Minister Gottipati Ravikumar: సమన్వయ లోపం వల్లే దుర్గ గుడిలో ఘటన: మంత్రి గొట్టిపాటి
ABN , Publish Date - Dec 30 , 2025 | 02:00 PM
దుర్గు గుడిలో కరెంట్ సరఫరా నిలిపివేత విషయంలో బాధ్యులపై చర్యలు తప్పవని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఈ అంశాన్ని కొందరు రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
అమరావతి, డిసెంబర్ 30: విజయవాడలోని దుర్గగుడిలో కరెంట్ సరఫరా అంశాన్ని కొందరు రాజకీయం చేయడం దురదృష్టకరమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మంగళవారం రాజధాని అమరావతిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ విలేకర్లతో మాట్లాడుతూ.. దుర్గ గుడిలో15 నిమిషాల పాటు కరెంట్ నిలిచిపోవడంపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించానని చెప్పారు. ఈ అంశం తన దృష్టికి వచ్చిన వెంటనే అధికారులతో మాట్లాడినట్లు వివరించారు. కరెంట్ నిలిచిపోవడంపై ఆ రోజే అధికారులను మందలించినట్లు పేర్కొన్నారు.
అధికారుల మధ్య సమన్వయం లోపం వల్లే దుర్గ గుడిలో కరెంట్ సరఫరా నిలిచి పోయిందన్నారు. దీనిపై వెంటనే నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించానని తెలిపారు. ఈ ఘటనలో తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని పేర్కొన్నారు. భక్తుల మనోభావాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పునరుద్ఘాటించారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
దుర్గు గుడి దేవస్థానం రూ. 3.08 కోట్ల విద్యుత్ బిల్లుల బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. బిల్లులు చెల్లించాలంటూ దేవస్థానం ఉన్నతాధికారుల దృష్టికి విద్యుత్ శాఖ సిబ్బంది తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 27వ తేదీ శనివారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ దేవాలయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ సమయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండడంతోపాటు అమ్మవారికి నైవైద్యం సమర్పించే సమయంలో విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. దీంతో భక్తులతోపాటు ఆలయం సిబ్బంది సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఆలయ ఉన్నతాధికారులు ఈ విషయాన్ని విద్యుత్, దేవాదాయ శాఖ మంత్రుల దృష్టికి తీసుకు వెళ్లారు. అనంతరం విద్యుత్ సరఫరాను పునరుద్దరించారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. మరోవైపు దుర్గ గుడిలో విద్యుత్ సరఫరా నిలిపివేయడంపై కొందరు రాజకీయం చేసేందుకు యత్నించారు. దాంతో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌పై విధంగా స్పందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దుర్గమ్మను దర్శించుకోవడం ఆనందంగా ఉంది: అనిల్ రావిపూడి
వైకుంఠ ఏకాదశి.. ఆ రోజు ఇలా చేస్తే..
For More AP News And Telugu News