V Kaveri Travels: కర్నూలులో దగ్ధమైన వి కావేరి ట్రావెల్స్ బస్ రిజిస్ట్రేషన్లో భారీ అక్రమాలు
ABN , Publish Date - Oct 26 , 2025 | 09:31 AM
కర్నూలులో దగ్ధమైన వి కావేరి ట్రావెల్స్ బస్సు రిజిస్ట్రేషన్లలో భారీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. సదరు బస్సుకు పలుసార్లు, పలురాష్ట్రాల్లో రెండు రకాలుగా రిజిస్ట్రేషన్లు చేయించినట్టు తెలుస్తోంది. తెలంగాణ, ఒడిశా, డామన్ అండ్ డయ్యులో..
కర్నూలు, అక్టోబర్ 26: కర్నూలులో దగ్ధమైన వి కావేరి ట్రావెల్స్ బస్సు రిజిస్ట్రేషన్లలో భారీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. సదరు బస్సుకు పలుసార్లు, పలురాష్ట్రాల్లో రెండు రకాలుగా అక్రమ మార్గంలో రిజిస్ట్రేషన్లు చేయించినట్టు తెలుస్తోంది. తెలంగాణ, ఒడిశా, డామన్ డయ్యులో వివిధ రకాలుగా రిజిస్ట్రేషన్లు చేయించినట్టు దర్యాప్తులో తేలుతోంది. ప్రమాదానికి గురైన బస్సును ఇప్పటికే పలుమార్లు సీట్ల బస్సు నుంచి స్లీపర్ బస్సుగా వి కావేరి ట్రావెల్స్ యాజమాన్యం మార్చినట్టు తెలుస్తోంది.
ఇక, ఆ వివరాల్లోకి వెళ్తే, అగ్ని ప్రమాదానికి గురైన వి కావేరి ట్రావెల్స్ బస్సు 2018 సంవత్సరంలో 53 సీట్ల అనుమతితో రిజిస్రేషన్ చేయించారు. తర్వాత 43 బెర్తులుగా మార్చి 2023 లో డామన్ డయ్యు లో రిజిస్ట్రేషన్ చేయించాలని ప్రయత్నించారు. అయితే, సదరు బస్సును సీట్ల బస్సుగానే డామన్ డయ్యు ఆర్టీఏ అధికారులు రిజిస్ట్రేషన్ చేశారు.
ఆ తరువాత ఈ ఏడాది(2025) ఏప్రిల్ లో ఒడిశాలో 43 బెర్తుల స్లీపర్ బస్సుగా రిజిస్ట్రేషన్ చేయించాలని ప్రయత్నించింది వి కావేరీ బస్ యాజమాన్యం. అయితే, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లో మాత్రం 43 సీట్ల బస్సుగానే నమోదు చేసిన అధికారులు, స్లీపర్ అనే చోట సున్నా గా నమోదు చేశారు.
ఇక, ఈ ఏడాది ఏప్రిల్ లో రెండేళ్ల కాలవ్యవధిలో ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఇస్తూ 43 సీట్ల బస్సుగా డామన్ అండ్ డయ్యు అధికారులు పేర్కొన్నారు. అయితే, దీనికి సంతృప్తి చెందని బస్సు యాజమాన్యం 29 రోజులు తరువాత ఒడిశాలో 43 స్లీపర్ బస్సుగా మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించింది. ఒడిశా ఆర్టీఏ రికార్డుల్లో ఈ బస్సు ప్రస్తుతం ఏసీ స్లీపర్ డీలక్స్ బస్సుగానే ఉందని ఆ రాష్ట్ర ఆర్టీఏ అధికారులు చెప్పారు. అయితే, ఈ రిజిస్ట్రేషన్ ఎవరు చేశారు.. దీని వెనుక ఎవరున్నారని ఏపీ రవాణా శాఖ అధికారులు ఆరాతీస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
పాక్ తీరుపై ఐక్యరాజ్య సమితి మౌనం.. మంత్రి జైశంకర్ విమర్శలు
పాక్‌కు భారత్ తరహాలో బుద్ధి చెప్పేందుకు సిద్ధమైన అఫ్ఘానిస్థాన్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి