Kollu Ravindra On Jagan: తొమ్మిది రోజుల తర్వాత పరామర్శలా... జగన్‌పై కొల్లు రవీంద్ర సీరియస్
ABN , Publish Date - Nov 05 , 2025 | 02:17 PM
జగన్ మాట్లాడిన మాటల్లో ఒక్క నిజం కూడా లేదని... కేవలం ప్రభుత్వం మీద బురదజల్లేందుకే జగన్ ప్రయత్నించారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. జగన్ దిగిన పొలాల్లో ఎక్కడా కూడా వర్షపు నీరు నిలిచిలేదని అన్నారు.
కృష్ణా జిల్లా, నవంబర్ 5: మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) కృష్ణా జిల్లా పర్యటన అట్టర్ ఫ్లాప్ అయిందని మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పర్యటనలో ఎక్కడా కూడా రైతులు కనిపించలేదన్నారు. తాను పర్యటిస్తున్న ప్రాంతాల్లో రైతులు లేక పక్క గ్రామాల నుంచి రైతులను తెప్పించుకుని జగన్ పబ్లిసిటీ స్టంట్లు చేశారని విమర్శించారు. పొలం గట్ల మీద నడిచి ఫోటోలకు స్టిల్స్ ఇచ్చారని కామెంట్స్ చేశారు. తుఫాను తీరం దాటిన తొమ్మిది రోజుల తర్వాత పరామర్శ పేరుతో జగన్ రాజకీయ డ్రామా సృష్టించారని వ్యాఖ్యలు చేశారు. జగన్ పర్యటన ఆద్యంతం పచ్చి అబద్ధాలతో సాగిందని ఆరోపించారు.
జగన్ మాట్లాడిన మాటల్లో ఒక్క నిజం కూడా లేదని... కేవలం ప్రభుత్వం మీద బురదజల్లేందుకే జగన్ ప్రయత్నించారని మండిపడ్డారు. జగన్ దిగిన పొలాల్లో ఎక్కడా కూడా వర్షపు నీరు నిలిచిలేదని అన్నారు. పంట కాలువలను బాగు చేయడం వల్లే పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీరు ఎప్పటికప్పుడు కాలువల గుండా వెళ్లిపోయిందన్నారు. ఫలితంగా రైతులు చాలా వరకు నష్టపోకుండా చూడగలిగామని తెలిపారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో కాలువల్లో మట్టి కూడా తీయలేదని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్‌లపై విమర్శలు చేసే అర్హత జగన్‌కు లేదన్నారు. తల్లిని చెల్లిని పట్టించుకోని వ్యక్తి జగన్.. చంద్రబాబుపై విమర్శలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు.
ఆర్‌టీజీఎస్ నుంచి తుఫాను సహాయ చర్యలపై చంద్రబాబు, లోకేష్ నిరంతరం ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారని తెలిపారు. తుఫాను తీరం దాటిన మరుసటి రోజే ఏరియల్ సర్వే ద్వారా పంట నష్టాన్ని సీఎం చంద్రబాబు చూశారన్నారు. ఆ మరుసటి రోజే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షేత్ర పర్యటన చేసి పంట నష్టం అంచనాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1.82 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనాలు తయారు చేశామన్నారు. పంట నష్టం నమోదుపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని మంత్రి చెప్పారు.
ప్రాణ నష్టం లేకుండా ప్రభుత్వ యంత్రాంగం విశేషంగా కృషి చేసిందని అన్నారు. తుఫాను సమయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యతాహితంగా పని చేశారని అభినందించారు. పని చేసే అధికారులను అవమానపర్చే విధంగా జగన్ మాట్లాడిన తీరు గర్హనీయమని మండిపడ్డారు. ఐదేళ్లలో వైసీపీ చేసిన ధర స్థిరీకరణ ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో క్రాప్ హాలిడే ప్రకటించిన రోజులను జగన్ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ధాన్యం కొనుగోలు డబ్బులు.. 24 గంటల్లోనే
నేలపై కూర్చుని విద్యార్థులతో ముచ్చటించిన రామ్మోహన్ నాయుడు
Read Latest AP News And Telugu News