తమ చేలలో పని చేసిన కూలీలకు సంక్రాంతి నాడు ధాన్యం దానం చేస్తారు. అలాగే పేదలు వంటి వారికి శక్తికి మించని దానధర్మాలు చేస్తారు. హరిదాసులు, గంగిరెద్దుల వారికి అండగా నిలుస్తారు. బసవన్నలకు సైతం తమకు తోచినంత సహాయం అందిస్తారు. మరోవైపు మహిళలు అందమైన ముగ్గులు వేసి అందులో గొబ్బెమ్మలు పెడతారు. అక్కడే పలు రకాల ధాన్యం గింజలు చల్లుతారు. తమతోపాటు పక్షులూ ఆ రోజు సంతోషంగా ఉండాలని వాటికి ఆహారంగా ముగ్గులో ధాన్యం చల్లుతారు. అలాగే అరిసెలు, గారెలు వంటి పిండి వంటలు చేసుకుని తింటారు.

Updated Date - Jan 14 , 2025 | 05:21 AM