Karredu Land Acquisition: రైతులు నమ్మారు.. భూములు ఇచ్చారు.. కరేడు ల్యాండ్స్‌పై మంత్రి అనగాని
ABN , Publish Date - Sep 18 , 2025 | 01:28 PM
భూసేకరణ కారణంగా ఉపాధి కోల్పోయే కుటుంబాలకు ఉపాధిని కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే అని మంత్రి అనగాని స్పష్టం చేశారు. పారిశ్రామిక హబ్ ఏర్పాటు ద్వారా వచ్చే ఉద్యోగావకాశాల్లో స్థానికులకే మొదటి అవకాశాలు ఉంటాయన్నారు.
అమరావతి, సెప్టెంబర్ 18: శాసనమండలిలో కరేడు భూములపై చర్చ కొనసాగుతోంది. ఈ భూములకు సంబంధించి సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister Anaganai Satyaprasad) సమాధానమిచ్చారు. పారిశ్రామిక హబ్‌ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో రైతుల నుంచి భూములను సేకరించినట్లు వివరించారు. భూసేకరణ కారణంగా ఉపాధి కోల్పోయే కుటుంబాలకు ఉపాధిని కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. పారిశ్రామిక హబ్ ఏర్పాటు ద్వారా వచ్చే ఉద్యోగావకాశాల్లో స్థానికులకే మొదటి అవకాశాలు ఉంటాయన్నారు. కరేడులో ఇండోసోల్ కంపెనీ ఏర్పాటు చేయబోయే పారిశ్రామిక హబ్‌కు 8,200 ఎకరాలు సేకరిస్తున్నామని.. రైతులను ఒప్పించి భూసేకరణ చేస్తున్నామని వెల్లడించారు.
ఇప్పటికే 500 ఎకరాలు ఇచ్చేందుకు రైతులు లిఖిత పూర్వకంగా అంగీకారం తెలిపారని మంత్రి చెప్పారు. పారిశ్రామిక హబ్ ఏర్పాటు ద్వారా తమ ప్రాంత రూపురేఖలు మారతాయని రైతులు నమ్మారన్నారు. నిజమైన పారిశ్రామికాభివృద్ధిని సాధించేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. కియా పరిశ్రమ రావడంతో అనంతపురం జిల్లా అభివృద్ధిలో పరుగులు తీసిందని గుర్తుచేశారు. వాన్ పిక్ ప్రాజెక్ట్ వచ్చి ఉంటే తమ జిల్లా అయిన బాపట్ల కూడా ఎంతో అభివృద్ధి చెంది ఉండేదన్నారు.
రేపటి రోజున కరేడు ప్రాంతం రూపురేఖలు కూడా మారిపోతాయని వెల్లడించారు. పరిశ్రమలు స్థాపించి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉధ్దేశ్యంతోనే భూ సేకరణ చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. ‘నా బంధువులకో, నా స్నేహితులకో పరిశ్రమలు ఇవ్వడం లేదు. వేరొకరి పరిశ్రమలను, ఫ్యాక్టరీలను లాక్కునే ప్రభుత్వం మాది కాదు’ అంటూ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
పదిరోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు... బీఏసీలో నిర్ణయం
తొలిసారి మండలికి నాగబాబు.. పవన్ దిశానిర్దేశం
Read Latest AP News And Telugu News