Karthika Masotsavam: శ్రీశైలం కార్తీక మాసోత్సవాలు.. భక్తులకు కీలక సూచనలు
ABN , Publish Date - Oct 22 , 2025 | 09:54 AM
కార్తీకమాసం ప్రారంభంకావడంతో శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. నేటి (బుధవారం) నుంచి సాధారణ రోజులలో మూడు విడతలుగా శ్రీస్వామివారి స్పర్శ దర్శనాలకు భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు.
నంద్యాల, అక్టోబర్ 22: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో (Srisailam Temple) కార్తీక మాసోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి నవంబర్ 21 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. కార్తీకమాసం మొత్తం శ్రీస్వామివారి గర్భాలయ, సామూహిక అభిషేకాలు నిలుపుదల చేశారు ఆలయ అధికారులు. శని, ఆది, సోమ, ప్రభుత్వ సెలవులు, కార్తీక పౌర్ణమి రోజులలో స్పర్శ దర్శనాలను రద్దు చేశారు. కార్తీక మాసం ప్రారంభంకావడంతో శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. నేటి (బుధవారం) నుంచి సాధారణ రోజులలో మూడు విడతలుగా శ్రీస్వామివారి స్పర్శ దర్శనాలకు భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు.
కార్తీక మాసోత్సవాల సందర్భంగా ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నవంబర్ 14న శ్రీశైలంలో మొదటిసారిగా కోటి దీపోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 31న కృష్ణమ్మకు నదీహారతి, నవంబర్ 5న కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణం నిర్వహిస్తామన్నారు. కార్తీక దీపారాధనకు ఆలయ ఉత్తర మాడ వీధిలో గంగాధర మండపం వద్ద భక్తులకు ఏర్పాటు చేశామని ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు.
మరోవైపు కర్నూలు జిల్లాలోని శైవ క్షేత్రాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. శ్రీశైలం, మహానంది, యాగంటి, కాల్వబుగ్గ, ఓంకారం క్షేత్రాల్లో కార్తిక మాసోస్తవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆయా పుణ్యక్షేత్రాలకు భక్తుల రద్దీ కూడా పెరిగింది. శ్రీశైలం పాతాళ గంగలో భక్తులు పుణ్య స్నానాలు చేసి దీపాలు వెలిగిస్తున్నారు. మహానంది, యాగంటి, కాల్వబుగ్గలో పుష్కరిణిలలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి దీపారాధన చేస్తూ ఆ శివయ్యను స్మరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
బీ కేర్ ఫుల్.. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం
Read Latest AP News And Telugu News