Rainfall alert: అల్పపీడనం.. వర్షాలే వర్షాలు..
ABN , Publish Date - May 23 , 2025 | 08:54 AM
Rains Alert: ఆంధ్రప్రదేశ్‌లో ఉపరితల ఆవర్తనం కారణంగా ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. దానికి అల్పపీడనం తోడైంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు సూచించారు. శనివారం అల్లూరి జిల్లా, మన్యం, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు.
అమరావతి: తూర్పు మధ్య ఆరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం (Low pressure) ప్రభావంతో రానున్న 36 గంటల్లో అల్పపీడనం.. వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తు నిర్వహణశాఖ (IMD) హెచ్చరించింది. ఈనెల 27 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, రెండు రోజుల్లో అల్పపీడనం బలపడనుందని, అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు (Moderate rains) కురుస్తాయని అధికారులు సూచించారు. ఈ సమయంలో రైతులు (Formers) జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శనివారం అల్లూరి జిల్లా, మన్యం, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని, మిగతా జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపారు. ఆదివారం అల్లూరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. అలాగే ఆదివారం నెల్లూరు, సత్యసాయి, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు.
విశాఖ జిల్లాలో..
విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాయగా, సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. జీకేవీధి మండలం సీలేరు, ధారాలమ్మ ఘాట్ రోడ్డు, దుప్పులవాడ సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీని వల్ల ఘాట్ రోడ్డులో పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. జల విద్యుత్ కేంద్రం నుంచి సీలేరుకు విద్యుత్ సరఫరా అయ్యే విద్యుత్ లైన్‌లో ఇక ఇన్స్‌లేటర్ పేలిపోవడంతో సీలేరులో మూడు గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
Also Read: KTR: టీపీసీసీ ఛీఫ్ వ్యాఖ్యలతో దిగ్భ్రాంతి చెందా..
అరకులోయలో...
అరకులోయ మండలంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండకాసింది. ఆ తరువాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3.30 గంటల వరకు ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. గత పదిహేను రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలతో పాటు పిడుగులు కూడా పడనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా బుధవారం కురిసిన వర్షాలకు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో 5 మిల్లీమీటర్లు, అనంతపురం జిల్లా చిన్నమూష్టములో 51 మిల్లీమీటర్లు, నర్సీపట్నంలో 50 మిల్లీమీటర్లు, గుంటూరులో 48 మిల్లీమీటర్లు, కృష్ణా జిల్లాలో 17 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
త్వరలో నైరుతి రుతుపవనాల రాక
నైరుతి రుతుపవనాలు రానున్న రెండు, మూడు రోజుల్లో కేరళ తీరాన్ని తాకేందుకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని, ఆ తర్వాత దేశంలోని దక్షిణ ప్రాంతాల్లోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనాలు, రుతుపవనాల కదలికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. వర్షాలు పడుతున్న సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇండిగో పైలట్ అభర్థనను తిరస్కరించిన పాక్
For More AP News and Telugu News