Tirumala Parakamani Case: పరకామణి కేసు.. హైకోర్టుకు సీఐడీ మరో నివేదిక
ABN , Publish Date - Dec 09 , 2025 | 02:55 PM
తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసు లోక్ అదాలత్ వద్ద రాజీ వ్యవహారంపై సీఐడీ అదనపు నివేదికను కోర్టుకు సమర్పించింది. అదనపు నివేదికను మరో రెండు సెట్లను సీల్డ్ కవర్లో రిజిస్ట్రార్ జ్యుడీషియల్‌కు సమర్పించాలని సీఐడీకి హైకోర్టు ఆదేశించింది.
అమరావతి, డిసెంబర్ 9: తిరుమల పరకామణి చోరీ కేసులో (Tirumala Parakamani Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి మరో నివేదికను హైకోర్టుకు సీఐడీ సమర్పించింది. తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసు లోక్ అదాలత్ వద్ద రాజీ వ్యవహారంపై సీఐడీ అదనపు నివేదికను వేసింది. అదనపు నివేదికను మరో రెండు సెట్లను సీల్డ్ కవర్లో రిజిస్ట్రార్ జ్యుడీషియల్‌కు సమర్పించాలని సీఐడీకి హైకోర్టు ఆదేశించింది. లోక్ అదాలత్ అవార్డ్ చట్టబద్ధతను తేల్చేందుకు విచారణ జరువుతున్న సీజే నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలన నిమిత్తం నివేదికలు వారి ముందు ఉంచాలని రిజిస్ట్రీకి న్యాయస్థానం స్పష్టీకరించింది. అదనపు నివేదికను పరిశీలించి తగిన ఉత్తర్వులు జారీ చేసేందుకు తదుపరి విచారణను రేపటి(బుధవారం)కి హైకోర్టు వాయిదా వేసింది.
కాగా.. అంతకు ముందే పరకామణి చోరీ కేసు రాజీ వ్యవహారం, రవికుమార్ ఆస్తులపై నివేదికలను సీఐడీ అధికారులు సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు అందజేసిన విషయం తెలిసిందే. సీఐడీ నివేదికను తమకు అందజేసేలా ఆదేశాలు ఇవ్వాలన్న రవికుమార్ తరఫు సీనియర్ న్యాయవాది అభ్యర్థనను కూడా న్యాయస్థానం తోసిపుచ్చింది. కాగా.. 2023 ఏప్రిల్ 29న పరకామణి విధుల్లో రవికుమార్ అమెరికన్ డాలర్లను అపహరిస్తూ దొరికిపోయాడు. అయితే తొలిసారి దొంగతనం చేశానంటూ రవికుమార్‌తో క్షమాపణ చెప్పించి ప్రభుత్వ లెక్కల ప్రకారం అప్పట్లో 14 కోట్ల 43 లక్షల విలువైన రవికుమార్ ఆస్తులను టీటీడీకి గిఫ్ట్ డీడ్‌గా ఇచ్చేలా చేశారు. 2023 జూన్ 19న ఆ మేరకు తీర్మానం చేయడం ఆ తర్వాత 3 నెలలకే కేసును రాజీ కుదర్చడం వెనుక ఉన్న మతలబుపై విచారణ జరిపిన సీఐడీ హైకోర్టుకు నివేదిక సమర్పించింది.
ఇవి కూడా చదవండి...
రోడ్డు ప్రమాదంలో తిరుచానూరు ఆలయ పోటు కార్మికులు మృతి
ప్రాజెక్ట్ వైజ్ ల్యాండ్ పూలింగే.. ఫేజ్ వైజ్ కాదు..
Read Latest AP News And Telugu News