Supreme Court: ఇసుక స్కాం కేసు.. సుప్రీంలో కీలక పరిణామం
ABN , Publish Date - Dec 08 , 2025 | 04:14 PM
ఇసుక కుంభకోణం కేసుకు సంబంధించి సుప్రీంలో జేపీ వెంచర్స్ ఐఏ దాఖలు చేసింది. ఎన్జీటీ విధించిన జరిమానాను తాము చెల్లించాల్సిన అవసరం లేదంటూ సుప్రీంలో జేపీ వెంచర్స్ వాదనలు వినిపించింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 8: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో జరిగిన ఇసుక కుంభకోణం కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్జీటీ (NGT) విధించిన రూ.18 కోట్ల జరిమానాపై జేపీ వెంచర్స్ ఈరోజు (సోమవారం) సుప్రీంలో ఐఏ దాఖలు చేసింది. ఎన్జీటీ విధించిన జరిమానాను తాము చెల్లించాల్సిన అవసరం లేదంటూ సుప్రీంలో జేపీ వెంచర్స్ వాదనలు వినిపించింది. ఇసుక తవ్వకాలకు పర్యావరణ అనుమతులు తీసుకున్నది ప్రభుత్వమే కాబట్టి తాము జరిమానా ఎందుకు చెల్లించాలని వాదించింది.
కాగా.. చిత్తూరు జిల్లాలోని ఆరణీయార్ నదీ పరీవాహక ప్రాంతాల్లో బి-2 కేటగిరీలో 18 రీచ్‌లలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపినందుకు జేపీ వెంచర్స్‌కు ఎన్జీటీ రూ.18కోట్లు జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్జీటీ తీర్పుపై సుప్రీంను జేపీ వెంచర్స్ ఆశ్రయించింది. ఎన్జీటీ విధించిన జరిమానాను సుప్రీంకోర్టులో డిపాజిట్ చేయాలని జేపీ వెంచర్స్‌కు ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే సుప్రీం ఆదేశాలలో సవరణ కోరుతూ తాజాగా జేపీ వెంచర్స్ ఐఏను దాఖలు చేసింది.
ఈసీలు ప్రభుత్వమే తీసుకుందని, తాము తవ్వకాలు మాత్రమే చేపట్టినందున జరిమానా ప్రభుత్వమే చెల్లించాలని జేపీ వెంచర్స్ సుప్రీంకు తెలియజేసింది. ఇప్పటి వరకూ ఈ వాదనను ఎక్కడా వినిపించకుండా కొత్తగా తెరపైకి జేపీ వెంచర్స్ తీసుకొచ్చింది. జేపీ వెంచర్స్ వాదనలకు సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి సుప్రీం కోర్టు వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి..
సొంత ఇలాకాలో జగన్‌కు గట్టి ఎదురుదెబ్బ
ఎమ్మెల్యే మాధవి ప్రోటోకాల్ అంశం.. ప్రివిలేజ్ కమిటీ ఏం తేల్చిందంటే
Read Latest AP News And Telugu News