Vijayawada Utsav: నగరానికి ఉప రాష్ట్రపతి.. ఉన్నతాధికారులతో ఎంపీ సమీక్ష
ABN , Publish Date - Sep 23 , 2025 | 10:34 AM
దసరా నవరాత్రుల వేళ.. విజయవాడ ఉత్సవ్ సోమవారం ప్రారంభమైంది. ఈ ఉత్సవ్‌కు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవ్‌కు రోజుకొకరు ముఖ్య అతిథిగా హజరుకానున్నారు.
విజయవాడ, సెప్టెంబర్ 23: దసరా నవరాత్రుల వేళ.. బెజవాడ వేదికగా ప్రారంభమైన విజయవాడ ఉత్సవ్‌కు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని స్థానిక ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు. భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్.. బుధవారం ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉప రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో మంగళవారం విజయవాడలో ఉన్నతాధికారులతో ఎంపీ కేశినేని చిన్ని సమీక్ష నిర్వహించారు. అనంతరం ఎంపీ కేశినేని చిన్ని విలేకర్లతో మాట్లాడుతూ.. ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సీపీ రాధాకృష్ణన్ విజయవాడలో పర్యటించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు సైతం అధిక సంఖ్యలో పాల్గొనున్నారని చెప్పారు. ఈ రోజు.. అంటే మంగళవారం ఈ ఉత్సవ్‌కు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హాజరు కానున్నారని పేర్కొన్నారు.
అయితే ఈ విజయవాడ ఉత్సవ్‌కు రోజుకొక ప్రముఖులు హాజరవుతారని వివరించారు. అందులో భాగంగా సెప్టెంబర్ 28వ తేదీన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆ మరునాడు అంటే సెప్టెంబర్ 29వ తేదీన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు హాజరువుతారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వైభవాన్ని తెలిపే విధంగా డ్రోన్ షో ఉంటుందని వివరించారు. కూటమి నేతలు అందరూ కలిసి ఈ ఉత్సవాలను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారని ఎంపీ కేశినేని చిన్ని స్పష్టం చేశారు.
దసరా వేళ.. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కొలువు తీరిన శ్రీదుర్గమ్మ వారి నవరాత్రులు సోమవారం ప్రారంభమైనాయి. ఈ నేపథ్యంలో బెజవాడ వేదికగా విజయవాడ ఉత్సవ్‌ను రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా ప్రారంభించింది. అందు కోసం రోజుకొక ప్రముఖులు ఈ ఉత్సవాలకు హాజరుకానున్నారు. ఆ క్రమంలో భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్.. బుధవారం ఈ ఉత్సవ్‌లో పాల్గొనున్నారు.
ఉప రాష్ట్రపతి పర్యటన సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో ఎంపీ కేశినేని చిన్ని సమీక్షించారు. ఈ సందర్బంగా ఉన్నతాధికారులకు ఆయన కీలక సూచనలు చేశారు. అలాగే ఈ విజయవాడ ఉత్సవ్‌ను దేశవ్యాప్తంగా చర్చించుకునే విధంగా ప్రభుత్వం భారీ ఎత్తున నిర్వహిస్తోంది. మరోవైపు.. ఈ ఉత్సవాలకు హాజరుకావాలంటూ భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ను ఇటీవల ఢిల్లీలో కలిసి ఎంపీ కేశినేని చిన్ని ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
వాకింగ్..? సైక్లింగ్..? ఈ రెండింటిలో ఏది మంచిది?
భోజనం చేసిన వెంటనే ఈ పనులు అసలు చేయకండి.. ఎందుకంటే..
For More AP News And Telugu News