Montha cyclone: ప్రతి ఒక్కరినీ ఆదుకుంటాం: మంత్రి కొల్లు రవీంద్ర
ABN , Publish Date - Oct 29 , 2025 | 09:16 PM
మొంథా తుపాన్ కారణంగా ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల బియ్యం అందిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. అలాగే రిలీఫ్ కేంద్రాల్లో తలదాచుకున్న ప్రతి కుటుంబానికి రూ. 3 వేలు ఆర్థిక సాయం కింద అందిస్తామన్నారు.
మచిలీపట్నం, అక్టోబర్ 29: మొంథా తుపాను కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. తుపాన్ తీరం దాటిన నేపథ్యంలో బుధవారం బందరు మండలంలోని తుపాన్ ప్రభావిత గ్రామాల్లో మంత్రి రవీంద్ర పర్యటించారు. అలాగే రిలీఫ్ క్యాంపుల్లో ఉన్న బాధితులను కలిసి వారికి ధైర్యం చెప్పారు. తుపాన్ తీరం దాటిందని.. ఈ నేపథ్యంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బాధితులకు సూచించారు.
అయితే తుపాన్ కారణంగా ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల బియ్యం అందిస్తామని ప్రకటించారు. అలాగే రిలీఫ్ కేంద్రాల్లో తలదాచుకున్న ప్రతి కుటుంబానికి రూ. 3 వేలు ఆర్థిక సాయం కింద అందిస్తామని పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో పంట నష్టం అంచనాలు వేసి ఆదుకుంటామని ఈ సందర్భంగా రైతులకు హామీ ఇచ్చారు. అలాగే చేనేత కార్మికులను సైతం అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.
ఇక మచిలీపట్నంలో ఇప్పటికే విద్యుత్ సరఫరా పూర్తి స్థాయిలో పునరుద్దరించామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. మొంథా తుపాన్ కారణంగా కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ క్రమంలో జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.
సహాయక చర్యలు చేపట్టాలని వారిని ఆదేశించింది. అలాగే సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనితా ఆర్టీజీఎస్ ద్వారా తుపాన్ ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో ప్రమాదం చాలా వరకు నివారించగలిగారు. మరోవైపు సీఎం చంద్రబాబు బుధవారం బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఒరిగిపోయిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతోపాటు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సత్యసాయి జయంతి వేడుకలపై పిల్.. పిటిషనర్‌కు హైకోర్టు వార్నింగ్
Read Latest AP News And Telugu News