Health Tips: భోజనం చేసిన వెంటనే ఈ పనులు అసలు చేయకండి.. ఎందుకంటే..
ABN , Publish Date - Sep 23 , 2025 | 10:11 AM
భోజనం చేయగానే.. ఒక పని అయిపోయిందంటూ చాలా మంది మంచం మీద నడుం వాల్చేస్తారు. మరి కొంత మంది కాఫీ, టీలు తాగేస్తారు. కానీ అలా చేయడం వల్ల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు.
మనం తీసుకునే ఆహారమే మన శరీరానికి శక్తిని అందిస్తుంది. అందుకే అందరూ... సాధ్యమైనంత వరకు పోషకాహారమే తీసుకుంటారు. అయితే తిన్న తర్వాత మనం ఏం చేస్తున్నామన్నది కూడా ముఖ్యమే. చాలా మంది.. భోజనం చేసిన వెంటనే కొన్ని పనులు చేస్తారు. అవి శరీరానికి హాని కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భోజనం చేసిన తర్వాత ఈ విధంగా మాత్రం అసలు చేయవద్దంటూ కొన్ని కీలక సూచనలు చేస్తున్నారు. అవి ఏమిటంటే..
తిన్న వెంటనే నీరు..
చాలా మందికి భోజనం చేసిన వెంటనే నీరు తాగే అలవాటు ఉంటుంది. ఇది కడుపులోని ఆమ్లాలు, జీర్ణ ఎంజైముల సమతుల్యతను దెబ్బ తీస్తుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తద్వారా ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీంతో గ్యాస్ట్రిక్ , అజీర్ణం, కడుపు ఉబ్బరంతోపాటు పలు సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ నేపథ్యంలో భోజనం చేసిన తర్వాత కనీసం 30 నిమిషాలు అనంతరం నీరు తాగడం మంచిదని చెబుతారు.
వెంటనే నిద్ర పోవడం..
చాలా మంది భోజనం చేసిన వెంటనే నిద్రపోతారు. కానీ ఇది జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది. కడుపులో ఆహారం సరిగ్గా ఆరగక పోవడంతో.. గుండెల్లో మంట, కడుపులో ఆమ్లం, జీర్ణ సమస్యలు వస్తాయి. దీంతో పాటు శరీరంలో కొవ్వు పేరుకు పోయే అవకాశాలు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో భోజనం చేసిన తర్వాత కొంతసేపు నడవడం మంచిది.
భోజనం అనంతరం..
భోజనం తర్వాత కొంత మంది సిగరెట్లు కాల్చే అలవాటు ఉంటుంది. కానీ ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. దీనిపై పరిశోధనలు సైతం జరిగాయి. భోజనం తర్వాత సిగరెట్లు తాగడం వల్ల శరీర అవయువాలకు 10 రెట్లు అధికంగా నష్టం జరుగుతుందంటున్నారు. ఇది ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్, జీర్ణ సమస్యల ప్రమాదాన్ని పెంచుతోందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిగరెట్లు తాగడం మానేయడం ఉత్తమం. మాన లేకుంటే.. భోజనం తర్వాత కొంత సమయం తీసుకోవాలని చెబుతున్నారు.
వెంటనే.. టీ, కాఫీ వద్దు..
భోజనం చేసిన వెంటన టీ లేదా కాఫీ తాగవద్దు. వీటిలో కెఫిన్ ఉంటుంది. ఇది శరీరంలోని ఐరన్, ఇతర పోషకాల శోషణను నిరోధిస్తుంది. ముఖ్యంగా మహిళల్లో రక్త హీనత సమస్యను పెంచుతుంది. ఒక వేళ.. భోజనం అనంతరం వీటిని తీసుకోవాలంటే.. కనీసం గంట తర్వాత తీసుకోవడం శ్రేయస్కరం.
తిన్న వెంటనే వ్యాయామం..
భోజనం చేసిన వెంటనే అధిక శారీరక శ్రమ చేయడం లేదా వ్యాయామం చేయడం వల్ల ఉదరంపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమయంలో.. కండరాల వైపు రక్త ప్రవాహం అధికమవుతుంది. కానీ జీర్ణవ్యవస్థకు అవసరమైన రక్తం అందదు. దీని వల్ల కడుపు నొప్పి, వాంతాలు, గ్యాస్, అజీర్ణం తదితర సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందువల్ల భోజనం చేసిన తర్వాత కనీసం 90 నిమిషాల నుంచి 2 గంటల తర్వాత వ్యాయామం చేయడం ఉత్తమం.
ఇక ఆరోగ్యకర జీవితానికి, మనం భోజనం చేసిన తర్వాత.. ఏం చేశామనేది కూడా అత్యంత ముఖ్యం. నీరు తాగడం, నిద్ర అలవాట్లు, సిగరెట్ కాల్చడం, కాఫీ, టీ వినియోగంతోపాటు వ్యాయామం.. ఇవన్నీ సరైన సమయంలో చేయాల్సి ఉంటుంది. అలా అయితేనే జీర్ణక్రియ సులభం అవుతుంది. అంతేకాదు.. దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది దోహదపడుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
వాకింగ్..? సైక్లింగ్..? ఈ రెండింటిలో ఏది మంచిది?
షాకింగ్ రిపోర్ట్.. పుట్టుకతోనే 41,000 మంది పిల్లలకు గుండె జబ్బులు
For More Health News And Telugu News