Minister Narayana Alerts: అలర్ట్‌గా ఉండండి.. ప్రజలు ఇబ్బంది పడొద్దు: మంత్రి నారాయణ
ABN , Publish Date - Oct 23 , 2025 | 01:26 PM
ఇంజనీరింగ్ , పారిశుద్ధ్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దన్నారు మంత్రి నారాయణ. తాగు నీరు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అమరావతి, అక్టోబర్ 23: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మున్సిపల్ కమిషనర్లను మంత్రి నారాయణ (Minister Narayana) అప్రమత్తం చేశారు. గురువారం నాడు మున్సిపల్ కమిషనర్లు, ఉన్నతాధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలని ఆదేశించారు. ఇంజనీరింగ్ , పారిశుద్ధ్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దన్నారు. తాగు నీరు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అన్ని మున్సిపాలిటీల్లో 24 గంటలు పనిచేసేలా కాల్ సెంటర్ అందుబాటులో ఉండాలని తెలిపారు. ప్రైవేట్ మినరల్ వాటర్ ప్లాంట్‌లను కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని ఆదేశించారు. అలాగే పోలీసు, వైద్యారోగ్య శాఖ సిబ్బందితో సమన్వయం చేసుకుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్లకు మంత్రి నారాయణ సూచనలు చేశారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్ పాల్గొన్నారు.
కాగా.. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలహీనపడింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ అంతర్గత కర్ణాటక ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది రాబోయే 24 గంటల్లో దక్షిణ అంతర్గత కర్ణాటక దిశగా కదులుతూ మరింత బలహీనపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు పడనున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు పడనుండగా.. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నాయ్నారు. తీరం వెంబడి 30-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. శిథిలావస్థలో ఉన్న నిర్మాణాల్లో ఉండరాదని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ హెచ్చరికలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి..
అబుదాబీలో వరుస భేటీలు.. పెట్టుబడులపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్
దుబాయ్‌లో ఉన్నా... భారీ వర్షాలపై సీఎం అలర్ట్
Read Latest AP News And Telugu News