Satyakumar Mental Health Statistics: పిల్లలపై ఒత్తిడి పెరుగుతోంది.. తల్లిదండ్రులు ఆలోచించాలి
ABN , Publish Date - Oct 10 , 2025 | 01:22 PM
ప్రపంచంలో చాలా మంది ఒత్తిడిని తట్టుకోలేక పోతున్నారని.. విద్యార్థుల ప్రతిభను మించి వారిపై ఒత్తిడి చేస్తున్నారని మంత్రి అన్నారు. తల్లిదండ్రులు ఆలోచనల్లో కూడా మార్పు రావాలని సూచించారు.
విజయవాడ, అక్టోబర్ 10: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఇండ్లాస్ హాస్పటల్స్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Minister Satyakumar Yadav) ప్రారంభించారు. నర్సింగ్ విద్యార్ధినిలతో కలిసి మంత్రి సత్యకుమార్ యాదవ్, కలెక్టర్ లక్ష్మీశా, డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, డి.ఎం.హెచ్.ఒ సుహాసిని ర్యాలీలో పాల్గొన్నారు. ఐఎంఏ హాల్ నుంచి ఏలూరు రోడ్, అప్సర థియేటర్ మీదుగా ఐఎంఏ హాల్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... నేటి పోటీ ప్రపంచంలో చాలా మంది ఒత్తిడిని తట్టుకోలేక పోతున్నారని.. విద్యార్థుల ప్రతిభను మించి వారిపై ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. తల్లిదండ్రులు ఆలోచనల్లో కూడా మార్పు రావాలని సూచించారు. మానసిక వ్యాధులతో బాధ పడేవారి సంఖ్య పెరుగుతోందన్నారు.
ప్రపంచంలో 90 కోట్ల మంది మానసిక వ్యాధులుతో బాధ పడుతున్నారని మంత్రి వెల్లడించారు. వారిని ముందుగా గుర్తించకపోవడం వల్ల ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందన్నారు. మన దేశంలో 15 కోట్ల మంది మానసిక ఇబ్బందులతో బాధ పడుతున్నారని తెలిపారు. సమాజంపై కూడా వీరి ప్రభావం చాలా ఉందన్నారు. ఆర్ధిక ప్రభావం కూడా ఒక ట్రిలియన్ డాలర్లుగా ఉందని అన్నారు. మానసిక వ్యాధులపై ప్రజల్లో సరైన అవగాహన కల్పించాలని వ్యాఖ్యానించారు. పిల్లలపై కూడా అనేక విధాలుగా ఒత్తిడి పెరుగుతోందన్నారు. యువత, చిన్న పిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. 2021లో 8067 మంది ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకున్నారని మంత్రి చెప్పుకొచ్చారు.
మానసిక వ్యాధులకు చికిత్స అందించేందుకు అవసరమైన సైకియాట్రిక్‌లు మన దగ్గర లేరన్నారు. లక్ష మందికి ముగ్గురు సైకియాట్రిక్‌లు అవసరం ఉంటే 0.75 శాతమే ఉన్నారని వివరించారు. ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందిస్తున్నామని.. దేశంలో ఏపీ మంచి వైద్యం అందించడంలో ముందున్నామని వెల్లడించారు. క్లినికల్ సైకాలజీ ఏర్పాటుకు ఇండ్లాస్‌కు అవకాశం ఇచ్చామన్నారు. మానసిక వ్యాధులపై ప్రజలు కూడా అవగాహన పెంచుకోవాలని సూచించారు. తొలి దశలోనే గుర్తించి సరైన వైద్యం ఇప్పించాలన్నారు. పిల్లలు బాగా ఎదగాలనీ కోరుకోవాలి.. కానీ ఒత్తిడి చేసి వారిని మానసికంగా ఇబ్బందులకు గురిచేయవద్దని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
వాటికి బానిస కావొద్దు: కలెక్టర్
మానసిక ధృడత్వం నేడు చాలా ముఖ్యమని కలెక్టర్ లక్ష్మీ శా అన్నారు. చాలా మంది చిన్న అంశాలకే ఒత్తిడికి గురి అవుతున్నారని.. నలుగురితో కలిసి ఉండలేక మెంటల్‌గా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నేటి సమాజంలో సెల్‌ఫోన్ కూడా మానసిక వ్యాధులకు ప్రధాన కారణంగా చెప్పుకొచ్చారు. గేమ్స్, సోషల్ మీడియా ప్రభావం యువతపై బాగా ఉంటుందని.. వాళ్ల ప్రపంచం దాటి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతోందన్నారు. సమాజం మొత్తం ఈ తరహా ఘటనలపై ఆలోచన చేయాలన్నారు. పిల్లలు సెల్ ఫోన్ గేమ్స్‌కు బానిస కాకుండా చూడాలని సూచించారు. సైకియాట్రిక్‌లు ద్వారా తొలి దశలో వైద్యం అందించేలా చూడాలని.. ప్రతి ఒక్కరూ మానసిక రుగ్మతలపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ లక్ష్మీ శా వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
చంద్రబాబు పేరుతో నకిలీ వీడియో కాల్.. కొత్త మోసానికి తెర
రుషికొండ ప్యాలెస్ వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ ఏం తేల్చిందంటే...
Read Latest AP News And Telugu News