Share News

Kondapalli Srinivas: రాజోలుకు కామన్ ఫెసిలిటీ సెంటర్.. మంత్రి ప్రకటన

ABN , Publish Date - Sep 19 , 2025 | 04:48 PM

కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు రాజోలు నియోజకవర్గంలోని తూర్పు పాలెం, అమలాపురం నియోజకవర్గం మామిడికుదురు మండలం పెదపట్నం లంక ఉప్పలగుప్తంలో పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని మంత్రి కొండపల్లి వెల్లడించారు.

Kondapalli Srinivas: రాజోలుకు కామన్ ఫెసిలిటీ సెంటర్.. మంత్రి ప్రకటన
Minister Kondapalli Srinivas

అమరావతి, సెప్టెంబర్ 19: కొబ్బరి ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించేందుకు రూ.9.96 కోట్లతో రాజోలు నియోజకవర్గంలో కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Minister Kondapalli Srinivas) ప్రకటించారు. ఈరోజు (శుక్రవారం) శాసనసభలో జనసేన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. కొబ్బరి ద్వారా విలువ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు మూడు పారిశ్రామిక క్లస్టర్లను గుర్తించామని మంత్రి తెలిపారు. ఎంఎస్‌ఈ - సీడీపీ పథకం కింద రాజోలు నియోజకవర్గం పెదపట్నం లంకలో రూ. 9.96కోట్ల వ్యయంతో రెండు ఎకరాలలో కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు.


కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు రాజోలు నియోజకవర్గంలోని తూర్పుపాలెం, అమలాపురం నియోజకవర్గం మామిడికుదురు మండలం పెదపట్నం లంక ఉప్పలగుప్తంలో ఈ పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని వెల్లడించారు. రాజోలు నియోజకవర్గంలో కొబ్బరి సాగు విస్తీర్ణం 25 వేల ఎకరాలలో ఉందని, వార్షిక ఉత్పత్తి 30 నుంచి 40 కోట్ల కొబ్బరికాయలు ఉంటుందని అన్నారు. ప్రస్తుతం రైతులు కొబ్బరికాయల తొక్కలు తీసి, ఎండు కొబ్బరికాయలను తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల మార్కెట్లకు పంపుతున్నారని, అక్కడే ప్రాసెసింగ్ చేసి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేస్తున్నారని చెప్పారు. దీనికి కారణం డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సమగ్ర కొబ్బరి ప్రాసెసింగ్ పరిశ్రమలు లేకపోవడమేనని, దీనిపై అధ్యయనం చేసి జిల్లాస్థాయిలో చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.


జిల్లా యంత్రాంగం మూడు పారిశ్రామిక క్లస్టర్లు ప్రతిపాదించిందని వీటిలో సంపూర్ణంగా కొబ్బరి భాగాలను వినియోగిస్తూ విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయడానికి ప్రతిపాదించడం జరిగిందన్నారు మంత్రి. కొబ్బరి డొక్కు ద్వారా కాయిర్ ఉత్పత్తులు, కాయిర్ పిత్ బ్లాకులు, జియో టెక్స్టైల్స్, కాయిర్ హస్తకళలు, కోకో లాన్, సోడియం లిగనో సల్ఫోనేట్, కొబ్బరి టెంకెతో హస్తకళలు, బొగ్గు, యాక్టివేటెడ్ కార్సన్, కొబ్బరి నీరుతో ప్యాకేజ్ వాటర్, నాటా-డే-కోకో, కొబ్బరి నీటి పొడి, ఎండు కొబ్బరికాయతో వర్జిన్ ఆయిల్, లారిక్ యాసిడ్, ఎమ్.సి.టి. పొడి, చిప్స్, కొబ్బరి పాలు & పాల పొడి, డిసికేటెడ్ పొడి వంటి ఉత్పత్తుల తయారీకి ప్రతిపాదించామని చెప్పారు.


ప్రస్తుతం నియోజకవర్గంలో నాలుగు కొబ్బరి పీచు తయారీ యూనిట్లు, 18 కొబ్బరి చాప తయారీ యూనిట్లు, 30 తాళ్ల తయారీ యూనిట్లు, 120 కొబ్బరి తయారీ యూనిట్లు వంటి అనేక చిన్న, మధ్య తరహా కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఉన్నాయని అన్నారు. జిల్లాలో పెద్దఎత్తున ప్రాసెసింగ్ సౌకర్యాలు లేకపోవడం వల్ల కాయలను స్థానికంగా పీచు తీసి తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాలకు తదుపరి ప్రాసెసింగ్ కోసం పంపుతున్నారన్నారు. ప్రతిపాదిత ప్రాజెక్ట్ రెండు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని.. కొబ్బరి పొడి, నూనె, పాలు వంటి కొబ్బరి విలువ ఆధారిత ఉత్పత్తులను ఉత్పత్తి చేయడంతోపాటుగా నిల్వ సౌకర్యాలు, పరీక్షా కేంద్రంపై కావాల్సిన సౌకార్యాలపైనా దృష్టిసారిస్తామని మంత్రి తెలిపారు.


భూమి ఇచ్చేందుకు సిద్ధం: ఎమ్మెల్యే గోరంట్ల

మంత్రి ప్రసంగంపై జోక్యం చేసుకున్న రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి... కడియం మండలంలో కొబ్బరి పరిశ్రమ ఏర్పాటుకు, కొబ్బరి పరిశోధనా కేంద్రానికి 10 ఎకరాల భూమి ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామని చెప్పారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే తెలుపగా ఈ విషయాన్ని కచ్చితంగా పరిశీలించి, అధికారులతో చర్చించి ముందుకు వెళ్తామని మంత్రి అన్నారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాద్ చేసిన సూచనపై పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమిని గుర్తించి నివేదిక ఇవ్వాలని కలెక్టరును కోరతామని మంత్రి తెలిపారు. తద్వారా ఈ పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేసి కొబ్బరి ద్వారా విలువ ఆధారిత ఉత్తత్తుల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమనం చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శాసనసభలో హమీ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి..

ఓబుళాపురం మైనింగ్‌పై సుప్రీం కీలక ఆదేశాలు

గత పాలనలో నిర్లక్ష్యమే.. ప్రాజెక్టులు ధ్వంసం: మంత్రి నిమ్మల

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 19 , 2025 | 05:42 PM