Share News

AP Budget 2025: ఏపీ బడ్జెట్.. మంత్రి పయ్యావుల ప్రత్యేక పూజలు

ABN , Publish Date - Feb 28 , 2025 | 09:39 AM

AP Budget 2025: ఏపీ రాష్ట్ర బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ ఈరోజు (శుక్రవారం) అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రతులకు మంత్రి ప్రత్యేక పూజలు చేశారు.

AP Budget 2025: ఏపీ బడ్జెట్.. మంత్రి పయ్యావుల ప్రత్యేక పూజలు
AP Assembly budget Session

అమరావతి, ఫిబ్రవరి 28: 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavual Keshav) ఈరోజు ఉదయం 10 గంటలకు ఏపీ అసెంబ్లీలో (AP Assembly) ప్రవేశపెట్టనున్నారు. అందులో భాగంగా ముందుగా విజయవాడలో ఇంటి వద్ద అధికారులతో కలిసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు మంత్రి. ఈ కార్యక్రమంలో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఐఏఎస్,ఆర్థిక శాఖ కార్యదర్శి (బడ్జెట్) రోనాల్డ్ రోస్, ఐఏఎస్, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జే. నివాస్, ఐఏఎస్, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి గౌతమ్, ఆర్థిక శాఖ ఉప కార్యదర్శి నూరుల్, ఐఏఎస్‌లు హాజరయ్యారు.


ఆపై బడ్జెట్ ప్రతులతో అమరావతిలోని వెంకటాయపాలెం వద్ద టీటీడీ ఆలయానికి వెళ్లి వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. 2025-26 బడ్జెట్ ప్రతులను శ్రీవారి పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు. ఆర్థిక ఇబ్బంది లేకుండా రాష్ట్రాన్ని , ప్రజలను కాపాడాలని ఈ సందర్భంగా స్వామివారిని మంత్రి వేడుకున్నారు. పూజల అనంతరం బడ్జెట్ ప్రతులతో మంత్రి పయ్యావుల అసెంబ్లీకి బయలుదేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు బడ్జెట్ ప్రతులను మంత్రి అందజేయనున్నారు. మరికాసేపట్లో ఏపీ అసెంబ్లీలో కేబినెట్ సమావేశంకానుంది. బడ్జెట్‌కు ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. మొత్తం రూ.3.24 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

ap-budget-2025.jpg

Gold Rates Today: పసిడి కొనేందుకు తగిన సమయం.. స్వల్పంగా తగ్గిన ధరలు


కూటమి వచ్చాక 12 నెలలకు తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండగా.. మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అనంతరం అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు. అలాగే మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి పొంగూరు నారాయణ ప్రవేశపెడతారు. ఈ సారి బడ్జెట్ పుస్తకాలకు గుడ్ బై.. అంతా ట్యాబ్లలోనే సభ్యులకు బడ్జెట్ కాపీలను పొందుపర్చారు.


గత ఏడాది 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను నవంబరులో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రూ.2.94 లక్షల కోట్లు. అటు అభివృద్ధి, ఇటు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్లో కేటాయింపులు చేశారు. ముఖ్యంగా... తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు నిధులు కేటాయింపులు జరిగాయి. ‘‘సూపర్ సిక్స్’’లో ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలతో పాటు సంక్షేమానికి భారీగా కేటాయింపులు జరిగాయి. కేంద్ర సహకారంతో వీటిని అమలు చేసేలా పద్దులు రూపకల్పన చేశారు. వచ్చే ఏడాది జూన్ 12వ తేదీ నాటికి 5 లక్షల ఇళ్లను పేదలకు కట్టించి ఇవ్వాలన్న లక్ష్యం బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. అమరావతి, పోలవరంతో పాటు... వెలిగొండ, వంశధార, హంద్రీనీవా ప్రాజెక్టులకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చారు.


వాస్తవిక అంచనాలతో బడ్జెట్...

ఈసారి వాస్తవిక అంచనాలతో బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన కేటాయింపులు, పన్నుల్లో వాటాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాస్తవిక అంచనాలతో రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించినట్లు సమాచారం. ఈ ఏడాది పూర్తిస్థాయి ఈ-బడ్జెట్‌కు రూపకల్పన జరిగింది. ప్రతి ఏటా రాత్రి ప్రింట్ చేసి తెల్లవారే సరికి అసెంబ్లీకి బడ్జెట్ కాపీలు వచ్చేవి. అయితే ఇక ఈ సంప్రదాయానికి గుడ్ బై చెబుతూ.. సభ్యులందరికీ ‘‘ట్యాబ్‌‌‌’’లోనే బడ్జెట్‌ను లోడ్ చేసి ఇచ్చే ఏర్పాటు చేశారు. ఐదేళ్ల ఆర్థిక విధ్వంసాన్ని సరి చేసేలా బడ్జెట్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఉదయం 10 గంటలకు మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల బడ్జెట్‌ను సభ ముందించునున్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ఈ ఏడాది వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.50 వేల కోట్ల దాకా ఖర్చు చేసే అవకాశం ఉంది. అన్నదాత-సుఖీభవ, పంటల బీమా, వడ్డీ లేని, పావలా -వడ్డీ రుణాలు, వ్యవసాయ యాంత్రీకరణ, సూక్ష్మసేద్యం, ప్రకృతి వ్యవసాయం, ఆయిల్పామ్, రాయితీ విత్తనాలు, ఎన్టీఆర్ జలసిరి, వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు భృతి, వ్యవసాయ సాంకేతిక పథకాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి...

Remand: పోసాని కృష్ణ మురళీకి రిమాండ్..

MLC Election: పోటెత్తిన టీచర్లు

Read Latest AP news And Telugu News

Updated Date - Feb 28 , 2025 | 09:45 AM