Illegal Mining AP: ఆ దోపిడీని రికవరీ చేయాలన్న సోమిరెడ్డి... మంత్రి ఏం చెప్పారంటే
ABN , Publish Date - Sep 27 , 2025 | 01:46 PM
కేంద్రం ఎంటర్ అయ్యాక ఇల్లీగల్ మైనింగ్ ఆపారని సోమిరెడ్డి చెప్పుకొచ్చారు. అయితే వందల కోట్లు జరిగిన నాటి దోపిడీని రికవరీ చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వంపై ఉందన్నారు.
అమరావతి, సెప్టెంబర్ 27: శాసనసభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమ తవ్వకాలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (MLA Somireddy Chandramohan Reddy) సభలో ప్రశ్నించారు. గత అసెంబ్లీలో కూడా ఈ అంశంపై మాట్లాడానని.. దోపిడీ చేసిన వారిలో కొందరు అరెస్ట్ అయ్యారని తెలిపారు. తానే ఆధారాలను అందజేసినట్లు చెప్పారు. డిసెంబర్ 7, 2023లో హైకోర్టు నుంచి డైరెక్షన్ తెచ్చారని.. వారికి రెన్యూవల్ ప్రాసెస్ చేయండి, ఇల్లీగల్ మైనింగ్‌పై చర్య తీసుకోండి అని అన్నారని గుర్తుచేశారు. డిసెంబర్ 16న తాను నిరాహర దీక్షకు కూర్చోవడంతో 17న తనపై హిజ్రాలను పంపి దీక్షను భగ్నం చేశారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రధాని కార్యాలయానికి కూడా జీపీఎస్ లోకేషన్లు, ఎవిడెన్స్‌లు పంపించామని వెల్లడించారు.
డిసెంబర్ 21న ప్రధాని ఆఫీసుకు వెళితే జనవరి 1న క్లియర్‌గా ఏపీ సెక్రటేరియట్‌కు పంపారని.. కేంద్రం ఎంటర్ అయ్యాక ఇల్లీగల్ మైనింగ్ ఆపారని చెప్పుకొచ్చారు. అయితే వందల కోట్లు జరిగిన నాటి దోపిడీని రికవరీ చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వంపై ఉందన్నారు. అక్రమ మైనింగ్ చేసిన వారికి విక్రమ పురి యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ ఇచ్చారంటూ వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసులు కూడా 13 ఏళ్లు అయిపోయిందని.... ఈ కేసులో రికవరీ చేయాలని కోరారు. రుస్తుం మైన్స్ వారికి రెన్యూవల్ చేయాలని వారిని ఆదుకోవాలని.. ఎందుకంటే ఆయన ఈ విషయంలో బాధుతుడని ఎమ్మెల్యే సోమిరెడ్డి చెప్పుకొచ్చారు.
ఇనుమును దోచేశారు: కాల్వ శ్రీనివాసులు
మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. రాయదుర్గం నియోజకవర్గంలో ఓబులాపురం మైనింగ్ కంపెనీ పెద్ద ఎత్తున ఇనుప ఖనిజం నిల్వ చేసిందన్నారు. పెద్ద ఎత్తున వైసీపీకి చెందిన నాయకులు ఈ ఇనుప ఖనిజాన్ని తరలించారని వార్తలు వచ్చాయని అన్నారు. 2019-24 మధ్య లక్ష మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తరలించారని ఆరోపించారు. దాని విలువ రూ.30 కోట్లు ఉంటుందన్నారు. సీబీఐ సీజ్ చేసిన ఇనుమును దోచేశారని ఎమ్మెల్యే సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ మధ్య కాలంలో రెండు సార్లు సీబీఐ సీజ్ చేసిన యంత్రాలు ఎత్తుకెళ్లాలని చూశారన్నారు. అతను గతంలో ఓఎంసీకి వాహనాలు సరఫరా చేసిన వ్యక్తి అని ఈ ప్రభుత్వం కూడా నిర్ధారించిందని తెలిపారు. ఈ దోపిడీదారులను శిక్షించాలని కోరుతున్నామని.. తమ ప్రాంతంలో ఈ దొంగలను పట్టించి జైలులో పెడతామని చెప్పామని.. కాబట్టి ప్రభుత్వ ప్రతిష్టను కాపాడాలని మంత్రిని కోరుతున్నామన్నారు కాల్వ శ్రీనివాసులు.
ఇనుము మాయంపై విచారణ: మంత్రి కొల్లు రవీంద్ర
దీనిపై మంత్రి కొల్లు రవీంద్ర సమాధానమిస్తూ.. క్వార్ట్జ్‌ను కేంద్రం మేజర్ మినరల్ జాబితాలో చేర్చాక దాని అక్రమ తవ్వకం పెరిగిందని.. దీనికి సంబంధిచి విచారణ చేసి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ సహా పలువురిని అరెస్టు చేయడం కూడా జరిగిందని తెలిపారు. ఇంకా ఈ కేసులు ముగ్గురిని అరెస్టు చేయాల్సి ఉందని అన్నారు. వీరు సుమారు 250 కోట్ల రూపాయల మేర క్వార్జ్ తవ్వేశారని తేలిందన్నారు. ఈ విషయంపై వివరాలు తీసుకుని రికవరీ చేయడానికి కూడా అధికారులకు చట్టపరంగా ఆదేశాలు ఇస్తామని చెప్పారు. ఓబుళాపురం మైనింగ్ విషయంలో సీబీఐ సీజ్ చేసిన ఖనిజాన్ని మాయం చేసిన ఆరోపణలపైనా విచారణ చేయించి చర్యలకు ఆదేశాలు ఇస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
ఛైర్మన్‌ను ఎప్పుడూ గౌరవస్తాం.. మంత్రి పయ్యావుల క్లారిటీ
బీఎస్‌ఎన్‌ఎల్ 4జీకి చంద్రబాబు శ్రీకారం
Read Latest AP News And Telugu News