AI Scam Andhra Pradesh: చంద్రబాబు పేరుతో నకిలీ వీడియో కాల్.. కొత్త మోసానికి తెర
ABN , Publish Date - Oct 10 , 2025 | 12:30 PM
ఉమా కాల్ చేసినట్లు ఏఐ ద్వారా అతని వీడియోతో కాల్ రావడంతో సదరు టీడీపీ నాయకుడు రూ.35 వేలు డబ్బును పంపారు. మరికొన్ని రోజులకు మళ్లీ తిరిగి ఫోన్ చేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ ఇప్పిస్తానని, కాసేపట్లో చంద్రబాబు వీడియో కాల్ చేస్తాడని నమ్మబలికాడు దుండగుడు.
అమరావతి, అక్టోబర్ 10: సాంకేతిక పరిజ్ఞానంతో నయా మోసానికి తెరలేపారు దుండగులు. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) వీడియో కాల్ చేసినట్లుగా చూపించి డబ్బులు లాగే ప్రయత్నం చేసింది ముఠా. సీఎంతో దేవినేని ఉమలు వీడియో కాల్ చేసినట్లుగా చూపించి డబ్బులు గుంజేందుకు ప్రయత్నంచగా.. ఆ మోసం కాస్తా బయట పడటంతో నిందితులను పట్టుకునేందుకు సైబర్ క్రైం పోలీసులు రంగంలోకి దిగారు. ఏఐ సహాయంతో చంద్రబాబు, దేవినేని ఉమ మొహాలతో తెలంగాణ టీడీపీ నాయకులకు నకిలీ వీడియో కాల్స్ చేసి డబ్బులు తీసుకొని ఘరానా మోసానికి పాల్పడ్డారు దుండగులు.
ఇందంతా నిజమని నమ్మిన 18 మంది తెలంగాణ టీడీపీ నాయకులు.. చంద్రబాబును కలిసేందుకు విజయవాడకు వెళ్లారు. అక్కడికి వెళ్లాక.. మోసపోయామని గ్రహించారు టీడీపీ నేతలు. నాయకులను మోసం చేసింది ఏలూరుకు చెందిన యువకుడిగా పోలీసులు గుర్తించారు. ఉమా కాల్ చేసినట్లు ఏఐ ద్వారా అతని వీడియోతో కాల్ రావడంతో సదరు టీడీపీ నాయకుడు రూ.35 వేలు డబ్బును పంపారు. మరికొన్ని రోజులకు మళ్లీ తిరిగి ఫోన్ చేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ ఇప్పిస్తానని, కాసేపట్లో చంద్రబాబు వీడియో కాల్ చేస్తాడని నమ్మబలికాడు దుండగుడు. చెప్పినట్టుగానే కాసేపటికి చంద్రబాబు మొహంతో పోలిన వ్యక్తి వీడియో కాల్ చేయడంతో టీడీపీ నేత నిజమని నమ్మాడు.
కాసేపటికి ఫోన్ చేసి విజయవాడకు వస్తే చంద్రబాబును కల్పించి, బీ ఫాం ఇప్పిస్తానని చెప్పడంతో 18 మంది టీడీపీ నాయకులు విజయవాడకు వెళ్లారు. హోటల్ బిల్లు కూడా తామే చెల్లిస్తామని చెప్పడంతో విజయవాడలోని ఒక హోటల్లో బస చేసేందుకు వెళ్లారు నాయకులు. సాయంత్రం తిరిగి ఫోన్ చేసి చంద్రబాబును కలిసేందుకు 8 మందికి మాత్రమే అనుమతి ఉందని, ఒక్కొక్కరు రూ.10 వేలు చెల్లించాలని దుండగులు తెలిపారు. ఈ క్రమంలో ఫుడ్ బిల్లు చెల్లించాలని అడిగిన హోటల్ సిబ్బందితో టీడీపీ నాయకులు గొడవకు దిగగా పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో అసలు విషయం బయపటడింది. వెంటనే సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
రుషికొండ ప్యాలెస్ వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ ఏం తేల్చిందంటే...
Read Latest AP News And Telugu News