MLC Election: పోటెత్తిన టీచర్లు
ABN , Publish Date - Feb 28 , 2025 | 03:11 AM
జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతోపాటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఓటేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు.

ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో 92.4% ఓటింగ్
కృష్ణా-గుంటూరు, ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో 69.57%, 69.50% పోలింగ్
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో గురువారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కృష్ణా-గుంటూరు, ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతోపాటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఓటేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. రాత్రి కడపటి వార్తలు అందే సమయానికి కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 69.57 శాతం, ఉభయగోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 69.50 శాతం, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 92.4 శాతం పోలింగ్ నమోదైనట్లు ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు వెల్లడించారు. తుది వివరాలు వస్తే పోలింగ్ శాతం ఒకింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. సీఎం చంద్రబాబు, లోకేశ్, ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు, ఆయా నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో పోలింగ్ మొదటి నుంచీ రికార్డు స్థాయిలోనే జరిగింది. రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో మధ్యాహ్నం వరకూ పోలింగ్ మందకొడిగా సాగినా... తరువాత పుంజుకుంది.
స్వల్ప ఘటనలు... బాపట్ల మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో టీడీపీ, పీడీఎఫ్ శ్రేణులు ఘర్షణకు దిగాయి. పోలింగ్ సమయం ముగిశాక ఏజెంట్లు లోనికి వెళ్లడంపై ఇరువర్గాలు వాదులాటకు దిగాయి. ఇదే సమయంలో టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు, పీడీఎఫ్ మద్దతు దారుడిపై దాడికి దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో ఇరువర్గాలు శాంతించాయి. ఏ కొండూరులోని ఎంపీపీ స్కూల్ పోలింగ్ కేంద్రం దగ్గర ఉపాధ్యాయులు, టీడీపీ నాయకుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. పోలీసులు సమూహాన్ని చెల్లాచెదురు చేశారు. ఇబ్రహీంపట్నంలో పాటిబండ్ల జ్ఞాన దీప్తి అనే మహిళ తన ఓటును మరొకరు వేశారంటూ ఫిర్యాదు చేశారు. టెండర్ ఓటు అడిగారు. ఎన్నికల అధికారి టెండర్ ఓటుకు అనుమతించారు.
ఓటర్లకు డబ్బులు పంపిణీ...కలకలం రేపిన వీడియో
పోలింగ్ కేంద్రానికి సమీపంలో ఎమ్మెల్సీ ఓటర్లకు డబ్బులు పంచుతున్న వీడియో బయటకు రావడంతో కలకలం చెలరేగింది. కాకినాడ జిల్లా పిఠాపురంలోని ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడకు సమీపంలోని మునిసిపల్ కల్యాణ మండపం సమీపంలో టీడీపీ నేత ఒకరు ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి తరఫున ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్లకు డబ్బులు పంచారన్న ఆరోపణలు వచ్చాయి. ప్రయాణం ఖర్చుల పేరుతో డబ్బులు పంచుతున్న వీడియోలను పీడీఎఫ్ అభ్యర్థి మద్దతుదారులు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అధికారులకూ ఫిర్యాదు చేశారు. తహశీల్దారు గోపాలకృష్ణ, పిఠాపురం సీఐ శ్రీనివాస్ ఘటనా స్థలానికి వెళ్లగా... అక్కడ ఎవరూ లేకపోవడంతో వెనుతిరిగారు. టీడీపీ నేతలు ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.
ప్రజాస్వామ్యంలో ఓటే కీలకం: సీఎం
తాడేపల్లి, తెనాలి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత కీలకమని, అర్హులందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలోని మండల పరిషత్ పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నిక ఓటు హక్కును తనయుడు లోకేశ్‌తో కలిసి చంద్రబాబు వినియోగించుకున్నారు. తొలుత ఉండవల్లి నివాసం నుంచి కాన్వాయ్‌లో వచ్చిన ఆయన నిబంధనల ప్రకారం 200 మీటర్ల దూరంలో కారు దిగి మంత్రి లోకేశ్‌తో కలిసి నడుచుకుంటూ పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. రోడ్డు వెంట ఉన్న ఇళ్లలోని వారిని ఆప్యాయంగా పలకరించుకుంటూ అడిగిన వారితో ఫొటోలు దిగుతూ ఓటు వేసి వచ్చారు. అనంతరం చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు తమ అభిప్రాయాలను తెలపడానికి, ప్రజాస్వామ్యాన్ని చైతన్య పరచడానికి ఓటు ద్వారా అవకాశం కలుగుతుందన్నారు. అభివృద్ధి, సంక్షేమం, దేశ ప్రతిష్ఠకు ఓటు బలంగా పని చేస్తుందని చంద్రబాబు అన్నారు.
తెనాలిలో ఓటేసిన పెమ్మసాని
కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానానికి జరిగిన పోలింగ్ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు జిల్లా తెనాలిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులంతా బిజీ షెడ్యూల్‌లో ఉన్నా, ఓటు ప్రాధాన్యం, అభివృద్ధికి బాటలు వేయాలనే ఆలోచనతోనే ఓటు వేసేందుకు వచ్చానని చంద్రశేఖర్ పేర్కొన్నారు. రానున్న ఆరేళ్లలో ఈ ప్రాంత అభివృద్ధికి ఊతమిస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ప్రత్యర్థులు ఎవరైనా పట్టభద్రుల ఓటు ప్రగతికే: ఆలపాటి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యర్థులెవరనేది ఓటర్లు పట్టించుకోలేదని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రగతికే ఓటేశారని టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. 68 శాతం ఓటింగ్ జరగడంపై హర్షం వెలిబుచ్చారు. చంద్రబాబుది ప్రజాపాలన కాబట్టే పట్టభద్రులు తమకు గెలుపునందించబోతున్నారన్నారు. ఎన్నికల్లో సహకరించిన కూటమి నేతలకు ధన్యవాదాలు తెలిపారు.