Chairman Chalasani.. కృష్ణ మిల్క్ యూనియన్... ఇప్పుడు ఏ స్థాయిలో ఉందంటే..
ABN , Publish Date - Feb 05 , 2025 | 11:47 AM
కృష్ణామిల్క్ యూనియన్ విజయవంతంగా 60 ఏళ్లు పూర్తి చేసుకుని వజ్రోత్సవం జరుపుకొంటోందని యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఆనందం వ్యక్తం చేశారు. ఈనెల 11వ తేదీ నుంచి జరగనున్న వేడుకల్లో పాల్గొనాల్సిందిగా పాడి రైతులను ఆహ్వానించారు.
కృష్ణాజిల్లా: పామర్రు మండలం, జమి గొల్వేపల్లిలో కృష్ణ మిల్క్ యూనియన్ వజ్రోత్సవ వేడుకల (Krishna Milk Union Diamond Jubile Celebrations) సన్నహక కార్యక్రమం బుధవారం జరిగింది. ఈనెల 11వ తేదీ నుంచి జరగనున్న వేడుకల్లో పాల్గొనాల్సిందిగా పాడి రైతులను (Dairy Farmers) కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు (Chairman Chalasani Anjaneyulu) ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన రైతులతో కలిసి యూనియన్ వజ్రోత్సవ వేడుకల కేక్ కట్ చేశారు. అలాగే పాడి రైతులకు బోనస్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కృష్ణ మిల్క్ యూనియన్ అంకురార్పణ మాజీ సీఎం, దివంగత ఎన్టీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి ఫలితమేనని అన్నారు. ఇప్పుడు ఇది లాభాల బాటలో పయనిస్తోందని, రైతాంగానికి అన్ని రకాల ప్రోత్సాహాలు అందిస్తుందన్నారు. పాడి రైతుల సంక్షేమం, పాడి పరిశ్రమ అభివృద్ధే యూనియన్ లక్ష్యమని అన్నారు. ఒక్క సొసైటీతో ప్రారంభమైన కృష్ణ మిల్క్ యూనియన్... ఇప్పుడు 12 వందల సొసైటీలతో... 12 కోట్ల లీటర్ల పాలను సేకరించే స్థాయికి ఎదిగిందని అన్నారు. ప్రజలకు నాణ్యమైన పాల ఉత్పత్తులు అందిస్తూ... ముందుకు సాగుతున్న.... కృష్ణ మిల్క్ యూనియన్ వజ్రోత్సవ వేడుకల్లో పాడి రైతులందరూ పాల్గొనాలని చలసాని ఆంజనేయులు పిలుపిచ్చారు.
ఈ వార్త కూడా చదవండి..
ఇది వజ్రోత్సవ విజయం..
కృష్ణామిల్క్ యూనియన్ విజయవంతంగా 60 ఏళ్లు పూర్తి చేసుకుని వజ్రోత్సవం జరుపుకొంటోందని యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఆనందం వ్యక్తం చేశారు. పాలఫ్యాక్టరీలోని సమావేశపు హాల్లో గత నెల 28న పాలకవర్గం, అధికారులు.. వజ్రోత్సవ వేడుకల బ్రోచర్, పోస్టర్‌ను ఆవిష్కరించారు. క్షీరవిప్లవ పితామహుడు డాక్టర్ కురియన్ సహకారంతో యూనిసెఫ్ ద్వారా ఎయిడెడ్ ఇంటిగ్రేటెడ్ మిల్క్‌ప్రాజెక్ట్ మంజూరైందని, 1965, ఫిబ్రవరి 11న ఈ యూనియన్‌కు తొలి అడుగు పడిందని, నాటి నుంచి ఆరు దశాబ్దాలుగా పాడి రైతుల అభివృద్ధికి, పాడి పరిశ్రమకు చిరునామాగా కృష్ణా యూనియన్ మారిందన్నారు. ఎందరో మహానుభావులు నిస్వార్థంగా సంస్థ ప్రగతికి కృషి చేశారన్నారు. ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు స్వయం ప్రతిపత్తి కల్పించారని చెప్పారు. 1997 తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు, వేతనాలు సైతం సకాలంలో చెల్లించలేని పరిస్థితిలో ఉన్న యూనియన్‌ను ఆదుకోవడానికి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చూపిన చొరవ మరువలేనిదన్నారు. కాగా, 60 ఏళ్ల కిందట పామర్రులో తొలి పాలసేకరణను 646 లీటర్లు, లీటరుకు 50 పైసల కొనుగోలుతో ప్రారంభించారని, ప్రస్తుతం 1,200 గ్రామాల్లో ఏటా 11 కోట్ల లీటర్ల పాలసేకరణ, రూ.1,200 కోట్ల వార్షిక టర్నోవర్‌కు చేరుకున్నామని చెప్పారు. రూ.200 కోట్ల మిగులు నిధులను సాధించగలిగిందన్నారు. లక్షా50 వేల మంది పాడి రైతుల కుటుంబ సంస్థగా, ఉపాధి కల్పించే వనరుగా కొనసాగుతోందని చెప్పారు. దేశంలోనే అత్యధిక పాలసేకరణ ధర అందిస్తున్న సంస్థగా నిలిచిందన్నారు. ఐదేళ్లలో వార్షిక టర్నోవర్‌ను రూ.570 కోట్ల నుంచి రూ.1,200 కోట్లకు పెంచుకోగలిగామని, ఇతర పాల సహకార సంస్థలకు భిన్నంగా ప్రతి నాలుగు నెలలకోసారి లాభాలను పంచేలా రైతులకు బోనస్ అందజేస్తున్నామని చెప్పారు. 100కు పైగా ప్రోడక్టులను అందిస్తున్నామన్నారు. సభ్యుడైన పాడిరైతు చనిపోతే.. క్షీరబంధు పథకం కింద రూ.50 వేల సాయం అందిస్తున్నామని, ఇప్పటి వరకు 3 వేల కుటుంబాలను ఆదుకున్నామని పేర్కొన్నారు. సభ్యుల పిల్లలకు పెళ్లిళ్లు జరిగితే సంస్థ తరఫున బంగారు కాయిన్‌అందజేసే ‘కల్యాణమస్తు’ పథకాన్ని చేపట్టామని, 4 వేల జంటలకు అందించామని చలసాని తెలిపారు. పిల్లలకు ప్రతిభ పథకం, రైతులకు హెల్త్‌కార్డులు, వైద్యశిబిరాల నిర్వహణ, గుండె శస్త్రచికిత్సలు వంటివి చేస్తున్నామన్నారు. నిరంతరం పశువుల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు 12 వెటర్నరీ అంబులెన్సులు కొనడంతో పాటు 40 మంది వరకూ వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. పశువులకు రూ.లక్ష బీమా సదుపాయం కల్పించామని, రాయితీపై పశుదాణా, ఆరోగ్యకరమైన పశు సంతానంలో మేలుజాతి వృద్ధికి కృత్రిమ వీర్య పంపిణీ వంటి ఏర్పాట్లనూ సంస్థ చేపట్టిందన్నారు. ప్రతి లీటర్ పాలపైనా రూ.2 సంక్షేమం కోసమే ఖర్చు చేస్తున్నామన్నారు. దీర్ఘకాలంగా కన్సాలిడేటెడ్ వేతనంపై పనిచేస్తున్న 390 మంది ఉద్యోగులను ఈ ఐదేళ్లలో పర్మినెంట్ చేశామన్నారు.
వైసీపీ కుటిల ప్రయత్నాలను వమ్ము చేస్తూ..
కృష్ణా మిల్క్ యూనియన్‌అంటే.. లక్షన్నర కుటుంబాల సమష్టి కృషి అని, గత ప్రభుత్వం అమూల్ వంటి ఇతర రాష్ర్టాలకు చెందిన సంస్థను తెచ్చి, పోటీకి పెట్టి దెబ్బతీయాలని చూసినా.. సమష్టి కృషితో ఆ ప్రయత్నాలను వమ్ము చేయగలిగామన్నారు. ఎన్నో ఇబ్బందులు అధిగమించి సుమారు రూ.165 కోట్లతో వీరవల్లిలో నిర్మించిన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కామధేను ప్లాంటును త్రిదిండి చినజీయర్‌స్వామి చేతులమీదుగా ప్రారంభించామన్నారు. ఈ విజయం కృష్ణా మిల్క్ యూనియన్‌సభ్యులందరిదన్నారు. ఈ వజ్రోత్సవాల్లో పాడిరైతు సంక్షేమం, వినియోగదారుల సంతృప్తి, ఉద్యోగుల ప్రయోజనం.. అనే మూడు సూత్రాలను ముందుకు తీసుకెళ్లాలని ప్రతిన పూనుతున్నామని, ఫిబ్రవరి 11 నుంచి గ్రామాల్లో ఘనంగా వేడుకలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీ కొల్లి ఈశ్వరబాబు, పలువురు డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రెచ్చిపోతున్న పావురాళ్ల పందాల నిర్వాహకులు
తిరుమల వెళ్లేవారికి గుడ్‌న్యూస్ ..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News