Share News

AP Sugali Preeti Case: సుగాలి ప్రీతి కేసులో ప్రభుత్వం సంచలన నిర్ణయం..

ABN , Publish Date - Sep 02 , 2025 | 07:53 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలన సృష్టించిన సుగాలీ ప్రీతి కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

AP Sugali Preeti Case: సుగాలి ప్రీతి కేసులో ప్రభుత్వం సంచలన నిర్ణయం..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలన సృష్టించిన సుగాలి ప్రీతి కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుగాలి ప్రీతి కేసును సీబీఐకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీబీఐకు లేఖ రాయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కేసుపై దృష్టి పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ CID అధికారులతో మాట్లాడి కేసు దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతిపక్షంలో ఉండగా కూడా సుగాలి ప్రీతి కుటుంబాన్ని పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ కర్నూలు వెళ్ళిన సంగతి తెలిసిందే. పవన్ ఒత్తిడితో ఈ కేసుపై గత వైసీపీ ప్రభుత్వం ముందుకు కదిలింది. కానీ అప్పటికే సాక్ష్యాధారాలను లేకుండా చేశారని అధికారులు ఆరోపించారు. దీనితో కూటమి ప్రభుత్వం ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని నిర్ణయించింది. ఎల్లుండి జరిగే కేబినెట్ సమావేశంలో కూడా ఈ అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.


అయితే తాజాగా.. ఈ కేసుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించిన విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో తాను చేసిన పోరాటాన్ని.. సుగాలి ప్రీతి తల్లి మర్చిపోవడం బాధాకరమని అన్నారు. ఆపదలో ఉంటే.. చేయి అందించిన తననే ఇలా దూషించడం సరైందా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వాన్ని, సీఎంను ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేనప్పుడు .. సుగాలి ప్రీతి తల్లి పడే బాధను చూసి జనసేన పోరాడిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. పోరాటం కారణంగానే సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించారన్నారు. అలాగే జనసేన పార్టీ పోరాటంతోనే సుగాలి ప్రీతి కుటుంబానికి.. దిన్నెదేవరపాడులో 5 ఎకరాల పొలం, కర్నూలులో 5 సెంట్ల స్థలం.. సుగాలి ప్రీతి తండ్రికి ఉద్యోగం వచ్చిందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.


2017 సంవత్సరం ఆగస్టు 18న సుగాలి ప్రీతి మృతి చెందింది. కర్నూలులోని పాఠశాల వసతి గృహంలో సీలింగ్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ ప్రీతి మృతదేహం కనిపించింది. ప్రీతి మృతి కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే గత వైసీపీ హయాంలో ఈ కేసును సీబీఐకి అప్పగించినా దర్యాప్తు ముందుకు సాగలేదు. దీంతో ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తామన్న కూటమి నేతల హామీ మేరకు ప్రభుత్వం ప్రీతి కేసును మరోసారి సీబీఐకి అప్పగించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

చంద్రబాబు ది గ్రేట్.. సీబీఎన్‌ కు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న అభినందనలు

250 కోట్ల మంది అకౌంట్లు ప్రమాదంలో.. జీమెయిల్ యూజర్లకు గూగుల్ హెచ్చరిక..

Updated Date - Sep 02 , 2025 | 08:14 PM