Share News

Pawan: ప్రసూతి సమయంలో వైద్య సేవలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

ABN , Publish Date - Oct 22 , 2025 | 07:53 PM

ప్రసూతి సమయంలో వైద్య సేవల విషయంలో ఏ దశలోనూ నిర్లక్ష్యంగా ఉండకూడదని, అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గర్భిణులకు వైద్యం నుంచి ప్రసవం వరకూ, అనంతర వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సక్రమంగా అందాలని చెప్పారు.

Pawan: ప్రసూతి సమయంలో వైద్య సేవలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
Pawan Kalyan on Maternal Deaths

విజయవాడ, అక్టోబర్ 22: ఆధునిక వైద్య విధానాలు అందుబాటులో ఉన్న తరుణంలో ప్రసూతి సమయంలో అందించే సేవలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి ఎప్పటికప్పుడు ఇందుకు సంబంధించిన సేవలపై అనుభవజ్ఞులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఈరోజు (బుధవారం) మధ్యాహ్నం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుంచి కాకినాడ జిల్లా కలెక్టర్, పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పడా) ప్రాజెక్ట్ డైరెక్టర్ తో పవన్ కల్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటీవల పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలుకి చెందిన దొండపాటి శ్రీదుర్గ.. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో బిడ్డను ప్రసవించిన అనంతరం అపస్మారక స్థితికి చేరుకోవడం, కాకినాడ ఆసుపత్రికి తరలించగా మృతిచెందారు. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.


ప్రసూతి సమయంలో వైద్య సేవల విషయంలో ఏ దశలోనూ నిర్లక్ష్యంగా ఉండకూడదని, అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గర్భిణులకు వైద్యం నుంచి ప్రసవం వరకూ, అనంతర వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సక్రమంగా అందాలని చెప్పారు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలి విధి నిర్వహణ తీరు, ఇతర సిబ్బంది వ్యవహారంపై విచారణ చేయాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. పిఠాపురం ఆసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని, నియోజకవర్గంలో వైద్యం అందించే విధానం అందరికీ ఒక మోడల్ గా నిలవాలని.. ఆ దిశగా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.

కాకినాడ జిల్లాలో మెటర్నల్ డెత్ ఆడిట్ నిర్వహణ గురించి కూడా ఈ సందర్భంగా పవన్ ఆరా తీశారు. ప్రసూతి మరణాలు సీరియస్ గా తీసుకోవలసిన అంశమనీ, ఇలాంటి మరణాలు సంభవించినప్పుడు తక్షణమే నిపుణులైన వైద్యుల బృందంతో సమగ్రంగా విచారణ చేసి కారణాలను నమోదు చేయాలని పేర్కొన్నారు. శ్రీదుర్గ ప్రసూతి మరణంపై, పుట్టిన బిడ్డ ఆరోగ్య స్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.


జిల్లాలోని కొన్ని ఆసుపత్రులపై వైద్యులు, ఇతర సిబ్బంది తమ విశ్వాసాల ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయన్న విషయాన్ని ప్రస్తావించిన పవన్ కల్యాణ్.. ప్రభుత్వ ఆసుపత్రులను వ్యక్తిగత విశ్వాసాల ప్రచారానికి వేదికలుగా చేయకూడదన్నారు. పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలుకి చెందిన శ్రీదుర్గ మరణంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. ఈ కాన్ఫరెన్స్ లో శాసనమండలి విప్ పిడుగు హరిప్రసాద్, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ, కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, పడా ప్రాజెక్ట్ డైరెక్టర్ చైత్ర పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి..

అయ్యప్ప సేవలో ద్రౌపది ముర్ము.. శబరిమలను దర్శించుకున్న తొలి రాష్ట్రపతి

వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. ప్రధాని మోదీ గురించి ట్రంప్ ఏమన్నారంటే..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 22 , 2025 | 08:39 PM