Nadendla Manohar Paddy Procurement: ధాన్యం కొనుగోలు డబ్బులు.. 24 గంటల్లోనే
ABN , Publish Date - Nov 05 , 2025 | 12:53 PM
ఈసారి ఖరీఫ్ మాసానికి 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనేందుకు సిద్ధం అయ్యామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అంటే రూ.12,200 కోట్లు విలువైన ధాన్యం కొనుగోలుకు సిద్ధం అయినట్లు చెప్పారు.
అమరావతి, నవంబర్ 5: కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమైన సంస్కరణ చేశామని.. రాష్ట్ర పౌరసరఫరాల శాఖలో రైతులను ఆదుకోవాలని నిర్ణయించామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) వెల్లడించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అనేక సందర్భాల్లో ఏ విధంగా దళారులను ప్రోత్సహించినా పరిస్థితులను మార్చేందుకు కృషి చేశామన్నారు. రైతులతో మాట్లాడి ఈ పరిస్థితుల్లో మార్పులు తెచ్చేందుకు ప్రయత్నించామని చెప్పారు. తేమ శాతంలో పారదర్శకత లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడేవారన్నారు.
ఈసారి ఖరీఫ్ మాసానికి 51 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం కొనేందుకు సిద్ధం అయ్యామని తెలిపారు. అంటే రూ.12,200 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలుకు సిద్ధం అయినట్లు చెప్పారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను.. 6 కోట్ల గోతాలను కూడా సిద్ధం చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వం కొన్ని సందర్భాలలో 6 నెలలు నుంచి 9 నెలల వరకు బకాయిలు ఇవ్వలేదని గుర్తుచేశారు. దాదాపు రూ.1670 కోట్ల బకాయిలు గత ప్రభుత్వం వదిలి వెళ్ళిందని విమర్శించారు. దాదాపు 87 శాతం ధాన్యం కొనుగోలు డబ్బులు 48 గంటల్లో ఇచ్చామని తెలిపారు. ఈ సారి 24 గంటల్లోనే పేమెంట్ చేసేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఉదయం, 12 గంటలకు, 2 గంటలకు, 4 గంటలకు, 7 గంటలకు ధాన్యం అమ్మినా రోజు వారికి పేమెంట్ చేస్తున్నామని.. అంటే కేవలం 2 గంటల్లోనే డబ్బు చెల్లిస్తామన్నారు. సెలవు రోజుల్లో మాత్రం తదుపరి రోజు చెల్లిస్తామని మంత్రి చెప్పారు. మాయిశ్చర్ రీడింగ్ విషయంలో బ్లూ టూత్ ద్వారా లెక్కించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వాట్సప్ ద్వారా ధాన్యం కొనుగోలుకు అవకాశం ఇస్తున్నామని... ఈ సీజన్‌లో రైతులు ఇప్పటికే ఈ సౌలభ్యాన్ని వాడుతున్నారని మంత్రి తెలిపారు.
నవంబర్‌లో 11 లక్షలు, డిసెంబర్‌లో 25 లక్షలు, జనవరిలో 8 లక్షలు, ఫిబ్రవరిలో 3 లక్షలు, మార్చిలో మరో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు సిద్ధం అవుతున్నట్లు వెల్లడించారు. జనవరి నుంచి జిల్లా హెడ్ క్వార్టర్‌లలో గోధుమ కేజీ 18 రూపాయలకు అందించాలని చూస్తున్నట్లు తెలిపారు. దీపం 2 పథకం విషయంలో నవంబర్ 30 వరకు 3వ విడత కొనసాగుతుందని స్పష్టం చేశారు. మొంథా తుఫాను బాధితులకు పౌరసరఫరాల శాఖ నిత్యావసరాలు అందించిందన్నారు. ఇప్పటికే స్మార్ట్ కార్డ్‌లు 92 శాతం పంపిణీ పూర్తి అయిందని అన్నారు. నెలాఖరున మిగిలిన కార్డులు వెనక్కి తీసుకుని... మనమిత్ర యాప్ ద్వారా కోరిన వారికి పరిశీలించి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కౌలు రైతులకు 50 వేలు టారపాలిన్‌లు ఉచితంగా అందిస్తామని మంత్రి అన్నారు.
చాలా జిల్లాల్లో ఈ క్రాప్ పూర్తి అయిందని.. అసలు గతంలో వారు ఎంతమంది దగ్గర నుంచి కొనుగోలు చేశారో ఆ పార్టీ నేత చెప్పాలని డిమాండ్ చేశారు. 39 లక్షల 51 వేల ఎకరాలు ధాన్యం కొనుగోలు ఈ క్రాప్ కింద నమోదు అయినట్లు తెలిపారు. 85 లక్షల మెట్రిక్ టన్నులు క్రాప్ వస్తుందని భావిస్తున్నామన్నారు. పంట నష్టం నమోదు చేసి అందించినప్పుడు ధాన్యం కొనుగోలు చేయరని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నూటికి నూరు శాతం ఈ క్రాప్‌లో నమోదు అయిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. తమవి కాని ఆస్తులు రేషన్ కార్డు జారీలో చూపిస్తున్న మాట నిజమే అని అదంతా లెగసీ వల్ల వచ్చిందని.. దీనిపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కందిపప్పు విషయంలో ప్రైస్ ఇంటర్వెన్షన్ అవసరం లేదని భావిస్తున్నామన్నారు. గోధుమ 1 కేజీ కుటుంబానికి ఇచ్చే ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పీడీఎస్ రైస్ విషయంలో 5 నిముషాల్లో నిర్ధారణ చేసి సీజ్ చేసే అవకాశం ఉంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
మంత్రి నారాయణ దుబాయ్ పర్యటన.. ప్రముఖ సంస్థల ఛైర్మన్లతో
సాగర హారతితో చక్కటి సాంప్రదాయానికి శ్రీకారం: మంత్రి కొల్లు రవీంద్ర
Read Latest AP News And Telugu News